దేశ ఆర్థిక మంత్రిని తరిమి తరిమి కొట్టారు!
సామాజిక మాధ్యమాలపై విధించిన నిషేధం.. నేపాల్‌లో తీవ్ర నిరసన జ్వాలలు రేపిన విషయం తెలిసిందే.
By: Garuda Media | 9 Sept 2025 6:17 PM ISTసామాజిక మాధ్యమాలపై విధించిన నిషేధం.. నేపాల్‌లో తీవ్ర నిరసన జ్వాలలు రేపిన విషయం తెలిసిందే. విద్యార్థి సంఘాల నుంచి యువత, సాధారణ పౌరుల వరకు.. నేపాల్ సర్కారుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నేపాల్ రాజధాని ఖఠ్మండూలో సోమవారం ఈ నిరసనలు రక్త సిక్తంగా మారాయి. వేలాది మంది యువత దేశ పార్లమెంటుపై దండెత్తారు. లోనికి ప్రవేశించి.. విధ్వంసం సృష్టించారు. ఈ క్రమంలో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో మంగళవారం సాయంత్రానికి 22 మంది మృతి చెందారు. మరోవైపు.. నిరసనల ధాటికి ప్రధాన మంత్రి కేపీ శర్మ ఓలీ తన పదవికి రాజీనామా చేశారు.
దీనిని అధ్యక్షుడు ఆమోదించారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై రాజకీయంగా చర్చలు జరుగుతున్నాయి. అయితే.. ఇంత జరిగినా.. నిరసన కారులు మాత్రం తమ ఆందోళనలను కొనసాగించారు. దేశ ఆర్థిక మంత్రి విష్ణు ప్రసాద్ పౌడే ల్‌ను వీధుల వెంబడి పరిగెత్తించి.. మరీ దాడి చేయడం తీవ్రంగా మారింది. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి. అయితే.. ఆర్థిక మంత్రిని ఎందుకు వెంబడించి కొట్టారన్న దానికి కారణాలు లేవు. కేవలం ఆగ్రహంతో ఉన్న ఆందోళన కారులు తమ కసి తీర్చుకునేందుకే ఇలా ఎవరు కనిపిస్తే వారిపై దాడులు చేశారన్న చర్చ దేశంలో సాగుతోంది.
మరో వైపు.. నిరసన లు మరింత మిన్నంటుతున్నాయి. దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించినప్పటికీ.. ఎవరూ లెక్కచేయక పోవడం గమనార్హం. అంతేకాదు.. ప్రధాని పదవికి రాజీనామా చేసిన తర్వాత.. ఓలీ నివాసాన్ని సైతం ముట్టడించిన ఆందోళన కారులు దానికి నిప్పు పెట్టారు. దేశ సర్వోన్నత న్యాయస్థానంపై రాళ్లు రువ్వారు. నిప్పు పెట్టారు. పార్లమెంటు పరిసరాల్లో ఇంకా తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే.. సైన్యం సంయమనం పాటిస్తామని.. ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోవాలని పిలుపునిచ్చింది. 12 గంటల్లోనే వీధులను ఖాళీ చేయాలని షరతు విధించింది. కాల్పులు జరపబోమని.. స్పష్టం చేసింది.
అయినప్పటికీ.. విద్యార్థులు, యువత మాత్రం తమ నిరసనను కొనసాగించారు. ఓలీ మంత్రివర్గం.. అవినీతి లో కూరుకుపోయిం దని.. సదరు అవినీతిపై విచారణ జరపాలని.. విద్యార్థి సంఘాలు పట్టుబడుతున్నారు. మరోవైపు.. సోషల్ మీడియాపై విధించిన నిషేధాన్ని ఎత్తి వేశారు. అయినా.. విద్యార్థి సంఘాలు ఎక్కడా వెనక్కి తగ్గక పోగా.. మరింత తీవ్రంగా ఉద్యమిస్తున్నాయి. ఎక్కడి కక్కడ కార్యాలయాలు.. ప్రభుత్వ వాహనాలపై దాడులు చేస్తున్నారు. అధికారులపైనా దాడులు చేస్తున్నట్టు పలు జిల్లాల నుంచి సమాచారం అందింది. ఇదిలావుంటే.. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిణామాలను అంచనా వేసిన అధికారులు పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. వాణిజ్య సంస్థలు అప్రమత్తంగా ఉండాలని.. హెచ్చరించారు. పర్యాటకాన్ని నిలిపివేశారు. విమాన సర్వీసులను బంద్ చేశారు.
