పార్లమెంట్ లో నీట్ గా వాయిదాల పర్వం
పార్లమెంట్ ఆగస్టు 13 దాకా కొనసాగుతుంది. ఇందులో శని ఆదివారాలు ఇతర సెలవులు పోతే పని దినాలు తక్కువగానే ఉన్నాయి.
By: Satya P | 23 July 2026 11:56 PM ISTపార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నీట్ కి సమర్పితం అయ్యేట్టుగా ఉన్నాయి. గతంలో 2022 ప్రాంతంలో సాగు నీటి చట్టాల విషయంలో పార్లమెంట్ రెండు సెషన్లు సవ్యంగా నడవలేదు. అలా వాయిదాల పడుతూనే ముగిసాయి. మళ్ళీ అలాంటి పరిస్థితి ఇపుడు ఏర్పడిందా అన్నది అయితే సంశయం కలుగుతోంది. ఈ నెల 20న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు స్టార్ట్ అయ్యాయి. సమావేశాలు మొదలు అయ్యాయి అన్న పేరు కానీ ఒక్క రోజు కూడా బిజినెస్ సాగింది లేదు. విపక్షాలు సభలో నిరసనలు వ్యక్తం చేయడంతో ఉభయ సభలు పలు మార్లు వాయిదా పడి చివరికి మరుసటి రోజుకు వాయిదాతో ముగుస్తోంది. శుక్రవారంతో పార్లమెంట్ తొలివారం ఎండ్ అవుతోంది. చూస్తే సమావేశాలను నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారమే కీలకంగా మారి వాయిదాల పర్వానికి కారణం అవుతోంది.
ప్రతిపక్షాల ఆందోళన :
ఇక చూస్తే కనుక నీట్ పేపర్ లీక్ వ్యవహారం అలాగే విద్యార్థుల నిరసనలతో సహా పలు అంశాలపై గురువారం కూడా ప్రతిపక్షాలు ఉభయ సభలలో నిరసనలు చేపట్టాయి. దాంతో విపక్షాల ఆందోళనల కారణంగా పార్లమెంటు ఉభయ సభలు వాయిదా పడ్డాయి. ఉదయం పదకొండు సమావేశమైనప్పుడు వాయిదా పడితే మధ్యాహ్నం రెండు గంటలకు రెండోసారి వాయిదా పడిన తర్వాత లోక్‌సభ తిరిగి సమావేశమైనప్పుడు కూడా ప్రతిపక్ష సభ్యులు మళ్లీ నినాదాలు చేయడంతో పాటు గందరగోళం కొనసాగడంతో శుక్రవారానికి వాయిదా వేసేశారు. ఈ వాయిదాల పర్వంలో ప్రశ్నోత్తరాల సమయం కూడా లేకుండా పోతోంది. ఇక్కడ కూడా ప్రతిపక్ష సభ్యులు పేపర్ లీక్ అంశాలనే ప్రస్తావించాయి. నీట్ అంశంపై చర్చకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం ఇప్పటికే ప్రతిపక్ష సభ్యులకు హామీ ఇచ్చిందని ప్రభుతం ఒక వైపు చెబుతోంది. అయితే విపక్షం మాత్రం నిరసనలు కొనసాగిస్తోంది. ఇదే పరిస్థితి రాజ్యసభలోనూ ఉంది.
చర్చ కాదు నిరసన :
దీని మీద ఎన్డీయే ప్రభుత్వం అయితే మండిపడుతోంది. కాంగ్రెస్ పార్టీ కేవలం నీట్ అంశంపై నిరసన మాత్రమే చేస్తోందని చర్చ జరగాలని కోరుకోవడం లేదని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు విమర్శించారు. మరో కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ప్రతిపక్షాల తీరును తీవ్ర బాధ్యతారాహిత్యమని విమర్శించారు. ప్రతిపక్షాలు చర్చను కోరుకోవడం లేదని సభ సజావుగా సాగడానికి కూడా సహకరించడం లేదని ఆయన ఆరోపించారు. మొదట కాంగ్రెస్ నీట్ అంశంపై చర్చను డిమాండ్ చేసిందని నీట్ పేపర్ లీక్‌తో సహా అన్ని అంశాలపై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పందించిందని ఆయన చెప్పారు. అయితే ఇప్పుడు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర రాజీనామా చేయాలనే కొత్త షరతును కాంగ్రెస్ పెట్టిందని నడ్డా మండిపడ్డారు.
ఇదే తీరు కొనసాగుతుందా :
పార్లమెంట్ ఆగస్టు 13 దాకా కొనసాగుతుంది. ఇందులో శని ఆదివారాలు ఇతర సెలవులు పోతే పని దినాలు తక్కువగానే ఉన్నాయి. మొదటి వారం అంతా నీట్ నిరసనతోనే సరిపోయింది అని అంటున్నారు. మిగిలిన రెండు వారాలలో అయినా అర్ధవంతమైన చర్చ సాగుతుందా లేదా అన్నది అంతా చూస్తున్నారు. ఇదిలా ఉంటే నీట్ సహా ఇతర సమస్యల మీద చర్చిస్తామని ప్రభుత్వం అంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అని విపక్షం అంటోంది. దీంతో పీటముడి బిగుస్తోంది.
