పిల్లల ఆరోగ్యంతో ప్రమోషన్ల ఆటలు.. మామ్ ఇన్ఫ్లుయెన్సర్లకు ఎఫ్ఎస్ఎస్ఏఐ షాక్
శిశువుల ఎదుగుదల మెరుగుపడుతుందని.. రోగనిరోధక శక్తి పెరుగుతుందని.. మెదడు చురుగ్గా మారుతుందని ప్రచారం చేస్తూ పలువురు 'మామ్ ఇన్ఫ్లుయెన్సర్లు' చేసే రీల్స్ ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి.
By: A.N.Kumar | 24 Oct 2026 12:02 PM ISTడిజిటల్ యుగంలో ప్రతి చిన్న విషయానికి సోషల్ మీడియాపై ఆధారపడటం సాధారణమైపోయింది. ముఖ్యంగా గర్భధారణ, శిశువుల పెంపకం, వారి పోషకాహార విషయంలో కొత్త తల్లులు ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ వీడియోలను ఎక్కువగా అనుసరిస్తున్నారు. అయితే తల్లుల అమాయకత్వాన్ని.. నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని కొన్ని వ్యాపార సంస్థలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు శాస్త్రీయ ఆధారాలు లేని వాదనలతో వ్యాపారం చేస్తున్నారనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) రంగంలోకి దిగి కఠిన చర్యలకు ఉపక్రమించింది.
ప్రచారంలో నిబంధనల ఉల్లంఘన.. నిపుణుల హోదా వర్తించదు
శిశువుల ఎదుగుదల మెరుగుపడుతుందని.. రోగనిరోధక శక్తి పెరుగుతుందని.. మెదడు చురుగ్గా మారుతుందని ప్రచారం చేస్తూ పలువురు 'మామ్ ఇన్ఫ్లుయెన్సర్లు' చేసే రీల్స్ ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. కేవలం బ్రాండ్లు ఇచ్చే స్క్రిప్ట్‌ను చదువుతూ ఎలాంటి శాస్త్రీయ ధృవీకరణ లేని ఉత్పత్తులను ప్రమోట్ చేయడం ప్రజారోగ్యానికి ముప్పుగా పరిణమిస్తోంది. సోషల్ మీడియాలో లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్నంత మాత్రాన వారికి పీడియాట్రిక్ పిల్లల వైద్యం లేదా పోషకాహార నిపుణుల హోదా రాదని తల్లిదండ్రులు గుర్తించాల్సిన అవసరం ఉంది.
ప్రముఖ సంస్థలు, ఇన్ఫ్లుయెన్సర్లకు నోటీసులు
ఈ నిబంధనల ఉల్లంఘనపై తీవ్రంగా పరిగణించిన ఎఫ్ఎస్ఎస్ఏఐ.. నెస్లే ఇండియా, అబాట్, న్యూట్రీషియా, మీడ్ జాన్సన్ వంటి ప్రముఖ బేబీ ఫుడ్ తయారీ సంస్థలతో పాటు ఇరా ఫాతిమా వంటి పలువురు ప్రముఖ ఇన్ఫ్లుయెన్సర్లకు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. 1992 నాటి 'ఇన్ఫాంట్ మిల్క్ సబ్స్టిట్యూట్స్, ఫీడింగ్ బాటిల్స్ అండ్ ఇన్ఫాంట్ ఫుడ్స్ (ఐఎంఎస్) చట్టం' ప్రకారం శిశువుల పాల ప్రత్యామ్నాయాలు, ప్యాక్ చేసిన శిశు ఆహారాల ప్రచారాలపై కఠినమైన ఆంక్షలు ఉన్నాయి. డిజిటల్ లేదా సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేసినప్పటికీ ఈ చట్టపరమైన నిబంధనల నుండి ఎవరూ మినహాయింపు పొందలేరని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
తల్లిదండ్రుల బాధ్యత.. జాగ్రత్తలు
సోషల్ మీడియా ప్రచారాలను ఉచిత వైద్య సలహాగా భావించవద్దు. పిల్లల ఆహారంలో మార్పులు చేసే ముందు తప్పనిసరిగా పిల్లల వైద్యుడిని సంప్రదించాలి. లేబుల్స్ పరిశీలించి బేబీ ఫుడ్ కొనుగోలు చేసేటప్పుడు ఉత్పత్తి లేబుల్, అందులోని పోషకాల వివరాలు, వయస్సు పరిమితుల సూచనలను జాగ్రత్తగా చదవాలి. పారదర్శకత లేని ప్రచారాలను నమ్మవద్దు. ఇన్ఫ్లుయెన్సర్లు చేసే పెయిడ్ ప్రమోషన్లను గుడ్డిగా నమ్మకుండా, అందులోని నిజానిజాలను సరిచూసుకోవాలి. బిడ్డల ఆరోగ్యం వ్యాపార లాభాలకు సాధనం కాకూడదని, ప్రకటనల్లో పారదర్శకత, శాస్త్రీయ ఆధారాలు ప్రాథమిక ప్రాధాన్యత కావాలని ఈ పరిణామం స్పష్టం చేస్తోంది.
