Begin typing your search above and press return to search.

విజయవాడ, నెల్లూరు జైళ్లు కిటకిట.. నిందితుల్లో ఎక్కువ మంది ఎవరంటే?

ఏపీలోని విజయవాడ జిల్లా జైలు, నెల్లూరు సెంట్రల్ జైలు తరచూ వార్తల్లో నిలుస్తున్నాయి.

By:  Tupaki Political Desk   |   11 Dec 2025 7:04 PM IST
విజయవాడ, నెల్లూరు జైళ్లు కిటకిట.. నిందితుల్లో ఎక్కువ మంది ఎవరంటే?
X

ఏపీలోని విజయవాడ జిల్లా జైలు, నెల్లూరు సెంట్రల్ జైలు తరచూ వార్తల్లో నిలుస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ కేసుల్లో జరుగుతున్న అరెస్టుల వల్ల ఈ రెండు జైళ్ల చుట్టూనే రాజకీయం నడుస్తోంది. ప్రధానంగా రాజకీయాలు చేస్తూ వివిధ కేసుల్లో అరెస్టు అవుతున్న వారు, రాజకీయాలతో సంబంధాలు ఉండి అరెస్టు అయిన వారు ఎక్కువగా ఈ రెండు జైళ్లకు వస్తున్నారు. దీంతో ఈ రెండు జైళ్లలో ఏం జరుగుతుందనే ఆసక్తి రోజురోజుకు ఎక్కువవుతోంది.

మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరులు తాజాగా రిమాండ్ ఖైదీలుగా నెల్లూరు సెంట్రల్ జైలుకు వచ్చారు. దీంతో మరోసారి నెల్లూరు జైలుపై చర్చ జరుగుతోంది. కూటమి అధికారంలోకి వచ్చేవరకు నెల్లూరు సెంట్రల్ జైలుపై పెద్దగా ఫోకస్ ఉండేది కాదు. ఎక్కువగా విశాఖపట్నం, రాజమండ్రి సెంట్రల్, కడప సెంట్రల్ జైళ్లలోనే ముఖ్యమైన కేసులల్లో నిందితులను ఉంచేవారు. కానీ, కూటమి అధికారంలోకి వచ్చాక ఆ జైళ్లపై పెద్దగా ఒత్తిడి ఉండటం లేదంటున్నారు. విజయవాడ జిల్లాజైలు, నెల్లూరు సెంట్రల్ జైలుకే ఎక్కువ మంది నిందితులను రిఫర్ చేస్తుండటంతో రెండు కారాగారాలు కిక్కిరిసిపోతున్నట్లు వ్యాఖ్యానిస్తున్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో తిరుమల లడ్డూ కల్తీ కేసు, ములకలచెరువు నకిలీ మద్యం కేసు, ఏపీ లిక్కర్ స్కాం, నెల్లూరులో మహిళా డాన్లపై కేసులే ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. ప్రధాన మీడియాతోపాటు సోషల్ మీడియా కూడా ఆయా కేసులపై ఫోకస్ చేయడంతో ప్రతిరోజూ విజయవాడ, నెల్లూరు జైళ్ల చుట్టూ వార్తలు షికారులు చేస్తున్నాయి. నిత్యం ఏదో ఒక కేసుకు సంబంధించి నిందితులను బయటకు తేవడం, తిరిగి తీసుకువెళ్లడం లేదంటే కొత్త కేసులతో ముఖ్యమైన వారు నిందితులుగా ఆయా జైళ్లలో అడుగు పెడుతుండటం పెద్ద చర్చకు దారితీస్తోంది.

తిరుమల లడ్డూ కేసుకు సంబంధించి దాదాపు పది మందిని అరెస్టు చేయగా, వారంతా ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైలులోనే ఉన్నారు. ఇక పలు కేసుల్లో నిందితురాలైన నెల్లూరు లేడీ డాన్ అరుణ, సీపీఎం హత్య కేసులో నిందితురాలు కామాక్షిని నెల్లూరు జైలులోనే ఉంచారు. ఇక వైసీపీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన సోదరుడు రాము.. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి కూడా నెల్లూరు జైలులోనే ఉన్నారు. ఇదే జైలులో వైసీపీపి చెందిన మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డిని కొన్నాళ్లు రిమాండులో ఉంచారు.

అదేవిధంగా విజయవాడ జిల్లా జైలు సైతం వీఐపీ ఖైదీలతో తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటోందని చెబుతున్నారు. ఈ జైలులో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, లిక్కర్ కేసులో ఏ1 కేసిరెడ్డి రాజశేఖరరెడ్డి, ఎస్పీవై డిస్టలరీస్ కి చెందిన సజ్జల శ్రీధర్ రెడ్డితో పాటు సీనియర్ ఐపీఎస్ సంజయ్ వంటి వీఐపీలు రిమాండులో ఉన్నారు. దీంతో విజయవాడ సెంట్రల్ జైలు రోజూ వార్తల్లో ఉంటోంది. గతంలో విజయవాడ జైలులో ఎక్కువగా గంజాయి విక్రేతలు, రౌడీషీటర్ల, దొంగలను మాత్రమే ఉంచేవారు. కానీ, తాజా పరిస్థితుల వల్ల వీఐపీలు ఈ జైలుకు రిమాండ్ ఖైదీలుగా వస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో వారి భద్రత సిబ్బందికి పెను సవాల్ గా మారుతోందని అంటున్నారు.