Begin typing your search above and press return to search.

పోలీస్ వ్యాన్ అడ్డుకుని.. నీట్ నిరసనల్లో వైరల్ అయిన రియా అహిర్ ఎవరు? ఆమె ధైర్యం ఏంటి?

లక్షలాది మంది విద్యార్థుల రాత్రింబవళ్ల కష్టం.. వేలాది పేద, మధ్యతరగతి కుటుంబాల కళ్లలోని డాక్టర్ కలలు.. ఒక్క పేపర్ లీకేజీతో మట్టిలో కలిసిపోయిన వేళ.. దేశమంతా ఆక్రోశంతో రగిలిపోయింది.

By:  A.N.Kumar   |   24 July 2026 12:36 PM IST
పోలీస్ వ్యాన్ అడ్డుకుని.. నీట్ నిరసనల్లో వైరల్ అయిన రియా అహిర్ ఎవరు?  ఆమె ధైర్యం ఏంటి?
X

లక్షలాది మంది విద్యార్థుల రాత్రింబవళ్ల కష్టం.. వేలాది పేద, మధ్యతరగతి కుటుంబాల కళ్లలోని డాక్టర్ కలలు.. ఒక్క పేపర్ లీకేజీతో మట్టిలో కలిసిపోయిన వేళ.. దేశమంతా ఆక్రోశంతో రగిలిపోయింది. తమ భవిష్యత్తును ప్రశ్నిస్తూ రోడ్డెక్కిన అమాయక విద్యార్థుల గొంతు నొక్కేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముంబై వీధుల్లో రోదనలు, నినాదాల మధ్య ఆక్రోశం మిన్నంటింది. అభాగ్యులైన విద్యార్థులను పోలీసులు బలవంతంగా వ్యాన్లలో కుక్కుతుంటే చుట్టూ ఉన్న ప్రపంచం కేవలం ప్రేక్షకపాత్ర వహించింది. కానీ ఆ క్షణంలోనే అందరినీ ఆశ్చర్యపరిచే ఒక అద్భుతం జరిగింది! ఒక సాధారణ యువతి, చట్టాన్ని ప్రశ్నించే హక్కున్న బాధ్యతాయుతమైన పౌరురాలిగా మారి.. ఆ సైరన్ మోతల మధ్య, పోలీసుల భయం ముందు ఒక ధైర్యపు ప్రతీకగా నిలబడింది.

ఆమె పేరు రియా అహిర్..ముంబై వీధుల్లో గుండెను పిండేసే ఘట్టం

అది ముంబైలోని దాదర్, శివాజీ పార్క్ ప్రాంతం. నీట్ పరీక్ష నిర్వహణలో జరిగిన ఘోర అవకతవకలకు నిరసనగా విద్యార్థులు, యువత భారీగా తరలివచ్చారు. "మా భవిష్యత్తుతో చెలగాటమాడకండి.. కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి" అంటూ ఆవేదనతో నినాదాలు చేస్తున్నారు. కానీ అక్కడ శాంతియుతంగా జరుగుతున్న నిరసనను అణచివేసేందుకు పోలీసులు విద్యార్థులను అదుపులోకి తీసుకోవడం ప్రారంభించారు. ఊపిరి ఆడనంతగా కిక్కిరిసిపోయిన ఒక పోలీస్ వ్యాన్.. దాని మెట్లపై వేలాడుతూ ప్రయాణిస్తున్న పోలీసులు.. లోపల నుంచి తమ హక్కుల కోసం కేకలు వేస్తున్న విద్యార్థులు.. ఆ దారుణమైన పరిస్థితిని చూసి అక్కడ స్నేహితుల కోసం ఎదురుచూస్తున్న రియా గుండె తల్లడిల్లింది. ఆమెలోని పౌరస్ఫూర్తి నిద్రలేచింది. ఏమాత్రం తడబడకుండా నేరుగా పోలీసుల ముందుకు వెళ్లి నిలదీసింది.. "అసలు వీళ్లను అరెస్ట్ చేయడానికి మీ దగ్గర 'అరెస్ట్ మెమో' ఉందా? చట్టబద్ధమైన ప్రక్రియను అనుసరించకుండా విద్యార్థులను ఎలా తీసుకెళ్తారు?" అంటూ పోలీస్ వ్యాన్ కు అడ్డంగా నిలబడి నిలదీసింది.

