Begin typing your search above and press return to search.

51 కార్టన్లలో నెహ్రూ పత్రాలు... అసలేమిటీ వివాదం!

దేశ తొలి ప్రధానికి చెందిన లేఖలను ఆయన కుటుంబ సభ్యులు తీసుకుని వెళ్లడంపై పలు అనుమానాలు తెరపైకి వస్తున్నాయనేది బీజేపీ వాదన.

By:  Raja Ch   |   19 Dec 2025 10:44 AM IST
51 కార్టన్లలో నెహ్రూ  పత్రాలు... అసలేమిటీ వివాదం!
X

ప్రధానమంత్రి మ్యూజియం, లైబ్రరీ (పీఎంఎంఎల్) నుంచి భారతదేశ తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూకు సంబంధించిన పత్రాలు కనిపించడం లేదని కేంద్రం తాజాగా స్పష్టం చేయడం తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఆ పత్రాలను 2008లో సోనియాగాంధీ తీసుకెళ్లారని చెబుతూ.. వాటిని వెంటనే పీఎంఎంఎల్ కు తిరిగి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. దీంతో... ఆ పత్రాల్లో ఏమి ఉందనే విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

అవును... జవహర్ లాల్ నెహ్రూ పత్రాల 51 కార్టన్లను దాచిపెట్టారని చెబుతూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా విమర్శించింది. వాటిని వెంటనే పీ.ఎం.ఎం.ఎల్ కి తిరిగి ఇవ్వాలని కోరింది. ఫలితంగా పౌరులు, పండితులు పార్లమెంటు నెహ్రూవియన్ కాలం నాటి చారిత్రక రికార్డులను పొందగలరని.. పైగా ఈ పత్రాలు ఉండాల్సింది ప్రజా ఆర్క్వైస్ లో ఉండాలి కానీ, మూసిన తలుపుల వెనుక కాదని నొక్కి చెప్పింది.

భారతదేశ తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూకు సంబంధించిన ఏ పత్రాలు 2025 సంవత్సరంలో పీ.ఎం.ఎం.ఎల్ వార్షిక తనిఖీ సమయంలో మ్యూజియంలో కనిపించలేదని బీజేపీ ఎంపీ సంబిత్ పాత్రా అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా షెకావత్ పార్లమెంటుకు తెలిపారు. తొలి ప్రధానికి సంబంధించిన పత్రాలపై లోక్ సభలో అడిగిన ప్రశ్నకు కేంద్రం ఇచ్చిన సమాధానంపై కాంగ్రెస్ విమర్శలు చేసిన ఒక రోజు తర్వాత.. కేంద్రం నుంచి ఈ స్పష్టత వచ్చింది.

ఈ విషయంపై ఎక్స్ లో స్పందించిన కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్.. నెహ్రూ పత్రాలు పీ.ఎం.ఎం.ఎల్ నుంచి తప్పిపోలేదని అన్నారు. తప్పిపోవడం అంటే ఎక్కడ ఉందో తెలియదు అని అర్ధం అని ఆయన వివరించారు. వాస్తవానికి 2008లో ప్రధానమంత్రి మ్యూజియం లైబ్రరీ నుంచి 51 కార్టన్ల జవహర్ లాల్ నెహ్రూ పత్రాలను కుటుంబం అధికారికంగా తిరిగి తీసుకుంది. వాటి స్థానం తెలుసు.. అందువల్ల అవి తప్పిపోలేదు అని అన్నారు.

ఇదే సమయంలో.. జవహర్ లాల్ నెహ్రూ జీవితం, కాలాల గురించి సత్యమైన, సమతుల్య అవగానకు రావడానికి పండితులు, పరిశోధకులు, పౌరులు, విద్యార్థులు అసలైన డాక్యుమెంటరీ మూలాలను యాక్సెస్ చేసే హక్కు కలిగి ఉన్నారని షెకావత్ అన్నారు. ఓ వైపు ఆ యుగం తప్పిదాల గురించి చర్చించవద్దని అడుగుతూనే మరోవైపు సమాచారంతో కూడిన చర్చకు వీలు కల్పించే ప్రాథమిక మూల సామాగ్రిని ప్రజల నుంచి దూరంగా ఉంచారని తెలిపారు.

