Begin typing your search above and press return to search.

తెగిన టిబెట్ డ్యామ్.. వరదల్లో కొట్టుకొచ్చిన బంగారం..

నేపాల్‌లో వరదలు బీభత్సం సృష్టిస్తున్న వేళ.. ఒకవైపు టిబెట్ వైపున డ్యామ్ తెగిపోయిందన్న సమాచారం కలకలం రేపుతోంది.

By:  A.N.Kumar   |   28 Aug 2026 6:02 PM IST
తెగిన టిబెట్ డ్యామ్.. వరదల్లో కొట్టుకొచ్చిన బంగారం..
X

నేపాల్‌లో వరదలు బీభత్సం సృష్టిస్తున్న వేళ.. ఒకవైపు టిబెట్ వైపున డ్యామ్ తెగిపోయిందన్న సమాచారం కలకలం రేపుతోంది. మరోవైపు వరదల్లో కొట్టుకొచ్చిన కబోర్డులో బంగారం, వెండి, నగదు బయటపడటం ఆసక్తికరంగా మారింది. విపత్కర పరిస్థితుల్లోనూ కొందరు మానవత్వాన్ని చాటుకున్నారు.

నేపాల్‌లో భారీ వర్షాలు, వరదలు, కొండచరియల విరిగిపడటంతో పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్నాయి. ముఖ్యంగా చైనా-నేపాల్ సరిహద్దు ప్రాంతాల్లో ప్రకృతి బీభత్సం కొనసాగుతోంది. ఈ క్రమంలో టిబెట్ వైపున ఓ డ్యామ్ తెగిపోయినట్లు సమాచారం అందిందని నేపాల్ పోలీసులు వెల్లడించారు. ఈ పరిణామంతో సరిహద్దు ప్రాంతాల ప్రజల్లో మరింత భయాందోళనలు నెలకొన్నాయి.

టిబెట్ వైపు డ్యామ్ తెగిపోయినట్లు సమాచారం వచ్చిందని నేపాల్ పోలీసులు సోషల్ మీడియా ద్వారా హెచ్చరికలు జారీ చేశారు. భద్రతా సిబ్బంది, సహాయక చర్యల్లో పాల్గొంటున్న రెస్క్యూ సిబ్బంది, ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు వీలైనంత త్వరగా సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని, తమ ఆచూకీని కుటుంబ సభ్యులు, ఇతరులకు తెలియజేయాలని కోరారు.

ఇదిలా ఉండగా.. చైనా-నేపాల్ సరిహద్దుల్లో కొండచరియలు విరిగిపడటంతో భారీగా శిథిలాలు పేరుకుపోయి ఓ సరస్సు ఏర్పడినట్లు చైనా ప్రభుత్వ టీవీ వెల్లడించింది. ఈ సరస్సులో నీటి మట్టం పెరుగుతూ పొంగిపొర్లుతున్నట్లు తెలిపింది. దీంతో దిగువ ప్రాంతాల్లో వరద ముప్పు మరింత పెరిగే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

వరదల్లో కొట్టుకొచ్చిన కబోర్డులో బంగారం

ప్రకృతి విలయంతో ప్రజలు ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీస్తున్న సమయంలో.. నేపాల్‌లో మరో ఆసక్తికర ఘటన వెలుగులోకి వచ్చింది. వరద నీటిలో కొట్టుకొచ్చిన ఓ కబోర్డును ఓ వ్యక్తి గుర్తించాడు. దానిని తెరిచి చూడగా అందులో బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదు కూడా ఉన్నట్లు గుర్తించాడు.

అంత విలువైన వస్తువులు కనిపించినప్పటికీ వాటిని తన సొంతం చేసుకోకుండా పోలీసులకు అప్పగించాడు. కబోర్డులో లభించిన వస్తువులకు సంబంధించిన బిల్లును కూడా గుర్తించినట్లు సమాచారం. ఆ బిల్లుపై ‘జై శ్రీ మహాలక్ష్మి గోల్డ్ అండ్ సిల్వర్ షాప్’ అనే పేరు ఉన్నట్లు ఆ వ్యక్తి తెలిపాడు.

కబోర్డు, అందులోని బంగారం, వెండి, నగదును పోలీసులకు అప్పగించినట్లు వెల్లడించాడు. వీటికి సంబంధించిన యజమానులు ఉంటే పోలీసులను లేదా తనను సంప్రదించాలని కోరాడు.

ఇప్పటికే వరదల్లో కొట్టుకొచ్చిన ఓ మహిళ మృతదేహం నుంచి బంగారం దోచుకున్న ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో.. అదే విపత్కర సమయంలో విలువైన వస్తువులను పోలీసులకు అప్పగించిన ఈ వ్యక్తి వ్యవహారం మానవత్వానికి నిదర్శనంగా నిలిచింది.

ఒకవైపు ప్రాణాలు, ఆస్తులు వరదల్లో కొట్టుకుపోతుంటే.. మరోవైపు దొరికిన సొమ్మును సొంతం చేసుకోకుండా యజమానులకు చేరేలా చేసిన ఈ చర్య అందరి ప్రశంసలు అందుకుంటోంది.