42 సరస్సులు బద్ధలయ్యేందుకు సిద్ధం.. వణుకుతున్ననేపాల్
ఈ హెచ్చరికతో నేపాలీయులు కళ్లు తెరిచారు. ఇప్పుడేం చేయాలో అర్థం కాని పరిస్థితి. గ్లేసియర్ నుంచి ప్రవహించే నీటి కారణంగా పర్వత సానువుల వద్ద ఏర్పడే సరస్సుల్ని గ్లేసియర్ లేక్ లుగా వ్యవహరిస్తారు.
By: Garuda Media | 23 Nov 2025 3:00 PM ISTమన పొరుగున ఉన్న బుజ్జి దేశం నేపాల్. అక్కడి ఒక ప్రావిన్స్ లో 42 సరస్సులు అత్యంత ప్రమాదకరంగా మారాయన్న విషయాన్ని బయటపెట్టాడు మన దేశానికి చెందిన నిపుణుడు. నేపాల్ లో అత్యంత ఎత్తైన పర్వతాల మధ్య ఏర్పడిన హిమానీ సరస్సులు (వీటినే గ్లేసియర్ లేక్స్) ఇప్పుడు దిగువ ప్రాంతాల ప్రజలపై యమపాశాలుగా మారేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా అంతర్జాతీయ సమీకృత పర్వతాభివ్రద్ధి కేంద్రం నిర్వహించిన చర్చా కార్యక్రమంలో భారత్ కు చెందిన ఈ రంగ నిపుణుడు శరద్ ప్రసాద్ జోషి హెచ్చరించారు.
ఈ హెచ్చరికతో నేపాలీయులు కళ్లు తెరిచారు. ఇప్పుడేం చేయాలో అర్థం కాని పరిస్థితి. గ్లేసియర్ నుంచి ప్రవహించే నీటి కారణంగా పర్వత సానువుల వద్ద ఏర్పడే సరస్సుల్ని గ్లేసియర్ లేక్ లుగా వ్యవహరిస్తారు. ఈ తరహాకు చెందిన 42 సరస్సులు భారీ స్థాయిలో నీటితో నిండుకుండలా మారాయి. ఇవే క్షణంలో అయినా బద్ధలై దిగువకు పెద్ద ఎత్తున నీరు దూసుకురానుంది.
అదే జరిగితే.. దిగువన ఉన్న ప్రాంతాల్లోని ప్రజల ఇళ్లు.. వ్యాపారాలు.. పంటలు నాశనం కావటం ఖాయం. నేపాల్ మొత్తంలో ఈ తరహా హిమానీ సరస్సులు 2069 ఉండగా.. కోషి ప్రావిన్స్ లోని 42 సర్ససులు అత్యంత ప్రమాదకరంగా మారాయి. మూడు కిలో మీటర్ల పొడవు.. 206 మీటర్లలోతైన తల్లోపోఖారీ సరస్సు ఇందులో మరింత డేంజర్ గా మారినట్లుగా ఆయన పేర్కొన్నారు. భారత నిపుణుడి హెచ్చరిక నేపథ్యంలో ఈ గండం నుంచి ప్రజల్ని గట్టెక్కించేందుకు వీలుగా నేపాల్ కు చెందిన వివిధ విభాగాలు ఫోకస్ చేశాయి. మొత్తంగా విపత్తు విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉన్న అంశాన్ని మనోడు చేసిన హెచ్చరిక.. నేపాల్ కు హెచ్చరికగా మారి.. నష్టాన్ని అంతో ఇంతో తగ్గించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
