Begin typing your search above and press return to search.

అంతా మీరే చేశారు.. భారత్, చైనా, అమెరికాలపై ఫైట్ కు రెడీ అయిన నేపాల్ ప్రధాని

ఇటీవల వచ్చిన భారీ వర్షాలు, ఆకస్మిక వరదలకు నేపాల్‌లోని ఊళ్లు, రోడ్లు, వంతెనలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

By:  A.N.Kumar   |   2 Sept 2026 8:33 PM IST
అంతా మీరే చేశారు.. భారత్, చైనా, అమెరికాలపై ఫైట్ కు రెడీ అయిన నేపాల్ ప్రధాని
X

గ్లోబల్ వార్మింగ్‌తో ప్రపంచమంతా విలవిలలాడుతుంటే... నేపాల్ మాత్రం ఒక పక్కా క్లారిటీకి వచ్చేసింది. "మేము హిమాలయాల ప్రశాంతతలో టీ తాగుతూ ఉంటే, మీరు పొగలు చిమ్ముతూ భారీ పరిశ్రమలు నడిపారు. ఇప్పుడు ఆ పొగంతా వచ్చి మా నెత్తిన పడి వర్షాలై ఆకస్మిక వరదలై పారింది. కాబట్టి గుట్టుచప్పుడు కాకుండా పర్సు తీసి నష్టపరిహారం కింద మాకు ఫైన్ కట్టేయండి" అంటూ భారత్, చైనా, అమెరికాలను డిమాండ్ చేయడానికి సిద్ధమైపోయింది.

ఇటీవల వచ్చిన భారీ వర్షాలు, ఆకస్మిక వరదలకు నేపాల్‌లోని ఊళ్లు, రోడ్లు, వంతెనలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వేలాది మంది నిరాశ్రయులవ్వడంతో దేశం అతలాకుతలమైంది. విపత్తు వచ్చిన కొత్తలో "మాకొద్దు మీ సాయం.. మేమే చూసుకుంటాం" అని కాస్త బిల్డప్ ఇచ్చినా, పరిస్థితి చేతులు దాటాక అంతర్జాతీయ సమాజం సాయం కోసం తలుపులు తీయక తప్పలేదు. అయితే ఈసారి కేవలం ఉచిత బియ్యం బస్తాలు, పప్పుల మూటలతో సరిపెట్టుకోవడానికి నేపాల్ మూడ్‌లో లేదు. ఆర్థిక సాయం మాత్రమే కాదు.. నేరుగా ఐక్యరాజ్యసమితి వేదికగానే 'క్లైమేట్ జస్టిస్' పేరుతో గ్లోబల్ లెవల్‌లో ఒక పెద్ద స్కెచే వేసింది.

నేపాల్ లాజిక్ చాలా సింపుల్‌గా ఉంది. ప్రపంచంలో అత్యధికంగా గ్రీన్‌హౌస్ వాయువులను వదులుతున్న భారత్, చైనా, అమెరికాలు రోజూ చేసే విచ్చలవిడి ఉద్గారాలే ఈ వాతావరణ మార్పులకు, క్రమంతప్పిన తుఫాన్లకు అసలు కారకులు. తాము ప్రపంచానికి చేసే ఉద్గారాల నష్టం రవ్వంత మాత్రమే అయినప్పటికీ ఆ పెద్ద దేశాల పాపానికి పర్వతమంత నష్టాన్ని అనుభవిస్తోంది మాత్రం తామేనని వాపోతోంది. ఉద్గారాలు విడుదల చేసి పర్యావరణాన్ని తగలబెట్టింది వాళ్లయితే ఆ త్యాగం తము ఎందుకు చేయాలని, ఆ నష్టానికి తగిన పరిహారాన్ని ఆ మూడు పెద్ద దేశాలే చెల్లించాలనేది నేపాల్ ప్రధాన డిమాండ్.

ఈ అంశంపై నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ ఇప్పటికే అంతర్జాతీయంగా గళం విప్పగా ఐరాసకు చెందిన 'ఫండ్ ఫర్ రెస్పాండింగ్ టు లాస్ అండ్ డ్యామేజ్' నిధి నుంచి వీలైనంత ఎక్కువ మొత్తం పిండుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ పంచ్‌ను మరింత గట్టిగా విసిరేందుకు నేపాల్ ప్రధాని బాలెన్ షా స్వయంగా న్యూయార్క్ విమానం ఎక్కి ఐరాస సర్వసభ్య సమావేశంలో ఈ బిల్లును నేరుగా వారి ముందు పెట్టబోతున్నారని సమాచారం.

అయితే ఇక్కడో చిన్న సైంటిఫిక్ మెలిక ఉంది. "ఫలానా దేశం వదిలిన కార్బన్ వల్లే సరిగ్గా మా ఊరి వంతెన కొట్టుకుపోయింది" అని కోర్టు తరహాలో నిరూపించి బిల్లు వసూలు చేయడం అంత సులువైన విషయమేమీ కాదు. మరి నేపాల్ వేసిన ఈ 'క్లైమేట్ చలాన్' చూసి గ్లోబల్ బిగ్ బాస్ అమెరికా, పొరుగున ఉన్న చైనా, భారత్‌లు లైట్ తీసుకుని నవ్వుకుంటాయా లేక నిజంగానే పర్సు బయటకు తీసి నష్టపరిహారం చెల్లిస్తాయా అనేది రాబోయే ఐరాస సమావేశాల్లో చూడాలి.