నేపాల్‌లో మరో జల ప్రళయం ముప్పు.. ప్రజలకు ఆర్మీ హెచ్చరికలు!
నేపాల్‌ను ఇప్పటికే అతలాకుతలం చేసిన భారీ ఫ్లాష్ ఫ్లడ్స్ నుంచి కోలుకోకముందే.. మరో భారీ జల విపత్తు ముప్పు ఆ దేశాన్ని వణికిస్తోంది.
By: A.N.Kumar | 28 Aug 2026 12:22 PM ISTనేపాల్‌ను ఇప్పటికే అతలాకుతలం చేసిన భారీ ఫ్లాష్ ఫ్లడ్స్ నుంచి కోలుకోకముందే.. మరో భారీ జల విపత్తు ముప్పు ఆ దేశాన్ని వణికిస్తోంది. ముఖ్యంగా రసూవా జిల్లాలో మరోసారి ఫ్లాష్ ఫ్లడ్స్ సంభవించే ప్రమాదం ఉందని నేపాల్ ఆర్మీ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తమై సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో సహాయక చర్యలను కూడా తాత్కాలికంగా నిలిపివేశారు.
ఇప్పటికే 469 మంది మృతి
ఆగస్టు 26న నేపాల్‌లో సంభవించిన భయంకరమైన ఫ్లాష్ ఫ్లడ్స్ తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. రసూవా ప్రాంతంలో మొదలైన వరద ఉద్ధృతి భోటేకోషి, త్రిశూలి నదుల వెంట దిగువ ప్రాంతాలకు దూసుకెళ్లింది. నీటితో పాటు భారీగా మట్టి, రాళ్లు, శిథిలాలు కొట్టుకురావడంతో ఇళ్లు, రహదారులు, వంతెనలు, విద్యుత్ ప్రాజెక్టులు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
తాజా అధికారిక లెక్కల ప్రకారం.. ఈ విపత్తులో 469 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎనిమిది జిల్లాల్లో మృతదేహాలను గుర్తించారు. చిత్వాన్‌లో అత్యధికంగా 178 మంది మృతదేహాలు లభించగా.. నావల్‌పరాసి ఈస్ట్‌లో 110, గోర్ఖాలో 44, నువాకోట్‌లో 37, ధాదింగ్‌లో 33, తనహున్‌లో 28, నావల్‌పరాసి వెస్ట్‌లో 27, రసూవాలో 12 మృతదేహాలు లభించాయి.
మళ్లీ వరద ముప్పు ఎందుకు?
హిమాలయ ప్రాంతాల్లో భారీగా నీరు, మంచు, మట్టి, రాళ్లు కదలడంతో నదుల ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో నీరు నిలిచి బ్యారియర్ లేక్‌లుగా మారడం ఇప్పుడు కొత్త ప్రమాదానికి కారణమవుతోంది. వాటిలో ఒకటి నీటి ఒత్తిడిని తట్టుకోలేక పొంగిపొర్లే పరిస్థితి ఏర్పడటంతో.. అది ఒక్కసారిగా తెగిపోతే దిగువ ప్రాంతాలపై భారీ స్థాయిలో వరద విరుచుకుపడే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో రసూవా ప్రాంతంలో ప్రజలను ఎత్తైన, సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ప్రమాదం పెరుగుతుందన్న హెచ్చరికలతో హెలికాప్టర్ రెస్క్యూ కార్యకలాపాలను కూడా కొంతసేపు నిలిపివేయాల్సి వచ్చింది.
రెస్క్యూ ఆపరేషన్‌కు తీవ్ర ఆటంకాలు
ఇప్పటికే వేలాది మంది సహాయక సిబ్బంది రంగంలోకి దిగారు. నేపాల్ పోలీసుల ప్రకారం ఇప్పటివరకు 1,545 మందిని రక్షించారు. రసూవా నుంచి 644 మంది, నువాకోట్ నుంచి 898 మంది, ధాదింగ్ నుంచి ముగ్గురిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అయితే 28 మంది పోలీసు సిబ్బంది ఇంకా ఆచూకీ లేకుండా ఉన్నారు.
వరదల కారణంగా రహదారులు, వంతెనలు ధ్వంసం కావడం.. కొండ ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం.. ఇప్పుడు మరోసారి వరద ముప్పు పొంచి ఉండటంతో సహాయక చర్యలు మరింత క్లిష్టంగా మారాయి.
469 మంది ప్రాణాలను బలిగొన్న విషాదం నుంచి నేపాల్ ఇంకా కోలుకోకముందే.. మరో జల ప్రళయం ముప్పు హెచ్చరికలు రావడం ఆ దేశ ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
