కేబినెట్ నిర్ణయం.. తుక్కుగా కార్ల విక్రయం.. కిలో రూ.45!
అవును... ఆగస్టు నెలలో నేపాల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువత (జెన్-జెడ్) చేపట్టిన ఉద్యమం తారాస్థాయికి చేరుకోన్న సంగతి తెలిసిందే.
By: Raja Ch | 31 Oct 2025 1:31 PM ISTప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు చేపట్టిన ఆందోళనల్లో ధ్వంసమైన కార్లు, బైకులు, బస్సులను వేలం వేయాలని.. తుక్కుగా కిలోల లెక్కన అమ్ముకోవాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ ఘటన నేపాల్ లో చోటు చేసుకుంది. ఈ మేరకు పట్టణాభివృద్ధి శాఖ సెక్షన్ ఆఫీసర్ కేశవ్ శర్మ మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా కాలిన వాహనాల తుక్కు కిలో రూ.45కి అమ్ముతుండటం గమనార్హం.
అవును... ఆగస్టు నెలలో నేపాల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువత (జెన్-జెడ్) చేపట్టిన ఉద్యమం తారాస్థాయికి చేరుకోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... యువత పార్లమెంట్ భవనం, సుప్రీంకోర్టు, ప్రభుత్వ అధినేతల ఇళ్లు, రోడ్లపై పార్క్ చేసిన వాహనాలను దహనం చేసింది. ఈ నేపథ్యంలో దహనమైన కార్లను ఇప్పుడు ప్రభుత్వం తుక్కు కింద జమకట్టి.. కిలోల్లా అమ్మేస్తోంది.
ఈ క్రమంలో... ఆందోళనలతో దెబ్బతిన్న వాహనాలను తుక్కు కింద అమ్మడం తప్పితే.. ఎలాంటి ఉపయోగం ఉండదని.. వాటి శకలాలను ప్రభుత్వ భవనాల ఆవరణలో పెట్టడం వల్ల స్థలాభావం తప్పదని ప్రభుత్వ ఇంజనీర్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా స్పందించిన కేశవ్ శర్మ మాట్లాడుతూ.. ఇప్పటివరకు 22 వేర్వేరు కార్యాలయాల నుండి 145 ఫోర్ వీలర్లు, 256 టూవీలర్ వాహనాలతో పాటు 2 బస్సులను సేకరించామని తెలిపారు. వీటిలో అత్యధిక సంఖ్యలో ప్రధానమంత్రి కార్యాలయం, మంత్రిమండలి నుండి వచ్చాయని.. వారు 35 కార్లు, 70 మోటార్ సైకిళ్లను కోల్పోయారని తెలిపారు.
ఇదే క్రమంలో... రోడ్ల శాఖలోని హెవీ ఎక్విప్మెంట్ విభాగానికి చెందిన ఇంజనీర్లు ఇప్పటికే దాదాపు 500 వాహనాలను సేకరించినట్లు తెలిపారు. త్వరలో మరో 100 వాహనాలను జోడించనున్నామని చెప్పారు. వీటిలో ఏవీ తిరిగి ఉపయోగించబడవని.. విడిభాగాలకు కూడా పనికి రావని ఇంజనీర్ ప్రదీప్ కుమార్ శ్రేష్ఠ తెలిపారు. మెటల్ స్క్రాప్ గా విక్రయించడానికి మాత్రమే సరిపోతాయని అన్నారు.
ఈ సందర్భంగా రోడ్ల శాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ భువన్ అధికారి మాట్లాడుతూ.. వీటిలో ఏదీ తిరిగి ఉపయోగించలేని విధంగా మారిపోయిందని.. అధిక వేడి కారణంగా ఇనుము కూడా దాని లక్షణాలను కోల్పోయిందని.. రబ్బరు, ప్లాస్టిక్ పూర్తిగా పోయాయని.. అవశేషాలను స్క్రాప్ మెటల్ గా విక్రయించాల్సి ఉంటుందని, తూకం వేసి తదనుగుణంగా ధర నిర్ణయించాల్సి ఉంటుందని నొక్కి చెప్పారు.
కిలో 45 రూపాయలు!:
అగ్నికి ఆహుతైన వాహనాల నుంచి ఇనుమును వేరు చేసే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. ఎందుకూ పనికిరాకుండా ఉన్న వాహనాల నుంచి సేకరించిన ఇనుమును తుక్కుగా అమ్మేయడానికి రంగం సిద్ధం చేసింది. దీంతో.. బన్వేశ్వర్ లో నిర్ణయించిన వేలంలో ఓ స్క్రాప్ వ్యాపారి కిలోకు రూ.45 చొప్పున చెల్లించి, కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
