కాశీబుగ్గలో తొక్కిసలాటకు ఇదేనా అసలు కారణం!
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే.
By: Raja Ch | 2 Nov 2025 10:52 AM ISTశ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే, ఈ స్థాయిలో భక్తులు తరలిరావడానికి.. తొక్కిసలాట జరిగే స్థాయిలో చేరుకోవడానికి సోషల్ మీడియాలో జరిగిన అతి ప్రచారం కూడా ఓ కారణం అని అంటున్నారు. విశాఖలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన ఆహారోత్సవంలోనూ ఇదే జరిగిందని అంటున్నారు.
అవును... పర్వదినాల్లో ఫలానా ఆలయాన్ని సందర్శించి పూజలు చేస్తే పుణ్యం లభిస్తుందనే తరహా ప్రచారం ఇటీవల సోషల్ మీడియాలో జోరందుకున్న సంగతి తెలిసిందే. దీంతో కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కొన్ని దేవాలయాల వద్ద గతంలో ఎన్నడూ లేని స్థాయిలో భక్తులు చేరుకుంటున్నారు. తాజాగా కాశీబుగ్గలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలోనూ అదే జరిగిందని అంటున్నారు. ఈ ఘటనలో 9 మంది మృతి చెందారు.
కాశీబుగ్గలో ఆలయం గురించి ఇటీవల సోషల్ మీడియాలో ఎక్కువగా ప్రచారం జరిగింది. ఇందులో భాగంగా... తిరుమలలో స్వామి దర్శనానికి వెళ్లగా చేదు అనుభవం ఎదురైందనే కారణంతో రూ.20 కోట్లతో 12 ఎకరాల సొంత పొలంలో వేంకటేశ్వరస్వామి ఆలయం నిర్మించారని.. 92 ఏళ్ల వయసులోనూ హరిముకుంద్ పండా దగ్గరుండి ఈ ఆలయ నిర్వహణ చూస్తున్నారంటూ ఓ వీడియో వైరల్ అయింది.
ఈ నేపథ్యంలోనే.. కార్తిక ఏకాదశి రోజైన శనివారం పూజలకు అంచనాకు మించి భక్తులు వచ్చారు. పరిస్థితి తొక్కిసలాటకు దారి తీసి అమాయక భక్తుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.
అంతులేని నిర్లక్ష్యం!:
కాశీబుగ్గలో శనివారం చోటుచేసుకున్న దుర్ఘటనకు నిర్వహణ లోపం, భద్రతను పట్టించుకోకపోవడమే ప్రధాన కారణమని తెలుస్తోంది. పాత జాతీయ రహదారికి, రైల్వే, బస్ స్టేషన్లకు సమీపంలో ఉండటంతో పాటు సోషల్ మీడియాలో ప్రచారం నేపథ్యంలో ఈ ప్రైవేటు ఆలయానికి రోజుకు రెండు వేల మంది వరకు భక్తులు వస్తుంటారు.
దీనికితోడు శనివారం, పండుగరోజుల్లో అన్నసంతర్పణ నిర్వహిస్తుండటంతో ఈ సంఖ్య పెరుగుతుంది. అయినప్పటికీ ఆలయ యాజమాన్యం వైపు నుంచి భద్రతాపరమైన చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవని అంటున్నారు. మరోవైపు ఆలయానికి పెద్దఎత్తున భక్తులు వస్తున్నా పోలీసులు భద్రతపై దృష్టిపెట్టలేదని.. ఆ మార్గంలో వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించే చర్యలు తీసుకోలేదని చెబుతున్నారు.
