వారి మధ్య సయోధ్య.. రెడ్లు ఏకమవుతున్నారు..!
మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారడం అనేది వ్యక్తిగతంగానే కాదు.. రాజకీయంగా కూడా చాలా చాలా అవసరం.
By: Garuda Media | 22 Aug 2025 5:00 AM ISTమారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారడం అనేది వ్యక్తిగతంగానే కాదు.. రాజకీయంగా కూడా చాలా చాలా అవసరం. ఈ అవసరం చాలా ముఖ్యం కూడా. ఇదే అవసరాన్ని నొక్కి చెబుతూ.. నెల్లూరు జిల్లా రెడ్లు ఏకమవుతున్నారు. రాజకీయంగా విభేదించుకోవచ్చని.. కానీ, వ్యక్తిగతంగా మాత్రం వద్దని ఈ జిల్లాకు చెందిన రెడ్డి సమాజిక వర్గం అభిప్రాయపడుతోంది. జిల్లా వ్యాప్తంగా.. రెడ్ల మధ్య చీలిక ఉన్న విషయం తెలిసిందే. కొందరు టీడీపీని బలపరిస్తే.. మరికొందరు వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారు.
రాజకీయంగా ఎవరు ఏ పార్టీకి మొగ్గు చూపినా తప్పులేదు. కానీ, సాధారణంగా రెడ్డి సామాజిక వర్గంలో కక్ష లు, కార్పణ్యాలు తక్కువ. ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం నుంచి కోస్తావరకు కూడా కలిసిమెలిసి ఉన్న రెడ్లు అనేక మంది ఉన్నారు. వేర్వేరు పార్టీలే అయినా.. గెలిచినా ఓడినా.. నాయకులు కలిసి వ్యవహరించారు. కానీ, తర్వాత కాలంలో ముఖ్యంగా వైసీపీ ఎంట్రీతో రెడ్ల మధ్య మరింత చీలిక వచ్చింది. ఈ నేపథ్యంలో రాజకీయాలకు తోడు వ్యక్తిగతంగా కూడా వారు విభజన దిశగా అడుగులు వేశారు.
దీనివల్ల రెడ్ల మధ్య ఐక్యత పోయిందన్న టాక్ నెల్లూరులో జోరుగా వినిపిస్తోంది. ``పార్టీల అధినేతల మాట ఎలా ఉన్నా.. జిల్లాకు చెందిన నాయకులు కలిసి ఉండాలి. ఎన్నికల సమయంలో రాజకీయాలు చేసుకోవ చ్చు. ఆ తర్వాత.. కలిసి ఉండొచ్చు. అందుకే మా ప్రయత్నం మేం చేస్తున్నాం. చేతులు కలపడం తప్పు కాదు. తర్వాత.. వారి నిర్ణయం వారిది.`` అని నెల్లూరు రెడ్డి సంఘానికి చెందిన కీలక నాయకుడు ఒకరు చెప్పారు. ఈయనకు అన్ని పార్టీలతోనూ పరిచయం ఉంది. ప్రముఖ వ్యాపార వేత్త కూడా.
ఇంతకీ విషయం ఏంటంటే.. టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి-వైసీపీ నాయకుడు కాకాని గోవర్ధన్‌రెడ్డికి మధ్య వివాదాలు ఉన్నాయి. అలాగే.. నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డికి-టీడీపీలోని వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. అదేవిధంగా నేదురుమల్లి రామ్‌కుమార్ రెడ్డితోనూ అనేక మంది రెడ్డి నాయకులకు పడడం లేదు. దీనివల్ల జిల్లాలో ప్రశాంత వాతావరణం కనుమరుగైందని రెడ్డి నేతలు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో వారందరినీ ఏకతాటిపైకి తెచ్చి... చేతులు కలిపేలా చేయాలన్నది వీరి ప్రయత్నం. ఇది మంచిదే అయినా.. సుదీర్ఘ వివాదాలు ఉన్న నాయకులు కలుసుకుంటారా? అనేది చూడాలి.
