Begin typing your search above and press return to search.

గేమింగ్ యాప్ నుంచి ప్రధాని ఎన్నిక : జెన్‌-జడ్ రాజకీయ విప్లవం!

నేపాల్‌లో జెన్‌-జడ్ యువత చరిత్ర సృష్టించింది. వీధుల్లో ఆగ్రహం చిమ్మిన నిరసనలతో మొదలైన ఈ తరంగం, చివరికి దేశ ప్రధానిని ఆన్‌లైన్‌లో ఎంచుకునేంత దాకా వెళ్లింది.

By:  A.N.Kumar   |   14 Sept 2025 1:10 AM IST
గేమింగ్ యాప్ నుంచి ప్రధాని ఎన్నిక : జెన్‌-జడ్ రాజకీయ విప్లవం!
X

నేపాల్‌లో జెన్‌-జడ్ యువత చరిత్ర సృష్టించింది. వీధుల్లో ఆగ్రహం చిమ్మిన నిరసనలతో మొదలైన ఈ తరంగం, చివరికి దేశ ప్రధానిని ఆన్‌లైన్‌లో ఎంచుకునేంత దాకా వెళ్లింది. శనివారం కర్ఫ్యూ ఎత్తివేయడంతో అక్కడి పరిస్థితులు క్రమంగా సద్దుమణిగినా శుక్రవారం తాత్కాలిక ప్రధానిగా సుశీలా కార్కీ ప్రమాణస్వీకారం నేపాల్‌ రాజకీయ గమనాన్ని పూర్తిగా మార్చేసింది.

డిస్కార్డ్‌: గేమింగ్ నుంచి గవర్నెన్స్ వరకు

జాసన్ సిట్రాన్, స్టానిస్లావ్ విష్నేవ్స్కీ 2015లో గేమర్స్ కోసం ఆవిష్కరించిన డిస్కార్డ్ యాప్, కరోనా తర్వాత యువత చేతుల్లో కొత్త అర్థం సంతరించుకుంది. చాట్ రూములు, సర్వర్లు, ఛానళ్లతో మొదలైన ఈ వేదిక, ఇప్పుడు ఒక దేశ భవిష్యత్తు తీర్చిదిద్దే స్థాయికి ఎదగడం యాదృచ్ఛికం కాదు. ‘యూత్ అగైనెస్ట్ కరప్షన్’ పేరిట ఏర్పాటు చేసిన డిస్కార్డ్ సర్వర్‌లోనే 1.3 లక్షల మంది పాల్గొని సుశీలా కార్కీని తమ నాయకురాలిగా ఎన్నుకోవడం, సంప్రదాయ రాజకీయాలకు పెద్ద సవాల్.

జెన్‌-జడ్ శక్తి.. సవాలు విసిరిన తరం

ఈ తరం మౌనంగా కూర్చునే తరం కాదు. అవినీతి, నిర్లక్ష్యం, పాత రాజకీయ సూత్రాలను సవాలు చేస్తూ సోషల్ మీడియాలో కొత్త మార్గాలు సృష్టిస్తోంది. వీధుల్లో ఆందోళన చేయడమే కాకుండా, సాంకేతికతను తమ పక్షాన తిప్పుకొని నాయకత్వాన్ని కూడా తమే ఎంచుకోవడం… ఇదే జెన్‌-జడ్ ప్రత్యేకత. వారి చర్యలు చూపిస్తున్నాయి – “పాలిటిక్స్‌ కేవలం పార్లమెంట్ గోడల్లోనే కాదు, యాప్స్‌లోనూ జరుగుతుంది” అని.

పరిమితి.. అవకాశమా?

డిస్కార్డ్ ఓటింగ్‌లో పాల్గొన్న వారంతా నేపాల్‌కు చెందినవారే కావచ్చని చెప్పలేం. అది ఈ కొత్త ప్రయోగానికి లోపం. కానీ అదే సమయంలో ఇది ఒక గొప్ప అవకాశమూ. యువత గళం వినిపించడానికి, నిర్ణయ ప్రక్రియలో భాగం కావడానికి సరిహద్దులు అడ్డంకి కాకుండా మార్గాలు తెరుస్తోంది. డిజిటల్ డెమోక్రసీకి ఇది ఒక బలమైన సంకేతం.

సుశీలా కార్కీ తాత్కాలిక ప్రధానిగా ఎంతకాలం కొనసాగుతారో చూడాలి. కానీ జెన్‌-జడ్ యువత ఈ అడుగుతో నేపాల్ రాజకీయ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభించిందనే విషయం మాత్రం ఖాయం. నిన్నటి వరకు గేమింగ్ కోసం ఉపయోగించిన యాప్‌, నేడు ఒక దేశ ప్రధానిని ఎంచేసే స్థాయికి రావడం – ఇది టెక్నాలజీ శక్తి కాదు, తరాల మార్పు శక్తి.