అర్ధరాత్రి నటన వద్దు: మోడీకి నేతల చురకలు!
నీట్ పేపర్ లీక్, అనంతరం జరిగిన పరిణామాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గురువారం అర్ధరాత్రి వీడియో సందేశం విడుదల చేసిన విషయం తెలిసిందే.
By: Garuda Media | 24 July 2026 2:39 PM ISTనీట్ పేపర్ లీక్, అనంతరం జరిగిన పరిణామాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గురువారం అర్ధరాత్రి వీడియో సందేశం విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ వ్యవహారంపై ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ సహా.. ఇతర పార్టీలు కూడా భిన్నమైన వాదనలు వినిపించాయి. ముఖ్యంగా కాంగ్రెస్ రాజ్యసభా పక్ష నేత మల్లికార్జున ఖర్గే.. ప్రధానికి చురకలు అంటించారు. అర్ధరాత్రి నటనలు వద్దని వ్యాఖ్యానించారు. అసలు సెల్ఫీ వీడియోలు విడుదల చేయడానికి ఆయనేమీ సెలబ్రిటీ కాదని.. ఈ దేశానికి ప్రధాని అని తెలిపారు.
బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న నరేంద్ర మోడీ సెల్ఫీ వీడియోలతో సమస్యను పరిష్కరించాలని అనుకుంటే పొరపాటేనని వ్యాఖ్యానించారు. ఆయనేమైనా చెప్పాలని అనుకుంటే.. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటుకే రావాలని ఖర్గే తెలిపారు. పార్లమెంటుకు వచ్చి.. ఆయన ఉభయ సభల్లోనూ తాను చెప్పాలని అనుకున్న విషయా న్ని చెప్పాలని.. అప్పుడు తామే దానికి సాక్ష్యంగా ఉంటామని తెలిపారు. అంతేకానీ.. నటనలతోనో.. సెల్ఫీ వీడియోలతోనో విద్యార్థులను, వారి తల్లుదండ్రులను మభ్యపెట్టలేరని ఖర్గే వ్యాఖ్యానించారు.
ఇక, ఇతర పార్టీలకు చెందిన నాయకులు కూడా ఇదే వ్యాఖ్యలు చేయడం గమనార్హం. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ మాట్లాడుతూ.. ప్రధాన మంత్రి విదేశాల్లో లేరని.. స్వదేశంలో అందునా.. పార్లమెంటుకు ఫర్లాంగు దూరంలోనే ఉన్నారని.. కాబట్టి ఆయన పార్లమెంటులోనే తన వాదనను వినిపించాలని సూచించారు. పార్లమెంటు కు భయపడుతున్నారా? అని మోడీని ప్రశ్నించారు. పార్లమెంటు కు భయపడడం వల్లే సెల్ఫీ వీడియోలను విడుదల చేసి ఉంటారని అనుకోవాలా? అని వ్యంగ్యాస్త్రం సంధించారు.
ఇక, సమాజ్ వాదీ పార్టీ నేతలు కూడా ఇవే వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ప్రధానికి ఈ దేశ ప్రజలు మూడోసారి అధికారం ఇవ్వలేదన్న ఎంపీలు.. ఆయన కుర్చీని తెచ్చుకున్నారని వ్యాఖ్యానించారు. అయినప్పటికీ.. తమకు గౌరవం ఉందని..ఆయనకే ప్రజలంటే గౌరవం లేదని అన్నారు. సెల్ఫీ వీడియోలతో సమస్యలు పరిష్కారం కాబోవన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. రోజుకు నాలుగు సార్లు మీడియాతో మాట్లాడతారని.. ఆయన తనకు మిత్రుడని చెప్పుకొనే ప్రధాని.. మీడియాముందుకు వచ్చేందుకు కూడా భయపడుతున్నారని ఎద్దేవా చేశారు.
