ఆ రోజు కాక్ పిట్ లో ఏం జరిగింది? ఇజ్రాయెల్ ప్రధానికి చెప్పిన కెప్టెన్
ఆయన సాదాసీదా వ్యక్తి కాదు. ప్రపంచంలో అత్యంత పవర్ ఫుల్ దేశానికి.. ప్రపంచంలోనే అత్యుత్తమ నిఘా సంస్థ అయిన మసూద్ ను కంటిచూపుతో కంట్రోల్ చేసే శక్తి ఆయన సొంతం.
By: Garuda Media | 5 Oct 2026 12:53 PM ISTఆయన సాదాసీదా వ్యక్తి కాదు. ప్రపంచంలో అత్యంత పవర్ ఫుల్ దేశానికి.. ప్రపంచంలోనే అత్యుత్తమ నిఘా సంస్థ అయిన మసూద్ ను కంటిచూపుతో కంట్రోల్ చేసే శక్తి ఆయన సొంతం. తాను టార్గెట్ చేయటం మొదలు పెడితే అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడికి మాటను సైతం పట్టించుకోకుండా ముందుకుసాగే మొండిఘటం. ఆయనే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు. వందలాది మంది తన దేశీయులను అసమాన తెగువతో కాపాడిన ఫ్లైదుబాయ్ పైలట్ కెప్టెన్ స్మిత్ ముచ్ఛార్ తో వీడియో కాల్ లో మాట్లాడారు.
కాక్ పిట్ లో కో పైలట్ చేసిన దాడితో తీవ్ర గాయాలపాలై.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన్ను.. భారత ప్రధాని నరేంద్ర మోడీ.. దుబాయ్ యువరాజు.. తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని నేరుగా మాట్లాడారు. భారత.. ఇజ్రాయెల్ ప్రధానులు వీడియోకాల్ లో ముచ్చటిస్తే.. దుబాయ్ యువరాజు మాత్రం నేరుగా ఆసుపత్రిలోని ఐసీయూకి వెళ్లి పరామర్శించి.. అతడ్ని అభినందించారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే ఇంతకూ ‘ఆ రోజు కాక్ పిట్ లో ఏం జరిగింది? కో పైలట్ అరాచకం ఎలా మొదలైంది? కెప్టెన్ స్మిత్ కు తగిలిన గాయాలు ఎంత పెద్దవి? ఎంత తీవ్రమైనవి? కెప్టెన్ స్మిత్ సాహసం ఎంత గొప్పది? లాంటి సందేహాలకు స్పష్టమైన సమాధానాలు బయటకు రాలేదు. ఆ లోటును తీర్చేశారు ఇజ్రాయెల్ ప్రధాని. కెప్టెన్ స్మిత్ తో మాట్లాడిన సందర్భంగా కాక్ పిట్ లోని దారుణ ఉదంతం గురించి ఆయన అడిగి.. ఆ రోజు ఏం జరిగిందన్న విషయంపై స్పష్టత తీసుకోవటమే కాదు.. ప్రపంచానికి కూడా తెలిసేలా చేశారు.
వీడియో కాల్ లో ఇజ్రాయెల్ ప్రధాని అడిగిన ప్రశ్నలకు కెప్టెన్ స్మిత్ ఏం చెప్పారు? ఆ రోజు ఆ దారుణ ఉదంతం ఎలా జరిగిందన్న దానిపై ఆయన మాటల్లోనే చదివితే.. ‘‘మా విమాన ప్రయాణం ఎప్పటిలానే సాధారణంగా మొదలైంది. కాక్ పిట్ లో నాతో ఉన్న కో పైలట్ ప్రార్థన చేసుకుంటానని చెప్పాడు. నా వెనుక వైపు వెళ్లాడు. అతను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు అతడ్ని చూడటం ఎందుకని భావించి.. గౌరవంతో నేను వెనుక వైపు అస్సలు చూడలేదు. నాలుగైదు నిమిషాల తర్వాత హఠాత్తుగా నా తల వెనుక భాగంలో ఒక బలమైన దెబ్బ తగిలింది. విమానం కాక్ పిట్ లో ఏదో కూలిపోయి నా మీద పడిందేమో.. ఏదైనా తీవ్ర ప్రమాదం మొదలైందని భావించా. కానీ నా పరిస్థితి మరింత దారుణంగా మారింది. వెంటవెంటనే గొడ్డలి లాంటిదేదో నా వీపు.. తలను బలంగా తాకుతోంది. కో పైలట్ విచక్షణరహితంగా దాడి చేస్తున్నట్లు అర్థమైంది’ అంటూ అసలు దాడి ఎలా మొదలైందో వివరించారు.
