సీజేపీకి సెలబ్రెటీలు అందరూ సపోర్టు చేస్తున్నారు..? కారణమేంటంటే?
‘నీట్’ వివాదంపై సల్మాన్ ఖాన్ సహా పలువరు సినీ సెలబ్రెటీల భార్యలు, ప్రముఖులు, క్రీడాకారులు స్పందిస్తూ ట్వీట్లు చేస్తుండటంపై విశ్లేషకుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
By: A.N.Kumar | 23 July 2026 11:54 PM IST'యూత్ పవర్' సెగ ఇప్పుడు మన దేశ రాజధాని ఢిల్లీలో 'నీట్' పేపర్ లీకేజీ రూపంలో రగులుతోంది. 'కాక్రోచ్ జనతా పార్టీ' ఛత్రఛాయల్లో ఈ ఉద్యమ సెగలు చూసి.. ఇన్నాళ్లూ తమ కలెక్షన్ల లెక్కలు, వెకేషన్ పిక్స్ తో బిజీగా ఉన్న మన దేశీ సెలబ్రిటీలకు ఒక్కసారిగా చెమటలు పడుతున్నాయి. తమ కెరీర్‌కు పునాది అయిన కుర్రకారు ఎక్కడ కోపంతో 'అన్-ఫాలో' బటన్ నొక్కేస్తారో రీల్ లైఫ్ హీరోల బండారం బయటపెట్టేస్తారో అన్న బెంగతో.. ప్రముఖ హీరోలు, వారి భార్యల నుంచి పక్కింటి క్రికెటర్ వరకు అందరూ అర్జెంట్‌గా సోషల్ మీడియా లాగిన్ అయిపోయి ‘విద్యార్థులకు న్యాయం జరగాలి’ అంటూ హృదయ విదారకమైన ట్వీట్లు వర్షంలా కురిపిస్తున్నారు. సామాజిక బాధ్యతో, ఫాలోవర్స్ ఊడిపోతారనే దడతోనో ఏమో కానీ.. మొత్తానికి గ్లామర్ లోకం కూడా ఈ నీట్ నిరసనల ముందు మోకరిల్లక తప్పడం లేదు.
దేశవ్యాప్తంగా నీట్ పరీక్షకు సంబంధించిన వివాదాలు, పేపర్ లీకేజీ ఆరోపణల నేపథ్యంలో కాక్రోచ్ జనతాపార్టీ (సీజేపీ).. దానికి మద్దుతుగా విద్యార్థి, యువజన సంఘాలు చేపడుతున్న నిరసనలు రోజురోజుకూ మరింత తీవ్రరూపం దాల్చుతున్నాయి. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్న ఆందోళనలు ఇప్పుడు జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ‘కాక్రోచ్ జనతా పార్టీ’తో పాటు పలు విద్యార్థి సంఘాలు, సామాజిక కార్యకర్తలు, రాజకీయ నాయకులు ఈ పోరాటంలో భాగస్వామ్యమవుతుండటంతో ఉద్యమం ఊపందుకుంది.
ఈ క్రమంలోనే ఇప్పటివరకు కొంత నిశ్శబ్దంగా ఉన్న సినీ, క్రీడా రంగానికి చెందిన ప్రముఖులు, సెలబ్రిటీలు కూడా ఈ అంశంపై స్పందించడం ప్రారంభించారు. విద్యార్థుల భవిష్యత్తు, పరీక్షల నిర్వహణలో పారదర్శకతపై సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
యువజన ఉద్యమాలు.. గ్లోబల్ ట్రెండ్
ఇటీవలి కాలంలో పొరుగు దేశాలైన నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంకల్లో యువత, విద్యార్థులు చేపట్టిన ఉద్యమాలు అక్కడి రాజకీయ పరిణామాలను తీవ్రంగా ప్రభావితం చేసిన విషయాన్ని విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు. తమ హక్కులు, భవిష్యత్తు కోసం యువత రోడ్డెక్కితే ఎలాంటి మార్పులు వస్తాయో ఆయా దేశాల ఉదాహరణలు స్పష్టం చేస్తున్నాయి. అయితే భారత్‌లో ప్రజాస్వామ్య వ్యవస్థలు, సామాజిక పరిస్థితులు భిన్నంగా ఉన్నప్పటికీ.. యువతరం బలం, వారి డిమాండ్ల తీవ్రతను ప్రజాప్రతినిధులు, ప్రముఖులు గుర్తించక తప్పడం లేదు.
సెలబ్రిటీల స్పందన వెనుక ఉన్న కారణాలేంటి?
‘నీట్’ వివాదంపై సల్మాన్ ఖాన్ సహా పలువరు సినీ సెలబ్రెటీల భార్యలు, ప్రముఖులు, క్రీడాకారులు స్పందిస్తూ ట్వీట్లు చేస్తుండటంపై విశ్లేషకుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాదరణ పొందిన నాయకులు లేదా సెలబ్రిటీలకు అత్యధికంగా యువతలోనే ఫాలోయింగ్ ఉంటుంది. తమను ఆదరిస్తున్న యువత భవిష్యత్తు ప్రమాదంలో పడినప్పుడు.. వారి న్యాయమైన డిమాండ్లకు మద్దతుగా నిలవడం తమ సామాజిక బాధ్యత అని కొందరు భావిస్తున్నారు.
ఇక రెండో కారణం.. డిజిటల్ ఇమేజ్ తోపాటు అభిమానుల ఒత్తిడి కూడా సెలబ్రెటీలపై పడుతోంది. సోషల్ మీడియా యుగంలో ప్రజాభిప్రాయం వేగంగా మారుతోంది. నిరసనల తీవ్రతను చూసి కూడా స్పందించకపోతే అభిమానుల ఆదరణ తగ్గుతుందేమో.. ఫాలోవర్లను కోల్పోవాల్సి వస్తుందేమోననే ఆందోళన కూడా ప్రముఖులను స్పందించేలా చేస్తోందనేది మరో వర్గం అభిప్రాయం. దేశవ్యాప్తంగా ఏదైనా ఒక అంశం జాతీయ చర్చగా మారినప్పుడు, దానిపై తమ స్వరాన్ని వినిపించడం ద్వారా సామాజిక స్పృహ ఉన్న వ్యక్తులుగా గుర్తింపు పొందడం కూడా సాధారణమైంది.
సెలబ్రిటీలు ఏ ఉద్దేశంతో స్పందించినప్పటికీ వారి మద్దతు వల్ల విద్యార్థుల ఉద్యమానికి జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు లభిస్తోంది. నీట్ వ్యవహారంలో పారదర్శకత తేలాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్న సీజేపీ, విద్యార్థుల ఆందోళనలపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది? మున్ముందు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది? అనేదానిపై రానున్న రోజుల్లో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
