ఖైదీల పరారీ.. ఆర్మీ కాల్పులు.. తాత్కాలిక ప్రభుత్వం దిశగా జెన్-జెడ్ యువత.. సాధ్యమేనా?
నేపాల్ మరోసారి రాజకీయ అశాంతి అగ్నికుండంగా మారింది. జెన్-జెడ్ ఆందోళనలు కేవలం వీధుల్లోనే కాదు, జైళ్ల గోడల్లో కూడా ప్రభావం చూపుతున్నాయి.
By: A.N.Kumar | 11 Sept 2025 3:37 PM ISTనేపాల్ మరోసారి రాజకీయ అశాంతి అగ్నికుండంగా మారింది. జెన్-జెడ్ ఆందోళనలు కేవలం వీధుల్లోనే కాదు, జైళ్ల గోడల్లో కూడా ప్రభావం చూపుతున్నాయి. తాజాగా రామెచాప్ జైలు నుంచి పారిపోతున్న ఖైదీలపై ఆర్మీ కాల్పులు జరిపిన సంఘటన దేశంలో పెరిగిపోతున్న అస్థిరతకు ప్రతిబింబం. ప్రశ్న ఏమిటంటే.. ఒక సాధారణ సోషల్ మీడియా నిషేధంపై మొదలైన నిరసనలు ఎందుకు ఈ స్థాయికి చేరాయన్నది అంతుబట్టని వ్యవహారంగా మారింది.
ప్రజాస్వామ్య వ్యతిరేక కఠిన నిర్ణయాలు.. మూల కారణం
నేపాల్ యువతను "జెన్-జెడ్" తరగతి అని పిలుస్తారు. వీరు సోషల్ మీడియా, సాంకేతిక పరిజ్ఞానం ద్వారా రాజకీయ అవగాహన పెంచుకున్నవారు. సోషల్ మీడియా నిషేధం వీరి స్వేచ్ఛను కత్తిరించిందనే భావన కలిగింది. ఇదే నిరసనలకు బీజం వేసింది. కానీ ఆ ఆగ్రహం వెంటనే అవినీతి వ్యతిరేక ఉద్యమంగా మారింది. ఎందుకంటే, ప్రజలు సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య అదే.
జైళ్ల నుంచి 7,000 మంది ఖైదీల పరారీ.. ప్రమాదకర సంకేతం
కాఠ్‌మాండూ, పోఖరా, లలిత్‌పుర్ సహా పలు జైళ్ల నుంచి వేలాది మంది ఖైదీలు పారిపోయారు. ఈ సంఖ్య 7,000 దాటిందని సమాచారం. ఒక దేశంలో ఈ స్థాయిలో ఖైదీలు తప్పించుకోవడం, సరిహద్దుల దాకా చేరడం, అంతేకాక భారత్‌లో పట్టుబడడం.. అన్నీ కలిపి ఒకే విషయం చెబుతున్నాయి. దేశవ్యాప్త చట్టవ్యవస్థ కూలిపోతున్నదని అర్థమవుతోంది..
ఆర్మీపై అధిక ఆధారపడటం.. ప్రజాస్వామ్యానికి ముప్పు
ప్రతి సారి పరిస్థితి అదుపులో లేకపోతే ఆర్మీని రంగంలోకి దించటం, కాల్పులు జరపటం.. ఇది సమస్యను పరిష్కరించే మార్గం కాదు. ఇంతవరకూ 25 మంది మరణాలు, 600 మందికి పైగా గాయాలు.. ఇవి ప్రభుత్వ వైఫల్యానికి ఉదాహరణలు. ఆర్మీ బలగాల బలప్రయోగం కంటే రాజకీయ పరిష్కారం అవసరం అన్నది నిపుణుల మాట..
*తాత్కాలిక ప్రభుత్వ వాగ్దానం – ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టగలదా?
కాఠ్‌మాండూ మేయర్ బాలెన్ షా "తాత్కాలిక ప్రభుత్వం వస్తుంది, తర్వాత ఎన్నికలు జరుగుతాయి" అని చెబుతున్నారు. కానీ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.. ఇంతకాలం వాగ్దానాలు మాత్రమే విని విసిగిపోయాం, అసలు మార్పు ఎప్పుడు వస్తుంది? నిజమైన సమస్యలు అవినీతి, నిరుద్యోగం, అభివృద్ధి లోటు ఇవి పరిష్కరించకపోతే తాత్కాలిక ప్రభుత్వమూ మరొక నాటకమే అవుతుందని జెన్ జెడ్ యువత అంటోంది..
నేపాల్ ఈ రోజు ఒక మలుపు వద్ద నిలిచింది. ఒకవైపు యువత కోపం, మరోవైపు ప్రభుత్వ బలహీనత, మూడోవైపు ఆర్మీ కాల్పులు. ఈ సమీకరణలో ప్రజాస్వామ్యం నిలబడగలదా? లేదా మళ్లీ ఒక సైనిక ఆధిపత్య దశలోకి జారుతుందా? తాత్కాలిక ప్రభుత్వం నిజంగా మార్పు తెచ్చే వేదిక అవుతుందా లేక కేవలం పరిస్థితిని గందరగోళం నుంచి బయటపడేందుకు వేసిన తాత్కాలిక పూతమా? సమాధానం రాబోయే రోజుల్లోనే తెలుస్తుంది.
