నెల్లూరులో నువ్వా - నేనా పాలిటిక్స్.. !
గతంలో వైసీపీ తరఫున మేయర్‌గా ఉన్న పొట్లూరి స్రవంతి రాజీనామా చేయడం, అలాగే కార్పొరేటర్లు పెద్ద సంఖ్యలో పార్టీలు మారడంతో వైసీపీ కొంత మేరకు బలహీన పడిందన్నది వాస్తవమే.
By: Garuda Media | 14 Sept 2026 1:00 PM ISTనెల్లూరు మునిసిపల్ కార్పొరేషన్ రాజకీయం ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠభరితంగా ఉంది. వైసీపీ నేతల్లో కొందరు యాక్టివ్‌గా కనిపించకపోయినా.. అంతర్గతంగా మాత్రం చక్కదిద్దేలా వ్యవహరిస్తున్నారు. మరోవైపు.. కూటమికి వైసీపీ నేతల వ్యూహాలు సవాల్‌గా మారే అవకాశం ఉందని అంటున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఇక్కడి రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. వైసీపీకి ఒకప్పుడు కంచుకోటగా ఉన్న నెల్లూరు కార్పొరేషన్‌లో ప్రస్తుతం టీడీపీ నేతృత్వంలోని కూటమి తన ఆధిపత్యాన్ని గట్టిగా చాటుతోంది.
గతంలో వైసీపీ తరఫున మేయర్‌గా ఉన్న పొట్లూరి స్రవంతి రాజీనామా చేయడం, అలాగే కార్పొరేటర్లు పెద్ద సంఖ్యలో పార్టీలు మారడంతో వైసీపీ కొంత మేరకు బలహీన పడిందన్నది వాస్తవమే. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన మేయర్ ఎన్నికల్లో టీడీపీ మద్దతుతో 53వ డివిజన్ కార్పొరేటర్ దేవరకొండ సుజాత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైస్ మేయర్‌గా సయ్యద్ తహసీన్ బాధ్యతలు చేపట్టారు. వాస్తవానికి 2021లో జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో వైసీపీ ఇక్కడ క్లీన్ స్వీప్ (54 డివిజన్లు) చేసింది. అయితే.. 2024లో పార్టీ పరిస్థితి తలకిందులైంది.
రాష్ట్రంలో ప్రభుత్వం మారాక అత్యధిక శాతం కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. మరోవైపు వైసీపీ కీలక నాయకుడు పోలబోయిన అనిల్‌కుమార్ వంటి వారు కేసులకు భయపడి సైలెంట్ కావడంతో నెల్లూరు కార్పొరేషన్‌లో ఇబ్బందులు తప్పవని అనుకున్నారు. కానీ, ఎన్నికలకు సర్కారు రెడీ అయిన దరిమిలా వైసీపీ సైతం తమ క్యాడర్‌ను కాపాడుకునేందుకు, పార్టీ మారిన వారిని తిరిగి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. మునిసిపల్ ఎన్నికల కోసం పార్టీ వ్యూహాలు రచిస్తోంది.
మంత్రికి ప్రతిష్టాత్మకం..
నెల్లూరు జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నా.. నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి పొంగూరు నారాయణకు ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ స్థానాన్ని లక్ష ఓట్ల మెజారిటీతో కైవసం చేసుకుంటామని మంత్రి అడపాదడపా ప్రకటిస్తున్నారు. కానీ, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తాజాగా ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో మంత్రి తన వ్యూహాలకు మరింత పదును పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మంత్రిగా ఆయన పనితీరు బాగున్నా.. క్షేత్రస్థాయిలో పర్యటనలు తగ్గాయి. అదేసమయంలో క్షేత్రస్థాయి కూటమి నాయకులతోనూ ఆయన కలివిడి అంతంత మాత్రమేనన్న చర్చ సాగుతోంది.
