ఖఠ్మండూ రక్త సిక్తం: పోలీసుల కాల్పుల్లో 15 మంది మృతి
నేపాల్ రాజధాని ఖఠ్మండూ అంటే.. ప్రశాంతతకు మారు పేరు. చుట్టూ అనేక బౌద్ధారామాలతో ఈ ప్రాంతం పర్యాటకంగా ఎంతో పేరు తెచ్చుకుంది.
By: Garuda Media | 8 Sept 2025 6:12 PM ISTనేపాల్ రాజధాని ఖఠ్మండూ అంటే.. ప్రశాంతతకు మారు పేరు. చుట్టూ అనేక బౌద్ధారామాలతో ఈ ప్రాంతం పర్యాటకంగా ఎంతో పేరు తెచ్చుకుంది. దేశ విదేశాల నుంచి అనేక మంది పర్యాటకులు ఖఠ్మండూకు వస్తుంటారు. అలాంటి కీలక రాజధాని ప్రాంతం రక్త సిక్తంగా మారింది. పోలీసుల బలగాలు జరిపిన కాల్పుల్లో ఏకంగా 15 మంది యువత ప్రాణాలు కోల్పాయారు. వీరిలో ఇద్దరు విద్యార్థినులు కూడా ఉన్నట్టు సమాచారం. మరో 80 మందికి పైగా తీవ్రంగా గాయాలపాలయ్యారు. వందలాది మంది ఆందోళన కారులను పోలీసులు అరెస్టు చేశారు. స్థానికంగా ఉన్న జైళ్లు కిక్కిరిసిపోవడంతో ఓపెన్ జైళ్లను ఏర్పాటు చేశారు.
ఏం జరిగింది?
నేపాల్ ప్రధాని కేపీ ఓలీ నేతృత్వంలోని ప్రభుత్వం.. సామాజిక మాధ్యమాలకు సంబంధించి కొత్త చట్టం రూపొందించింది. దేశంలో ఏ సామాజిక మాధ్యమం అయినా.. ప్రభుత్వ సమాచార శాఖ వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నది ఈ చట్టం ప్రధాన ఉద్దేశం. దీనికి సంబంధించి ఆగస్టు 28వ తేదీ వరకు గడువు విధించారు. అయితే.. గడువు లోపు.. కొన్ని సామాజిక మాధ్యమాలే రిజిస్ట్రేషన్ చేయించుకున్నాయి. ఎక్కువ సంఖ్యలో రిజిస్ట్రేషన్ చేయించుకోవడంలో నిర్లక్ష్యం వహించాయి. దీనిని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం ఆయా మాధ్యమాలను నిషేధిస్తూ.. ఈ నెల 4న అర్థరాత్రి నిర్ణయం తీసుకుంది.
వీటిని ఎవరైనా వినియోగించినా కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించింది. ఇదే.. తీవ్ర ఆందోళనలకు, ఉద్యమాలకు కూడా దారితీ సింది. సామాజిక మాధ్యమం(సోషల్ మీడియా) భావప్రకటనా స్వేచ్ఛకు ప్రతీకగా మారిన నేపథ్యంలో నేపాల్ రాజ్యాంగం కూడా దీనిని అనుమతి ఇస్తోంది. ఇప్పుడు ఓలీ సర్కారు దీనిపై నిషేధం విధించడంతో దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలతో పాటు.. సోష ల్ మీడియా ఇన్‌ఫ్ల్యుయెన్సర్లు, సాధారణ మీడియా ప్రతినిధులు ప్రధాని నిర్ణయాన్ని తప్పుబడుతూ.. ఆందోళనలకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమించి.. పార్లమెంటును ముట్టడించాయి. కొందరు ఆందోళన కారులు పార్లమెంటులోకి దూసుకుపోయారు.
దీనిని తీవ్రంగా పరిగణించిన ఓలీ ప్రభుత్వం కాల్పులకు ఆదేశించింది. దీంతో భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో 15 మంది వరకు యువత పార్లమెంటు ప్రాంగణంలోనే మృతి చెందారు. ఇక, పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. వందలాది మందిని పోలీసు లు అరెస్టు చేశారు. ఈ అల్లర్ల నేపథ్యంలో ఖఠ్మండు సహా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. కనిపిస్తే కాల్చి వేత ఉత్తర్వులు అమలవుతున్నాయి.
ఏయే మాధ్యమాలపై నిషేధం..?
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్, యూట్యూబ్, ఎక్స్, రెడిట్, లింక్డిన్ లపై నిషేధం విధించారు. ఇక, టిక్‌టాక్, వైబర్, విట్క్, నింబజ్, పోపో లైవ్ లకు మాత్రమే అనుమతి ఉంది. అయితే.. యూట్యూబ్ నిషేధమే ఇప్పుడు ఇంత వివాదానికి కారణంగా మారిందన్న విశ్లేషణలు వస్తున్నాయి. అనేక మంది యువత యూట్యూబ్ కంటెంట్ ప్రొవైడర్లుగా మారి ఆదాయం పొందుతున్నారు. దీనిపై నిషేధం విధించడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఇదిలావుంటే.. ఆయా సంస్థలు నిషేధంపై ఇంకా స్పందించకపోవడం గమనార్హం.
