Begin typing your search above and press return to search.

నేపాల్ జైళ్ల నుంచి 540 మంది భారత ఖైదీల పరారీ..

నేపాల్ ఈ పేరు.. శాంతికి చిహ్నంగా వినిపించేది. హిమాలయాల నడుమ ప్రశాంతమైన దేశం అని వర్ణించబడేది.

By:  Tupaki Political Desk   |   13 Oct 2025 4:33 PM IST
నేపాల్ జైళ్ల నుంచి 540 మంది భారత ఖైదీల పరారీ..
X

నేపాల్ ఈ పేరు.. శాంతికి చిహ్నంగా వినిపించేది. హిమాలయాల నడుమ ప్రశాంతమైన దేశం అని వర్ణించబడేది. కానీ ఇప్పుడు ఆ దేశం అస్థిరత, ఆందోళనల చట్రంలో చిక్కుకుంది. జెన్‌ జెడ్‌ (Gen Z) నిరసనలతో నేపాల్‌ మొత్తం ఉప్పొంగిపోయింది. సామాజిక న్యాయం, రాజకీయ అవినీతి, ఆర్థిక సంక్షోభం వంటి సమస్యలతో విసిగిపోయిన యువత రోడ్లపైకి వచ్చింది. ఈ ఆందోళనలు క్రమంగా అల్లర్లుగా మారాయి. ఇది అత్యంత భయానక పరిణామం. దేశ వ్యాప్తంగా జైళ్ల నుంచి వేలాది మంది ఖైదీలు పారిపోవడం. ఇందులో సుమారు 540 మంది భారత ఖైదీలు ఉన్నారు. నేపాల్‌ చరిత్రలో ఇది ఒక అతిపెద్ద జైలు తిరుగుబాటు ఘటనగా నమోదైంది.

జెన్‌ జెడ్‌ ఆందోళనలు

2024, సెప్టెంబర్‌ 9 నుంచి నేపాల్‌లో ప్రారంభమైన జెన్‌ Z ఉద్యమం ప్రధానంగా నిరుద్యోగం, అవినీతి పాలన, రాజకీయ వర్గాల అసమర్థతకు వ్యతిరేకంగా ప్రారంభమైంది. ఈ నిరసనలు ‘శాంతియుతంగా’ ప్రారంభమైనా.. తర్వాత అవి పోలీసులపై దాడులు, ప్రభుత్వ భవనాలపై దాడులు, జైళ్ల ధ్వంసం వంటి అల్లర్లుగా మారాయి. నేపాల్‌ ఆర్థిక పరిస్థితి దశాబ్దంలో భారీగా క్షీణించింది. పర్వత ప్రాంతాల్లో పేదరికం, పల్లె ప్రాంతాల్లో వలసలు, పట్టణాల్లో నిరుద్యోగం ఇవన్నీ యువతను ఆగ్రహానికి గురి చేసేలా చేశాయి.

ఈ నిరసనలు కేవలం రాజకీయ అవిశ్వాసమే కాకుండా.. కొత్త తరానికి ఒక ‘సామాజిక నిరాశ’ను ప్రతిబింబిస్తున్నాయి. ఈ తరానికి విద్య ఉంది.. అవగాహన ఉంది.. కానీ అవకాశాలు లేవు.

కూలిపోయిన భద్రతా వ్యవస్థ

ఈ నిరసనల సమయంలో జైళ్లు లక్ష్యంగా మారాయి. కేవలం ఒకటి రెండు కాదు, నేపాల్‌ వ్యాప్తంగా 13 వేల మంది ఖైదీలు జైలు నుంచి పారిపోయారు. ఇందులో 7,735 మంది తిరిగి లొంగిపోయినా, ఇంకా 5 వేల మందికి పైగా పరారీలోనే ఉన్నారు. ఇది నేపాల్‌ భద్రతా వ్యవస్థలో లోపాన్ని స్పష్టంగా చూపిస్తోంది.

ప్రభుత్వం ఇప్పుడు దేశ వ్యాప్తంగా లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేసింది. హోంశాఖ ఖైదీలకు స్వచ్ఛందంగా లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. కానీ సమస్య ఇంతటితో ఆగలేదు.. ఎందుకంటే పరారైన వారిలో గణనీయమైన సంఖ్య భారతీయులది.

540 భారత ఖైదీలు

నేపాల్‌ జైళ్లలో భారతీయులు ఉన్నారు. స్మగ్లింగ్‌, మాదకద్రవ్య రవాణా, చోరీ, మానవ అక్రమ రవాణా కేసుల్లో వీరంతా శిక్షలు అనుభవిస్తున్నవారు.

ఇప్పుడు వారిలో 540 మంది పారిపోవడం, భారత్‌–నేపాల్‌ సరిహద్దు భద్రతకు తలనొప్పిగా మారింది. ఈ సరిహద్దు 1,700 కిలోమీటర్లకు పైగా ఉంది, వీసా లేకుండా రాకపోకలు జరుగుతాయి. ఈ పరిస్థితిలో పారారైన ఖైదీలను తిరిగి గుర్తించడం చాలా కష్టం.

ఇది కేవలం క్రిమినల్‌ సమస్యే కాదు.. ఇది ప్రాంతీయ భద్రతా సమస్య.

సరిహద్దు గ్రామాల్లో ఈ ఖైదీలు దాక్కోవడం, స్థానిక నెట్‌వర్క్‌లలో కలవడం వల్ల భవిష్యత్తులో క్రైమ్‌ రేటు పెరిగే ప్రమాదం ఉంది.

ఇదే కారణంగా భారత గృహ మంత్రిత్వ శాఖ ఇప్పటికే నేపాల్‌తో ‘ఖైదీ మానిటరింగ్‌’ వ్యవస్థపై చర్చలు ప్రారంభించింది.

రాజకీయ బలహీనత

నేపాల్‌లో రాజకీయ అస్థిరత కొత్తేమి కాదు. దశాబ్దంలోనే ఐదు ప్రధానమంత్రులు మారారు. ప్రజాస్వామ్యం ఉన్నా, పాలనలో అవినీతి, దళాల మధ్య విభేదాలు, ఆర్థిక విధానాల్లో దిశాహీనత ఇవన్నీ ప్రజల్లో నమ్మకం కోల్పోయేలా చేశాయి. ఈ నేపథ్యంలోని జెన్‌ Z ఉద్యమం ఒక ‘పోరాటం’ కాదు.. నిరాశతో కూడిన పోరాటంగా చెప్పవచ్చు.

జైళ్ల నుంచి పారిపోయిన 13 వేల ఖైదీలు కేవలం చట్టరాహిత్యానికి చిహ్నం కాదు.. దేశం భవిష్యత్తు వైఫల్యానికి సూచిక. 540 భారత ఖైదీలు ఇంకా పరారీలో ఉన్నారు. నేపాల్‌ మళ్లీ శాంతి, స్థిరత్వం సాధించాలంటే, తన యువత ఆకాంక్షలను పట్టించుకోవాలి.. లేదంటే ఈ ‘జెన్‌ Z విప్లవం’ నిరసనతోనే ఆగదు. మరింత పై స్థాయికి తీసుకెళ్లవచ్చు.