టిబెట్ వైపు డ్యామ్ తెగిపోయింది.. నేపాల్‌లో హై అలర్ట్!
నేపాల్‌లో మరోసారి వరద ముప్పు ఆందోళన కలిగిస్తోంది. టిబెట్ వైపున డ్యామ్ తెగిపోయినట్లు సమాచారం అందిందని నేపాల్ పోలీసులు ప్రకటించారు.
By: A.N.Kumar | 28 Aug 2026 3:35 PM ISTనేపాల్‌లో మరోసారి వరద ముప్పు ఆందోళన కలిగిస్తోంది. టిబెట్ వైపున డ్యామ్ తెగిపోయినట్లు సమాచారం అందిందని నేపాల్ పోలీసులు ప్రకటించారు. దీంతో సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అప్రమత్తం చేస్తూ అత్యవసర హెచ్చరికలు జారీ చేశారు.
టిబెట్ వైపున డ్యామ్ తెగిపోయినట్లు సమాచారం తమకు అందిందని నేపాల్ పోలీసులు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ నేపథ్యంలో భద్రతా సిబ్బంది, సహాయక చర్యల్లో పాల్గొంటున్న రెస్క్యూ సిబ్బంది, స్థానిక ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పరిస్థితులు మరింత తీవ్రంగా మారే అవకాశం ఉన్నందున నదులు, వాగులు, లోతట్టు ప్రాంతాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు.
అత్యవసర పరిస్థితి ఏర్పడితే వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు ప్రజలకు సూచించారు. అంతేకాకుండా తాము సురక్షితంగా ఉన్నామనే విషయాన్ని కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులకు తెలియజేయాలని కోరారు. ప్రమాదకర ప్రాంతాల్లో ఉన్నవారు అధికారుల సూచనలను పాటించాలని స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే.. చైనా ప్రభుత్వ టీవీ సంస్థ కూడా సరిహద్దు ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితిపై కీలక సమాచారాన్ని వెల్లడించింది. చైనా-నేపాల్ సరిహద్దుల్లో కొండచరియలు విరిగిపడటంతో భారీ మొత్తంలో శిథిలాలు పేరుకుపోయి ఒక సరస్సు ఏర్పడినట్లు తెలిపింది. ఆ సరస్సులో నీటి మట్టం పెరుగుతూ పొంగిపొర్లుతున్నట్లు పేర్కొంది.
భారీ వర్షాలు, కొండచరియలు, వరదల కారణంగా ఇప్పటికే నేపాల్‌లోని పలు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో టిబెట్ వైపు డ్యామ్ తెగిపోయినట్లు వచ్చిన సమాచారం స్థానికంగా మరింత ఆందోళనకు కారణమవుతోంది. ఒకవేళ భారీగా నీరు దిగువ ప్రాంతాలకు ప్రవహిస్తే నదీ పరివాహక ప్రాంతాల్లో వరద పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ప్రస్తుతం అధికార యంత్రాంగం పరిస్థితిని నిశితంగా గమనిస్తోంది. రెస్క్యూ సిబ్బంది, భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు అందాయి. ప్రజలు వదంతులను నమ్మకుండా అధికారిక సమాచారాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని, అత్యవసర పరిస్థితుల్లో ఆలస్యం చేయకుండా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు.
టిబెట్‌లోని పరిస్థితి, డ్యామ్‌కు సంబంధించిన సమాచారం, సరిహద్దు ప్రాంతాల్లో నీటి ప్రవాహంపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. అయితే నేపాల్‌లో అధికారుల తాజా హెచ్చరికల నేపథ్యంలో సరిహద్దు, నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.
