'కాక్రోచ్' ల మరో డెడ్‌లైన్.. ఏం జరిగింది?
నీట్ ప్రశ్న పత్రం లీకేజీ వ్యవహారంలో కేంద్ర మంత్రి రాజీనామా కోసం పట్టుబట్టి సాధించిన కాక్రోచ్ జనతా పార్టీ .. తాజాగా మరో డెడ్‌లైన్ విధించింది.
By: Garuda Media | 27 July 2026 6:10 PM ISTనీట్ ప్రశ్న పత్రం లీకేజీ వ్యవహారంలో కేంద్ర మంత్రి రాజీనామా కోసం పట్టుబట్టి సాధించిన కాక్రోచ్ జనతా పార్టీ .. తాజాగా మరో డెడ్‌లైన్ విధించింది. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమం జరిగిన సమయంలో తమకు ఇచ్చిన హామీలను ఇప్పటికీ నెరవేర్చలేదని పేర్కొన్నారు. ఇది సమంజసం కాదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తరఫున తమ వద్దకు వచ్చిన జితేంద్ర సింగ్, జేపీ నడ్డాలు తమకు ఇచ్చిన హామీలపై ఇప్పటి వరకు స్పందించలేదని ఆరోపించారు. సదరు హామీలను కూడా తక్షణమే అమలు చేయాలని పట్టుబట్టారు.
ఈ మేరకు కాక్రోచ్ జనతా పార్టీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్.. మీడియాతో మాట్లాడారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా సహా ఇతర డిమాండ్లపై పట్టుబడుతూ.. దేశవ్యాప్తంగా విద్యార్థులు ఉద్యమించారని.. అయితే, ఆ సమయంలో విద్యార్థులపై పలు రాష్ట్రాల్లో పోలీసులు నమోదు చేశారని తెలిపారు. తమతో జరిపిన చర్చల సమయంలో నిరసన విరమిస్తే.. కేసులు ఎత్తేస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందనిగుర్తు చేశారు. కానీ, నిరసన విరమించి 48 గంటలు గడిచినా.. ఇప్పటి వరకు కేసులు ఎత్తేయలేదని పేర్కొన్నారు. పైగా.. కొన్ని రాష్ట్రాల్లో జాతీయ చట్టాల కింద కేసులు నమోదు చేశారని తెలిపారు.
ఆయా కేసులను తక్షణమే ఎత్తివేయాలని సౌరవ్ డిమాండ్ చేశారు. దీనికిగాను మంగళవారం వరకు గడువు ఇస్తున్నట్టు తెలిపారు. అప్పటికీ కూడా కేసులు ఎత్తేయకపోతే.. తమ తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. అన్ని రాష్ట్రాల్లోనూ కేసులు నమోదు చేసారన్న ఆయన.. తమకు ఇచ్చిన హామీ మేరకు కేసులు ఎత్తేయాలని డిమాండ్ చేశారు. మరీ ముఖ్యంగా బీజేపీ పాలిత అస్సాం, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్. బీహార్‌లో నిరసన కారులపై జాతీయ చట్టాల కింద, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇటీవల చేసిన కొత్త చట్టాల కింద కేసులు నమోదు చేశారని.. వాటిని కూడా తక్షణమే ఎత్తేయాలన్నారు.
ఎందుకు నిర్బంధించారు?
ఇక, పశ్చిమ బెంగాల్‌లో 150 మంది విద్యార్థులపై రాష్ట్ర సర్కారు చేసిన నూతన చట్టం కింద నిర్బంధించారని సౌరవ్ తెలిపారు. వీరిని తక్షణమే విడుదల చేయాలన్నారు. ఈ విషయంలో తమకు హామీ ఇచ్చి, చర్చలకు వచ్చిన కేంద్ర మంత్రులు జితేంద్ర సింగ్, జేపీ నడ్డాలు తక్షణమే స్పందించాలని.. లేక పోతే తమ కార్యాచరణ ప్రకటించాల్సి ఉంటుందని సౌరవ్ పేర్కొనడం గమనా ర్హం. మరోవైపు.. రాజకీయ పార్టీలు కూడా విద్యార్థులపై నమోదు చేసిన కేసులను తక్షణమే ఎత్తేయాలని డిమాండ్ చేశాయి.
