Begin typing your search above and press return to search.

నెల్లూరు మేయ‌ర్ పీఠం.. టీడీపీకే?

దీనిలో భాగంగానే మంత్రి నారాయ‌ణ‌(నెల్లూరు అర్బ‌న్‌ ఎమ్మెల్యే) రంగంలోకి దిగారు. వైసీపీ అస‌మ్మ‌తి నాయ‌కుల‌తో ఆయ‌న ప‌లు ద‌ఫాలుగా చ‌ర్చ‌లు కూడా చేశారు.

By:  Garuda Media   |   25 Nov 2025 3:00 AM IST
నెల్లూరు మేయ‌ర్ పీఠం.. టీడీపీకే?
X

నెల్లూరు జిల్లా రాజ‌కీయాలు అనూహ్యంగా మార్పు బాట ప‌ట్టాయి. 2021లో జ‌రిగిన మునిసిప‌ల్ ఎన్నికల్లో నెల్లూరు కార్పొరేష న్ పీఠాన్ని వైసీపీ ద‌క్కించుకుంది. మొత్తం 54 మంది కార్పొరేట‌ర్లు వైసీపీ జెండాపై విజ‌యం ద‌క్కించుకున్నారు. అయితే.. ఇటీవ‌ల కాలంలో వైసీపీలోనే అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు పెరిగాయి. దీంతో వైసీపీ నుంచి జంపింగులు కొన‌సాగుతున్నాయి. సుమారు 40 మంది వ‌ర‌కు టీడీపీకి ట‌చ్‌లోకి వెళ్లార‌ని చ‌ర్చ సాగుతోంది. ఈ నేప‌థ్యంలో మేయ‌ర్ పీఠాన్ని టీడీపీ ద‌క్కించుకునే వ్యూహాత్మ‌క చ‌ర్య‌ల‌కు శ్రీకారం చుట్టారు.

దీనిలో భాగంగానే మంత్రి నారాయ‌ణ‌(నెల్లూరు అర్బ‌న్‌ ఎమ్మెల్యే) రంగంలోకి దిగారు. వైసీపీ అస‌మ్మ‌తి నాయ‌కుల‌తో ఆయ‌న ప‌లు ద‌ఫాలుగా చ‌ర్చ‌లు కూడా చేశారు. ఈ క్ర‌మంలోనే పార్టీ మార్పున‌కు అనుకూలంగాఉన్న‌వారి నుంచి లేఖ‌లుసేక‌రించారు. అనంత‌రం.. మేయ‌ర్ పీఠానికి సంబంధించి మార్పు దిశ‌గా కార్యాచ‌ర‌ణ‌ను చేప‌ట్టారు. ప్ర‌స్తుతం 40 మంది కార్పొరేట‌ర్లు.. ప్ర‌స్తుత మేయ‌ర్‌, వైసీపీ నాయ‌కురాలు స్ర‌వంతిపై త‌మ‌కు న‌మ్మ‌కం లేద‌ని.. ఆమె అవినీతికి పాల్ప‌డుతున్నార‌ని పేర్కొంటూ క‌మిష న‌ర్‌కు లేఖ అందించారు. దీంతో కౌన్సిల్‌లో విశ్వాస ప‌రీక్ష‌ను ఎదుర్కొనాల్సి ఉంటుంది.

ఇదే జ‌రిగితే.. మెజారిటీ స‌భ్యులు స్ర‌వంతికి వ్య‌తిరేకంగా ఓటెత్త‌నున్నారు. దీంతో ఆమె ప‌ద‌వీ భంగం ఖాయ‌మ‌ని తెలుస్తోంది. అనంత‌రం.. టీడీపీ త‌ర‌ఫున మ‌రొక‌రిని ఎంచుకుని.. వారిని ఈ సీటులో కూర్చోబెట్ట‌నున్నారు. ప్ర‌స్తుతం మేయ‌ర్ అవిశ్వాసం తీర్మానం వ‌ర‌కు వ్య‌వ‌హారం న‌డిచిన నేప‌థ్యంలో సాధ్య‌మైనంత వేగంగా ఈ కార్య‌క్ర‌మాన్ని ముగించాల‌ని పార్టీ కూడా భావిస్తోంది. గ‌తంలో చీరాల‌, గుంటూరు, విశాఖ‌ప‌ట్నం కార్పొరేష‌న్లు కూడా ఇలానే టీడీపీ వ‌శ‌మ‌య్యాయి. ఇప్పుడు ఈ ప‌రంప‌ర‌లో నెల్లూరు కార్పొరేష‌న్ పీఠం కూడా టీడీపీకి ద‌క్కే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

ఇదిలావుంటే.. వైసీపీ వ్య‌వ‌హారం చిత్రంగా ఉంది. పార్టీ అధినేత నుంచి కానీ.. స్థానికంగా ఉన్న నాయ‌కుల నుంచి ఈ వ్య‌వ‌హా రంపై ఎవ‌రూ స్పందించ‌డం లేదు. గ‌త ఎన్నిక‌ల్లో కార్పొరేష‌న్ విజ‌యంలో కీల‌క రోల్ పోషించిన మాజీ మంత్రి అనిల్ కుమార్ కూడా ఇప్పుడు అడ్ర‌స్ లేకుండా క‌నిపిస్తున్నారు. గ‌తంలో ప‌నిచేసిన కోటంరెడ్డి శ్రీధ‌ర్ రెడ్డి కూడా.. ఇప్పుడు టీడీపీలోనే ఉన్నారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో నెల్లూరు కార్పొరేష‌న్‌ను టీడీపీ కైవ‌సం చేసుకోవ‌డం సునాయాశంగా మారుతుంద‌ని అంటున్నారు పరిశీల‌కులు.