Begin typing your search above and press return to search.

సోషల్ మీడియా పవర్ : నేపాల్ ప్ర‌ధాని ప‌రార్... రాజీనామా చేసిన ఓలీ...!

కొన్నాళ్ల కింద‌ట రాజ‌రికంలో ఉండి.. త‌ర్వాత మావోయిస్టుల ప్ర‌భావం కొన‌సాగి.. ప్ర‌జాస్వామ్య దేశంగా మారిన నేపాల్ లో 14 నెల‌ల్లోనే ప్ర‌ధాని మారిపోయారు.

By:  bunnyanil761@gmail.com   |   9 Sept 2025 3:33 PM IST
సోషల్ మీడియా పవర్ : నేపాల్ ప్ర‌ధాని ప‌రార్... రాజీనామా చేసిన ఓలీ...!
X

కొన్నాళ్ల కింద‌ట రాజ‌రికంలో ఉండి.. త‌ర్వాత మావోయిస్టుల ప్ర‌భావం కొన‌సాగి.. ప్ర‌జాస్వామ్య దేశంగా మారిన నేపాల్ లో 14 నెల‌ల్లోనే ప్ర‌ధాని మారిపోయారు. గ‌త ఏడాది జూలై 15 వ‌ర‌కు పుష్ప క‌మ‌ల్ ద‌హ‌ల్ ప్ర‌ధాన‌మంత్రిగా కొన‌సాగిన ఈ దేశంలో... అనంత‌రం అనూహ్యంగా కేపీ శ‌ర్మ ఓలి ప‌ద‌విలోకి వ‌చ్చారు. ఇప్పుడు ఈ ఓలీ కూడా ప‌ద‌విని వీడి ప‌రార‌య్యే ప‌రిస్థితిని ఎదుర్కొన్నారు.

హిమాల‌య రాజ్యం నేపాల్

నేపాల్ అంటే హిమాల‌య రాజ్యం. ప్ర‌పంచంలో ఏకైక హిందూ దేశం. అలాంటి నేపాల్ ప్ర‌జాస్వామ్యంలో అనేక తిప్ప‌లు ప‌డుతోంది. సోష‌ల్ మీడియాపై నిషేధం విష‌యం ఏకంగా ప్ర‌ధాన‌మంత్రి ఓలీ రాజీనామానే దారితీసింది. సోష‌ల్ మీడియాపై నిషేధాన్ని నిర‌సిస్తూ సోమ‌వారం నేపాల్ లో జ‌రిగిన ఆందోళ‌న‌ల్లో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో హోమంత్రి రాజీనామా చేశారు. ఇప్పుడు ప్ర‌ధాని ఓలీ కూడా అదే బాట‌లో వైదొల‌గారు.

సైన్యం చేతుల్లోకి పాల‌న‌...

నేపాల్ పాల‌న‌ను ఆ దేశ సైన్యం త‌న చేతుల్లోకి తీసుకోనున్న‌ట్లు స‌మాచారం. ఓలీ రాజీనామా చేసి దుబాయ్ వెళ్లిపోతార‌ని అంటున్నారు. ఓలీతో నేపాల్ ఆర్మీ చీఫ్ జ‌న‌ర‌ల్ అశోక్ రాజ్ సిగ్దెల్ తో మాట్లాడార‌ని.. ఇప్పుడున్న అత్యంత ఉద్రిక్త ప‌రిస్థితుల‌ను అదుపులోకి తెచ్చేందుకు, దేశం వీడి వెళ్లేందుకు ఓలీ సైన్యం సాయం కోరిన‌ట్లు తెలుస్తోంది. దీనికి స‌మాధానంగా ఓలీని రాజీనామా చేయాలంటూ ఆర్మీ చీఫ్ సూచించిన‌ట్లు చెబుతున్నారు. ఘ‌ర్ష‌ణ‌ల సంగ‌తి తాము చూసుకుంటామ‌ని, మీరైతే రాజీనామా చేయాలంటూ ఆర్మీ చీఫ్ చెప్పిన‌ట్లు తెలుస్తోంది.

ఎయిర్ పోర్ట్ బంద్‌....

నేపాల్ రాజ‌ధాని ఖాట్మండూలో ఉన్న త్రిభువ‌న్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యాన్ని మూసివేశారు. దేశంలోని వీఐపీలు అంద‌రూ ఆర్మీ బ్యార‌క్ లోకి వెళ్లిపోయారు. మంత్రుల‌ను వారి అధికారిక నివాసాలు ఖాళీ చేయించి వేరొక చోట‌కు త‌ర‌లిస్తున్నారు.