భయాన్ని జయించిన పిడికిలి

పోలీసుల వద్ద సరైన సమాధానం లేదు. కానీ రియా వెనకడుగు వేయలేదు. క్షణాల్లో ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులతో ఉన్న ఆ పోలీస్ వ్యాన్ ముందుకు వెళ్లి దానిని పూర్తిగా అడ్డుకుంది. బోనెట్‌పై ఒక చెయ్యి గట్టిగా ఆనించి.. మరో చేతితో ఆకాశంలోకి పిడికిలి బిగించి.. "ఇంక్విలాబ్ జిందాబాద్!" అంటూ సింహంలా గర్జించింది.

ఆ క్షణం.. ఆ వ్యాన్ మాత్రమే కాదు, దేశమంతటా సోషల్ మీడియాను చూస్తున్న ప్రతీ ఒక్కరి గుండె ఆగిపోయింది.. పోలీసుల హెచ్చరికలు, చుట్టూ ఉన్న గందరగోళం ఆమె ధైర్యాన్ని ఏమాత్రం సడలించలేకపోయాయి. "తప్పు జరిగితే దానికి బాధ్యత వహించి రాజీనామా చేయాలి కానీ తమ హక్కుల కోసం పోరాడుతున్న విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకోవడం ఏ రకమైన న్యాయం?" అని ఆమె గొంతు విప్పి ప్రశ్నించిన తీరు ప్రతీ ఒక్కరి హృదయాన్ని ద్రవింపజేసింది.

వ్యవస్థను ప్రశ్నించిన 'జెన్ జెడ్' ఆత్మగౌరవం

ఎప్పుడూ మొబైల్ ఫోన్లలో, సోషల్ మీడియాలో మునిగి తేలుతారంటూ ప్రస్తుత 'జెన్ జెడ్ ' యువతపై సమాజంలో ఒక రకమైన విమర్శ ఉంది. కానీ అదే మొబైల్ ఫోన్లు, డిజిటల్ చైతన్యం ఈరోజు వ్యవస్థ లోపాలను, అక్రమాలను దేశం ముందు ఎలా నగ్నంగా నిలబెట్టగలవో రియా నిరూపించింది. "మేము కేవలం రీల్స్ చేసుకునే వాళ్లం కాదు.. అన్యాయం జరిగితే రోడ్డెక్కి ప్రశ్నించే చైతన్యం ఉన్నవాళ్లం" అని ఆమె తన చర్య ద్వారా ప్రపంచానికి చాటిచెప్పింది.

దేశమంతా నీరాజనాలు.. విప్లవానికి నిలువెత్తు రూపం

ఆ నిమిషంలో తోటి విద్యార్థుల హక్కుల కోసం రియా చూపిన ఆత్మవిశ్వాసం, అపరిమితమైన ధైర్యం ఈరోజు ఆమెను దేశవ్యాప్తంగా ఒక ఐకాన్‌గా మార్చేశాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో దేశం నలుమూలల నుంచి ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది. వేలాది ఫోన్ కాల్స్, సందేశాలతో ప్రజలు ఆమెకు నీరాజనాలు పడుతున్నారు.

ఈ స్పందనపై రియా స్పందిస్తూ.. "ప్రజల నుంచి వస్తున్న ఈ ఆప్యాయత నాకు ఎంత గౌరవంగా అనిపిస్తోందో అంతకంటే ఎక్కువ బాధ్యతను గుర్తుచేస్తోంది" అని ఎంతో పరిణతితో పేర్కొంది. ఇది కేవలం ఒక పోలీస్ వ్యాన్‌ను అడ్డుకోవడం మాత్రమే కాదు.. వ్యవస్థ అణచివేతపై ఒక సామాన్య యువతి సాధించిన నైతిక విజయం.. న్యాయం కోసం నిలబడే ధైర్యం ఒక్కరికి ఉన్నా.. అది కోట్లాది మందిలో ఆశల దీపాలను వెలిగించగలదని రియా అహిర్ నిరూపించింది.