రూ. 4.4 లక్షల కోట్లు ఉంటేనే సాధారణ స్థితికి నేపాల్: అంతర్జాతీయ సాయం కోసం ఎదురుచూపులు
భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు నేపాల్‌ను కోలుకోలేని రీతిలో దెబ్బతీశాయి. ప్రకృతి ప్రకోపానికి ఆ దేశంలోని పలు జిల్లాలు తీవ్రంగా ప్రభావితమవ్వగా.. ఆస్తి , ప్రాణ నష్టంతో పాటు మౌలిక వసతులు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
By: A.N.Kumar | 30 Aug 2026 11:13 AM ISTభారీ వర్షాలు, ఆకస్మిక వరదలు నేపాల్‌ను కోలుకోలేని రీతిలో దెబ్బతీశాయి. ప్రకృతి ప్రకోపానికి ఆ దేశంలోని పలు జిల్లాలు తీవ్రంగా ప్రభావితమవ్వగా.. ఆస్తి , ప్రాణ నష్టంతో పాటు మౌలిక వసతులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. రవాణా, విద్యుత్, తాగునీటి వ్యవస్థలు ఛిన్నాభిన్నమవడంతో దేశాన్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడం నేపాల్ ప్రభుత్వానికి ఒక పెను సవాలుగా మారింది.
ఈ విపత్తు నుంచి కోలుకోవడానికి.. వరద ప్రభావిత ప్రాంతాలను పూర్తిస్థాయిలో పునర్నిర్మించేందుకు సుమారు 4 నుంచి 5 బిలియన్ డాలర్లు అవసరమయ్యే అవకాశం ఉందని నేపాల్ ఆర్థిక మంత్రి స్వర్ణిమ్ వాగ్లే వెల్లడించారు. భారత కరెన్సీలో ఇది దాదాపు రూ. 3.5 లక్షల కోట్ల నుంచి రూ. 4.4 లక్షల కోట్లకు సమానం. ఈ భారీ మొత్తం నేపాల్ మొత్తం ఆర్థిక వ్యవస్థ పరిమాణంలో దాదాపు 10 శాతానికి సమానం కావడం గమనార్హం. అయితే ఇది కేవలం ప్రాథమిక అంచనా మాత్రమేనని, వివిధ శాఖల అధికారులు.. నిపుణులు పూర్తిస్థాయి నష్ట తీవ్రతపై సమగ్ర అధ్యయనం చేపట్టిన తర్వాతే పునర్నిర్మాణానికి అయ్యే తుది వ్యయంపై స్పష్టత వస్తుందని ప్రభుత్వం తెలిపింది.
రవాణా వ్యవస్థ విధ్వంసమవ్వడం వల్ల నేపాల్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. వందల కిలోమీటర్ల మేర రహదారులు కొట్టుకుపోవడంతో పాటు కీలక ప్రాంతాలను కలిపే అనేక వంతెనలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. దీనివల్ల అనేక జిల్లాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయి, బాధితులకు సహాయక చర్యలు అందించడానికి కూడా అధికారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరోవైపు నేపాల్‌కు అత్యంత కీలకమైన విద్యుత్ రంగానికి కూడా భారీ గండి పడింది. దేశంలోని పలు జలవిద్యుత్ కేంద్రాలు వరదల కారణంగా తీవ్రంగా దెబ్బతిన్నాయి. పవర్ ప్లాంట్లతో పాటు ట్రాన్స్‌మిషన్ లైన్లు ధ్వంసమవ్వడంతో దేశవ్యాప్తంగా విద్యుత్ ఉత్పత్తి మరియు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఇక మానవీయ కోణంలో చూస్తే వరదల కారణంగా వేలాది ఇళ్లు నీట మునిగిపోవడంతో అనేక కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. వేల సంఖ్యలో ప్రజలు తమ సర్వస్వాన్నీ కోల్పోయి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీరికి తక్షణమే తాత్కాలిక నివాస సదుపాయాలు కల్పించడంతో పాటు సురక్షిత తాగునీరు, ప్రాథమిక ఆరోగ్య సేవలు అందించడం.. దెబ్బతిన్న ఇళ్లను తిరిగి నిర్మించి ఇవ్వడం ప్రభుత్వానికి ప్రాధాన్య అంశంగా మారింది.
నేపాల్ వద్ద ఉన్న స్వదేశీ ఆర్థిక వనరులతో ఇంత భారీ మొత్తాన్ని సమీకరించడం ఏమాత్రం సాధ్యం కాదు. దీంతో ఈ రీబిల్డింగ్ ప్రాసెస్ కోసం అంతర్జాతీయ సమాజం, ఆసియా అభివృద్ధి బ్యాంక్, ప్రపంచ బ్యాంక్ వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి నిధులు, రుణాల రూపంలో సహాయం కోరాల్సిన పరిస్థితి నేపాల్‌కు ఏర్పడింది. విపత్తు ధాటికి దెబ్బతిన్న రోడ్లు, విద్యుత్ ప్రాజెక్టులు, ఇతర మౌలిక వసతులను ఎంత త్వరగా పునరుద్ధరిస్తే నేపాల్ ఆర్థిక వ్యవస్థ అంత త్వరగా మళ్లీ పట్టాలెక్కే అవకాశముంది.