ప్రభుత్వం ప్రకారం... సోనియా గాంధీ ప్రతినిధి అయిన ఎంవీ రాజన్ ఏప్రిల్ 29-2008 నాటి లేఖలో నెహ్రూకు చెందిన అన్ని ప్రైవేటు కుటుంబ లేఖలు, నోట్లను తిరిగి తీసుకోవడానికి తమకు అనుమతి ఇవ్వాలని అభ్యర్థించారు.

కాగా... నెహ్రూ మరణం తర్వాత సెంట్రల్ ఢిల్లీలోని తీన్ మూర్తి భవన్ ను నెహ్రూ మెమోరియల్ మ్యూజియం, లైబ్రరీ (ఎన్.ఎం.ఎం.ఎల్) గా మార్చారు. ఇందులో గొప్ప గొప్ప పుస్తకాలు, అరుదైన రికార్డులు ఉన్నాయి. అయితే దీనిని 2023లో ప్రధానమంత్రి మ్యూజియం, లైబ్రరిగా పేరు మార్చబడింది. ఏది ఏమైనా నెహ్రూ పత్రాల విషయం ఇప్పుడు అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య వివ్వాదాస్పద అంశంగా మారిన పరిస్థితి.

అసలు ఆ లేఖల్లో ఏముందని దాస్తున్నారు..?:

దేశ తొలి ప్రధానికి చెందిన లేఖలను ఆయన కుటుంబ సభ్యులు తీసుకుని వెళ్లడంపై పలు అనుమానాలు తెరపైకి వస్తున్నాయనేది బీజేపీ వాదన. ఆ లేఖలను దాచి పెట్టడం వల్ల సోనియా గాంధీ ఏమి దాచిపెట్టాలని అనుకుంటున్నారనేది వారి ప్రశ్న. ఈ క్రమంలో.. లేఖల విషయంలో ఎక్కువగా వినిపిస్తోన్న పేరు భారత్ కు చివరి వైశ్రాయ్ గా పనిచేసిన లార్డ్ మౌంటెన్ భార్య.. ఎడ్వినా! పైగా.. ఎడ్వినా - నెహ్రూ తరచూ లేఖలు రాసుకునేవారని చరిత్రకారులు చెబుతుంటారు.

ఈ నేపథ్యంలోనే వీరి మధ్య బలమైన బంధం ఉందని ఎడ్వినా కుమార్తె రాసిన పుస్తకాన్ని ఈ సందర్భంగా పలువురు కోట్ చేస్తుంటారు. ఎడ్వినా కోరిక మేరకే లార్డ్ మౌంట్ బాటెన్.. ఆమె మరణించిన తర్వాత సముద్రం పక్కనే ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. అయితే.. ఆ సమయంలో నెహ్రూ భారత నావికాదళంలోని యుద్ధనౌక ఐ.ఎన్.ఎస్. త్రిశూల్ ను ఎస్కార్ట్ గా పంపించారట. ఒక విదేశీ మహిళకు భారత్ ఇచ్చిన అత్యునంత గౌరవంగా దీన్ని పరిగణిస్తారు.

ఎడ్వినా సంగతి కాసేపు పక్కనపెడితే.. నెహ్రూ అప్పట్లో జయప్రకాశ్ నారాయణ్, ఆల్బర్ట్స్ ఐన్ స్టీన్, పద్మజ నాయుడు, విజయ్ లక్ష్మి పండిత్, బాబూ జగజ్జీవన్ రావు వంటి పలువురు ప్రముఖులకు లేఖలు రాశారట. ఇదే సమయంలో ప్రధానంగా ఐన్ స్టీన్ కు రాసిన లేఖల్లో దేశ విదేశాంగ విధానానికి సంబంధించిన విషయాలు కూడా ఉండోచ్చని.. అందుకే వాటిని పీ.ఎం.ఎం.ఎల్ లో ప్రజలకు అందుబాటులో ఉంచాలని కేంద్రం కోరుతోంది.