Begin typing your search above and press return to search.

నీట్ లో 99.99 శాతం.. కట్ చేస్తే.. డాక్టర్ కావలసిన విద్యార్థి ఆత్మహత్య!

ఈ క్రమంలోనే ఒక విద్యార్థి నీట్ యూజీ - 2025లో ఏకంగా 99.99 శాతం మార్కులు సాధించి, జాతీయస్థాయిలో 1475వ ర్యాంకు పొంది.. కాలేజ్ అడ్మిషన్ రోజే ఆత్మహత్యకు పాల్పడడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

By:  Madhu Reddy   |   24 Sept 2025 9:02 PM IST
నీట్ లో 99.99 శాతం.. కట్ చేస్తే.. డాక్టర్ కావలసిన విద్యార్థి ఆత్మహత్య!
X

విద్యార్థులపై పెరుగుతున్న ఒత్తిడి కారణంగానే విద్యార్థుల మరణాలు పెరిగిపోతున్నాయని పలువురు నిపుణులు హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ కలలను విద్యార్థులపై రుద్దుతున్నారని.. వాటిని నెరవేర్చలేక విద్యార్థులలో మానసిక ఒత్తిడి పెరుగుతోందని, తద్వారా గుండెపోటు మాత్రమే కాకుండా ఒత్తిడి భరించలేక ఇలా ఆత్మహత్యకు పాల్పడుతున్నారు అంటూ కూడా చెబుతున్నారు. అయితే ఇలాంటి సమయంలో విద్యార్థులు ఒత్తిడి తట్టుకోలేక లేదా ఇతర కారణాల వల్ల క్షణికావేశంలో ఆత్మహత్యకు పాల్పడడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ముఖ్యంగా వీరు తీసుకునే నిర్ణయాల పట్ల తల్లిదండ్రులకు తీరని దుఃఖాన్ని మిగులుస్తోంది అని చెప్పవచ్చు.

ఈ క్రమంలోనే ఒక విద్యార్థి నీట్ యూజీ - 2025లో ఏకంగా 99.99 శాతం మార్కులు సాధించి, జాతీయస్థాయిలో 1475వ ర్యాంకు పొంది.. కాలేజ్ అడ్మిషన్ రోజే ఆత్మహత్యకు పాల్పడడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఈ ఘటన మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో చోటుచేసుకుంది.. పూర్తి వివరాల్లోకి వెళితే.. చంద్రపూర్ జిల్లా సందేవాహి తాలూకాలోని నవర్ గావ్ ప్రాంతానికి చెందిన అనురాగ్ అనిల్ బోర్కర్ (19) చిన్నప్పటినుంచి చదువులో ముందు ఉండేవాడు. కష్టపడి చదివి నీట్ లో అద్భుతమైన ఫలితాలు కూడా సాధించారు . అనురాగ్ అనిల్ బోర్కర్ ఫలితాలు చూసి అటు కుటుంబ సభ్యులు.. బంధువులు.. స్నేహితులు అందరూ కూడా ఖచ్చితంగా ఇతడు ఒక మంచి వైద్యుడిగా ఎదుగుతాడని ఆశలు పెట్టుకున్నారు.

అనురాగ్ అనిల్ కి వచ్చిన ర్యాంకు ఆధారంగా ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్పూర్ మెడికల్ కాలేజీలో ఎంబిబిఎస్ కోర్స్ లో ప్రవేశం కూడా లభించింది. కుటుంబ సభ్యులతో కలిసి మెడికల్ కాలేజ్ వెళ్లడానికి సన్నాహాలు చేస్తూ ఉండగా.. అనురాగ్ అనిల్ బోర్కర్ అనూహ్యంగా ఇంట్లోనే ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. డాక్టర్ గా మారుతాడని కలలు కన్న తల్లిదండ్రులకు ఇది ఊహించని పరిణామం.. ఒక్కసారిగా కుమారుడి మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు బంధువులు దుఃఖంలో మునిగిపోయారు. ఆ ప్రాంతం మొత్తం అశ్రునయనాలతో నిండిపోయింది. డాక్టర్ చదివి తమకు అండగా నిలుస్తాడు అనుకున్న చెట్టంత కొడుకు ఇలా కళ్ళెదుటే ఇలా విగత జీవిగా పడి ఉండడం చూసి.. ఆ తల్లిదండ్రులకు పిడుగు పడినట్టు అనిపించింది.

ఇకపోతే విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని.. అనురాగ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకోగా.. అక్కడే ఒక సూసైడ్ నోట్ కూడా లభ్యమయ్యింది. అయితే పోలీసులు ఆ సూసైడ్ నోట్లో ఉన్న వివరాలను పూర్తిగా బయటకు చెప్పకపోయినా.. పోలీస్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం అనురాగ్ కి ఎంబిబిఎస్ చదవడం ఇష్టం లేదని.. వైద్య వృత్తిపై ఆసక్తి లేకపోవడం వల్ల ఈ దారుణ నిర్ణయం తీసుకున్నాడని సమాచారం. ప్రస్తుతం ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు మానసిక ఒత్తిడి, కుటుంబ అంచనాలు వంటి అంశాలు కూడా ఈ కేసులో ప్రధాన కోణాలుగా విచారణలో ఉన్నాయని స్పష్టం చేశారు.