నీట్ పరీక్షపై కేంద్రం సంచలన నిర్ణయం.. మళ్లీ మొదటికి..
ఈ ఏడాది మే 3న నీట్ పరీక్ష జరిగింది. దీనికి సంబంధించిన ప్రశ్న పత్రం రాజస్థాన్ లో లీకైనట్లు కొద్ది రోజులుగా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
By: Tupaki Political Desk | 12 May 2026 1:55 PM ISTదేశవ్యాప్తంగా వైద్య విద్య ప్రవేశాలకు సంబంధించి ఈ నెల 3వ తేదీన నిర్వహించిన ప్రవేశ పరీక్ష నీట్ - 2026ను రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఆధ్వర్యంలో ఏటా మే నెలలో వచ్చే మొదటి ఆదివారం నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. ఈ ఏడాది మే 3న పరీక్ష జరగగా, అంతకు రెండు రోజుల ముందు రాజస్థాన్ లో పేపర్ లీకైనట్లు వార్తలు వచ్చాయి. దీంతో పరీక్షను రద్దు చేస్తున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది. దీంతో లక్షల మంది విద్యార్థులు ఉసూరుమంటున్నారు. ఈ ఏడాది సుమారు 22 లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్షలు రాశారు. చాలా మంది విద్యార్థులు రెండేళ్లకు పైగా నీట్ పరీక్షకు సిద్ధమవుతున్నారు. పరీక్ష పూర్తవడంతో ఫలితాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో పరీక్షను రద్దు చేస్తున్నట్లు ఎన్.టీ.ఏ ప్రకటించడం సంచలనంగా మారింది.
ఈ ఏడాది మే 3న నీట్ పరీక్ష జరిగింది. దీనికి సంబంధించిన ప్రశ్న పత్రం రాజస్థాన్ లో లీకైనట్లు కొద్ది రోజులుగా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. దీనిపై విచారణకు కేంద్ర ప్రభుత్వం ఆదేశించగా, పేపర్ లీకు నిజమేనని తేలింది. దీంతో పరీక్షను రద్దు చేస్తున్నట్లు ఎన్టీఏ వెల్లడించింది. మళ్లీ పరీక్ష ఎప్పుడు నిర్వహించేది త్వరలో తెలియజేస్తామని స్పష్టం చేసింది. విద్యార్థుల ప్రయోజనాలు, జాతీయ పరీక్ష వ్యవస్థపై నమ్మకం పెంచడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది. కొత్తగా పరీక్ష రాసేందుకు విద్యార్థులు ఎలాంటి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని, ఫీజులు కూడా చెల్లించాల్సిన పనిలేదని ఎన్టీఏ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.
పరీక్ష తేదీలు ఖరారైన తర్వాత ఆన్ లైన్ లో అడ్మిట్ కార్డులు అందుబాటులోకి ఉంచుతామని వివరించింది. కాగా, ప్రశ్నపత్రం లీకేజీపై దర్యాప్తు చేయాల్సిందిగా కేంద్రం సీబీఐకి బాధ్యతలు అప్పగించింది. పరీక్షకు రెండు రోజుల ముందు రాజస్థాన్ లో ‘గెస్ పేపర్’ పేరిట క్వశ్చన్ పేపర్ ను రూ.2 నుంచి 5 లక్షలకు విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. కొందరు విద్యార్థుల నుంచి రూ.20 వేల నుంచి 50 వేలు వసూలు చేశారని రాజస్థాన్ పోలీసుల విచారణలో వెల్లడైందని అంటున్నారు. కెమెస్ట్రీ విభాగంలో 120కి పైగా ప్రశ్నలతో ఉన్న ప్రాక్టీసు పేపరును పోలీసులు కనుగొన్నారు.
అదేవిధంగా కేరళలోని ఓ వైద్య కళాశాలకు చెందిన ఎంబీబీఎస్ విద్యార్థి నుంచి ప్రాక్టీసు పేపర్ రాజస్థాన్ లోని సికార్ లో శిక్షణ తీసుకుంటున్న స్నేహితుడికి వెళ్లిందని, చేతి రాతతో ఉన్న ఆ పేపరు నీట్ ప్రశ్నపత్రంలో సుమారు 600 మార్కులకు సరిపోయేలా కనిపిస్తోందని పోలీసులు గుర్తించారు. కొన్ని ప్రశ్నలు, వాటికి సమాధానాలుగా ఇచ్చిన ఆఫ్షన్ము క్రమం కూడా మారకపోవడంపై లీకేజీ అనుమానాలు ఎక్కువయ్యాయి. కేరళ, రాజస్థాన్ రాష్ట్రాల్లో పలు వాట్సాప్ గ్రూపుల్లో ఈ ప్రశ్నపత్రం వైరల్ అవడంతో పరీక్ష రద్దు చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
