Begin typing your search above and press return to search.

నాడు భారత్ లో విలీనం కావాల్సింది... నేడు నేపాల్ దుస్థితి !

నేపాల్ ప్రపంచంలో ఏకైక హిందూ రాజ్యంగా ఉంది. 2006 లో నేపాల్ ప్రజాస్వామ్య ఉద్యమానికి పూర్వం వరకూ అదే తీరున కొనసాగింది.

By:  Satya P   |   12 Sept 2025 9:13 AM IST
నాడు భారత్ లో విలీనం కావాల్సింది...  నేడు  నేపాల్ దుస్థితి !
X

నేపాల్ ప్రపంచంలో ఏకైక హిందూ రాజ్యంగా ఉంది. 2006 లో నేపాల్ ప్రజాస్వామ్య ఉద్యమానికి పూర్వం వరకూ అదే తీరున కొనసాగింది. అక్కడ అత్యధిక శాతం హిందువులు ఉంటారు. భారతదేశంలో మాదిరిగా అక్కడ కూడా అన్ని సాంస్కృతిక విధానాలు ఉంటాయి. నేపాల్ ఆధ్యాత్మిక వైభవం కూడా భారత్ కి సరిపోలేలా ఉంటుంది. సీతాదేవి పుట్టిల్లు నేపాల్ లో ఉంది అని అంటారు. నేపాల్ దేశానికి అండ దండలు భారత్ ఎపుడూ ఇస్తూ వచ్చింది. అయితే ఇప్పటికి ఇరవై ఏళ్ళ క్రితం నేపాల్ లో వామపక్ష విధానాలతో కూడిన ప్రభుత్వాలు రావడంతో పాటు అధికారిక హిందూ రాజ్యం అన్నది కూడా తీసివేశారు.

భారత్ తో బంధం :

నేపాల్ కి వేల ఏళ్ళ చరిత్ర ఉంది. భారత్ తో భౌగోళికంగా పూర్తి సంబంధాలు కలిగిన ఉన్న దేశం. భారత్ సైతం నేపాల్ ని అని విధాలుగా ఆదుకుంటూ స్నేహం చేస్తూ వచ్చింది. ఇక 1948వ సంవత్సరం వరకూ రాణాలు వారసత్వ ప్రధాన మంత్రులుగా నేపాల్ ని పరిపాలించారు. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే త్రిభువన్ అనే రాజు నేపాల్ లో రాణాలను ఓడించారు. అలా ఆయన పాలనకు రావడానికి భారతదేశం సహాయపడింది. నేపాలీ కాంగ్రెస్ పార్టీ ఏర్పడడానికి కూడా సహాయపడింది.

భారత్ లో విలీనం :

అదే సమయంలో నేపాల్ ని భారత దేశంలో విలీనం చేయడానికి నేపాల్ రాజు త్రిభువన్ ప్రతిపాదనలు పెట్టారని చరిత్రలో ప్రచారంలో ఉన్న విషయం. అయితే ఆనాటి ప్రధాని నెహ్రూ ఈ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించడమే కాకుండా నేపాల్ ఒక స్వతంత్ర దేశంగా ఉండాలని తాము అన్ని విధాలుగా సాయం చేస్తామని చెప్పారని ప్రచారంలో ఉంది. ఆనాడే కనుక నేపాల్ భారత్ లో విలీనం అయి ఉంటే భారత్ మరింత బలంగా తయారయ్యేదని చెబుతారు. సరిహద్దులలో చైనాతో ఇబ్బందులు లేకుండా ఉండేదని హిమ పర్వత శ్రేణులలో దుర్భేధ్యమైన రక్షణ వ్యవస్థకు ఆస్కార్మ్ ఉండేదని అంటారు.

పైగా నేపాల్ హిందూ దేశం, అన్ని విధాలుగా భారత్ లో అంతర్భాగంగా ఉండేందుకు అవకాశం ఉంది. మూడువేల ఏళ్ళ క్రితం అశోకుడు నేపాల్ ని సైతం కలుపుకుని పాలించారని చరిత్ర చెబుతోంది. అయితే ఆనాడు చైనాతో భారత్ చెలిమి చేస్తోంది. ఎక్కడ చైనాకు కోపం వస్తుందో అన్న మీమాంస వల్ల కూడా ఈ ప్రతిపాదనకు భారత్ అంగీకరించి ఉండకపోవచ్చు అని ఒక వైపు చెబుతారు. అలాగే భారత్ లౌకిక రాజ్యంగా ఉంది, నేపాల్ హిందూ దేశం అందుకే దూరంగా ఉంచారని దేశంలోని సెక్యులర్ వాదుల నుంచి ఇబ్బంది రాకుండా ఇలా చేశారు అని కూడా అంటారు.ఏది ఏమైనా నేపాల్ ని అలా వదిలేయడం వల్ల ఈ రోజు భారత్ కూడా ఇబ్బంది పడుతోంది అని అంటున్నారు.

అన్నీ ఉన్నా పేదరికం :

నేపాల్ కి అన్ని వనరులు ఉన్నాయి. అయినా పేదరికం తాండవిస్తోంది అంటే దానికి పాలకుల తీరే కారణం అని అంటారు. రాజకీయ సుస్థిరత లేకపోవడం సరైన పరిపాలన అందించలేకపోవడం వంటివి కూడా దేశాన్ని అశాంతిలోకి నెట్టాయి. ఈ రోజుకీ ప్రపంచంలో అత్యధికులు సందర్శించే పర్యాటక క్షేత్రాలు ఆధ్యాత్మిక క క్షేత్రాలు నేపాల్ లో ఉన్నాయి. టూరిజం పరంగా దేశాన్ని ఎంతో అభివృద్ధి చేసినా ఆ దేశం బాగుపడేది అని అంటారు. భారత్ చైనాల మధ్య ఇరుక్కుపోయిన నేపాల్ ఒకనాడు భారత్ కి దోస్తీగా ఉంది. అక్కడ వామపక్ష భావాలు కలిగిన పార్టీలు అధికారంలోకి రావడంతో చైనా ప్రభావం బాగా ఉంది అని అంటున్నారు.

ఈ రోజున నేపాల్ అయితే అత్యంత దారుణంగా ఉంది. భవిష్యత్తు కానరాక ఇబ్బంది పడుతోంది. నేపాల్ ఈ విధంగా కావడానికి అంతర్గత శతృవులు బహిరంగ శతృవులు కారణం అని చెబుతారు. సరైన సమయంలో నేపాల్ భారత్ లో విలీనం అయి ఉంటే ఈ రోజున చరిత్ర వేరేగా ఉండేది అన్నది చాలా మంది నమ్ముతారు. స్వాతంత్రానంతరం జరిగిన చాలా చారిత్రాత్మక పొరపాట్లలో ఇది కూడా ఒకటి అని భావించే వారు కూడా ఉన్నారు.