పిల్లలతో వెళుతుంటే కత్తులతో వెంటాడి చంపేసిన గంజాయి బ్యాచ్
38 ఏళ్ల పెంచలయ్య.. దుర్గా దంపతులు నెల్లూరు గ్రామీణం పరిధిలోని హౌసింగ్ బోర్డు కాలనీలో నివాసం ఉంటున్నారు.
By: Garuda Media | 29 Nov 2025 11:47 AM ISTకిరాతక ఘటన చోటు చేసుకుంది. గంజాయి అమ్మకాల్ని అడ్డుకుంటూ తనకు తెలిసిన సమాచారాన్ని పోలీసులకు తెలియజేస్తూ.. గంజాయికి అడ్డుకట్ట వేయాలన్న అతడి కలను సమాధి చేసిందో బ్యాచ్. తొమ్మిది మందితో కూడిన గంజాయి బ్యాచ్ కక్ష కట్టి మరీ చంపేసిన వైనం నెల్లూరులో పెను సంచలనంగా మారింది. తన ఇద్దరు పిల్లల్ని తీసుకొని స్కూటీ మీద వెళుతున్న వేళ.. టార్గెట్ చేసిన తొమ్మిది మందితో కూడిన గంజాయి బ్యాచ్ కత్తులతో వెంటబడి.. పారిపోతున్న బాధితుడ్ని చంపేశారు.
38 ఏళ్ల పెంచలయ్య.. దుర్గా దంపతులు నెల్లూరు గ్రామీణం పరిధిలోని హౌసింగ్ బోర్డు కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. ఎలక్ట్రీషియన్ గా పని చేసే అతను.. కొన్నేళ్ల క్రితం ఇప్పుడున్న ప్లేస్ కు మారాడు. వామపక్ష భావజాలంతో పాటు.. సామాజిక అంశాల మీద స్పందించే గుణం అతడి సొంతం. ఏదైనా తప్పు జరుగుతుంటే.. దాన్ని అడ్డుకోవాలన్నట్లుగా అతడి వ్యవహార శైలి ఉంటుంది.
తాను ఉండే కాలనీలో కొందరు యువకులు గంజాయి సేవించటం.. గంజాయి దందా ఒక మహిళ ఆధ్వర్యంలో జరుగుతున్న విషయాన్ని గుర్తించి.. ఆ సమాచారాన్ని పోలీసులకు అందించేవాడు.దీంతో అతడి మీద కక్షకట్టిన గంజాయి బ్యాచ్ అతన్ని ఏదోలా చంపేయాలని డిసైడ్ అయ్యారు. శుక్రవారం సాయంత్రం ఇద్దరు పిల్లల్ని స్కూటీ మీద ఇంటికి తీసుకెళ్లే సమయంలో హౌసింగ్ బోర్డు ఆర్చివద్ద గుర్తు తెలియని తొమ్మిది మంది యువకులు పెంచలయ్యను అడ్డుకున్నారు.
‘మాకే అడ్డు వస్తావా?’ అంటూ వారంతా ఒక్కసారిగా అతడిపై కత్తులతో దాడికి పాల్పడ్డారు. దీంతో భయానికి గురైన పెంచలయ్య పారిపోతుంటే.. వెంటాడి మరీ అతడిపై కత్తులతో దాడి చేశారు. దీంతోకుప్పకూలిపోయాడు. స్థానికులు అతడ్ని ఆసుపత్రికి తరలించగా..అప్పటికే చనిపోయినట్లుగావైద్యులు వెల్లడించారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. ఒక మహిళ ఆధ్వర్యంలో గంజాయి బ్యాచ్ ఒకటి కార్యకలాపాలు నిర్వహిస్తుంటారని.. దీనిపై పోలీసులకు గతంలో సమాచారం ఇచ్చినా ఎలాంటి ప్రయోజనం జరగలేదన్న మాట పలువురి నోటవినిపిస్తోంది. తాజా ఉదంతం పెను సంచలనంగా మారింది.