కో పైలట్ ను ఎదుర్కోవటానికి తానేం చేశానో స్మిత్ మాటల్ని చదివితే.. అతడి ధైర్యం.. అతను చేసిన సాహసం ఎంత పెద్దదో ఇట్టే అర్థమవుతుంది. ‘‘కో పైలట్ ను అడ్డుకోవటానికి చాలా ప్రయత్నించా. అతను కొట్టిన దెబ్బల ధాటికి ఒక్కసారి నా చూపు మసకబారింది. విమానం నా అధీనంలో నుంచి తప్పి.. వేగంగా కిందకు పడిపోతుందని అర్థమైంది. కాక్ పిట్ తలుపును తెరిచా. కానీ.. కో పైలట్ వెంటనే దానిని మూసేశాడు. గాయాలతో కాక్ పిట్ నేలపై పడిపోయా. విమానం కిందకు దూసుకెళుతున్న వైనం.. గాలి హోరు.. ప్రయాణికుల అర్తనాదాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇదే నా చివరి విమాన ప్రయాణమని అన్పించింది. నా శక్తినంతా కూడదీసుకొని కాక్ పిట్ తలుపు తెరిచా. లక్కీగా అప్పటికే ప్రయాణికులు తలుపు వద్ద నిలుచొని బలంగా లోపలకు దూసుకొచ్చేందుకు సిద్దంగా ఉన్నారు’’ అంటూ అప్పటి వరకు తాను ఎదుర్కొన్న పరిస్థితిని పూసగుచ్చినట్లు వివరించారు.
తలుపును తెరవటానికి తానేం చేశానో కెప్టెన్ స్మిత్ చాలా వివరంగా వివరించారు. ‘కాక్ పిట్ తలుపును తెరిచేందుకు లోపలి వైపున ఒక నాబ ఉంటుంది. బయటివైపు నుంచి దీనిని కేవలం ఒక కోడ్ ద్వారానే తెరవగలరు. బయట ఉన్న విమాన సిబ్బంది ఆ కోడ్ ను టైప్ చేసి తెరిచే ప్రయత్నం చేశారు.కానీ.. కో పైలట్ డోర్ తెరవకుండా అడ్డుకున్నాడు. ఆ పరిస్థితుల్లో కాక్ పిట్ తలుపు తెరవటానికి ఉన్న ఏకైక మార్గం ఆ నాబ్ ను తిప్పటం మాత్రమే.దాని కోసం నా చేతులు ప్రయత్నిస్తున్నాయి. అది నా చేతికి తగలగానే.. వెంటనే తిప్పేసి తలుపు తెరిచాను. పోరాడకుండా ఓడిపోవటం నాకు ఇష్టం లేదు. తలుపు తెరవగానే ఒక్క ఉదుటున వాళ్లు లోపలకు వచ్చారు. కో పైటల్ చేతులు విరిచి పట్టుకున్నట్లు నాకు లీలగా గుర్తుంది’’ అంటూ ఆ దారుణ ఉదంతంపై పూర్తి వివరాల్ని.. ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ను ఇచ్చేశారు.
కెప్టెన్ స్మిత్ మచ్ఛార్ ప్రపంచ హీరో అన్న టైటిల్ కు నూటికి నూరు శాతం అర్హుడన్న విషయాన్ని అర్థమయ్యే తన సంభాషణ వీడియో క్లిప్ ను ఇజ్రాయెల్ ప్రధాని షేర్ చేశారు. ఈ వీడియో క్లిప్ వైరల్ గా మారింది. అంతేకాదు.. అసలు ఆ రోజు కాక్ పిట్ లో ఏం జరిగిందన్న దానిపై అందరికి అన్ని విషయాలు తెలిసేలా చేశాయని చెప్పాలి.
