ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో రచ్చకు ముగింపు.. కానీ, అలా జరగదు ఎందుకంటే?
12 ఏళ్ల ఎన్డీఏ పాలనలో ఎన్నడూ లేనట్లు నీట్ పేపర్ లీక్ వివాదం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది.
By: Tupaki Political Desk | 22 July 2026 4:20 PM ISTనీట్-యూజీ పేపర్ లీక్ వివాదం జాతీయస్థాయిలో తీవ్ర రచ్చకు దారితీస్తోంది. పేపర్ లీక్ తర్వాత ఈ విషయమై ఆందోళనలు చేస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తల నుంచి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వరకు అంతా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేస్తున్నారు. దాదాపు మూడు నెలలుగా నిరసనకారులు కేంద్ర మంత్రి రాజీనామాకు పట్టుబడుతున్నా కేంద్రం మాత్రం ఇంతవరకు కనీసం పట్టించుకోవడం లేదనే అంటున్నారు. ఇక గత రెండు రోజులుగా చోటుచేసుకున్న పరిణామాలతో పేపర్ లీక్ ఉదంతంపై చర్చకు కేంద్రం అంగీకరించినా, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశాన్ని మాత్రం నిర్ధాక్షిణ్యంగా తోసిపుచ్చుతోంది. దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా ప్రధాని మోదీ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను వెనకేసుకు రావడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.
12 ఏళ్ల ఎన్డీఏ పాలనలో ఎన్నడూ లేనట్లు నీట్ పేపర్ లీక్ వివాదం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. గతంలో కూడా జాతీయస్థాయిలో అనేక వివాదాలు చెలరేగినా, అవన్నీ టీ కప్పులో తుఫాన్ లా చప్పున చల్లారిపోయేవి. కానీ ఈ సారి ఉద్యమంలో యువత స్వచ్ఛందంగా భాగస్వామ్యం కావడమే రచ్చకు దారితీస్తోందని అంటున్నారు. అదే సమయంలో నీట్ ప్రశ్నపత్రాల లీక్ నే అజెండాగా పుట్టుకొచ్చిన కాక్రోచ్ పార్టీ తొలి నుంచి మంత్రి ధర్మంద్ర ప్రధాన్ బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తోంది. ఇక సోమవారం నిర్వహించిన పార్లమెంటు మార్చ్ లో తమ నిరసన స్వరం మరింత గట్టిగా వినిపించడంతోపాటు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా ఈ వివాదంపై సీరియస్ గా ఫోకస్ చేయడంతో పరిస్థితులు మరింత జటిలమయ్యేలా కనిపిస్తున్నాయని అంటున్నారు. అయితే పరిస్థితి ఎంతలా మారినా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను రక్షించుకోవాలనే ఏకైక నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉండటంతో వివాదం రాజకీయంగా ముదురుతోందని అంటున్నారు.
విద్యార్థులు, ప్రతిపక్ష నేతలు ముక్త కంఠంతో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను కోరుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆ ఒక్కటి తప్ప, అన్నట్లే వ్యవహరిస్తోందని అంటున్నారు. మూడు నెలల తర్వాత ఈ వివాదంపై కేంద్ర ప్రభుత్వం మాట్లాడటం మొదలు పెట్టగా, విపక్షం ఒత్తిడితో పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో చర్చకు సైతం అంగీకరించిందని చెబుతున్నారు. కానీ, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలో మాత్రం విపక్షాల ఒత్తిడికి తలొగ్గకూడదని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారని అంటున్నారు. ఇందుకు రాజకీయ, వ్యవస్థాపరమైన కారణాలు ఉన్నాయని అంటున్నారు.
విపక్షాలు, నిరసనకారుల ఒత్తిడి మేరకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో రాజీనామా చేయిస్తే, అది ఆత్మాహత్యాసదృశ్యమే అవుతుందని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారని అంటున్నారు. ప్రధానంగా ఒకరి రాజీనామాతో విఫలమైన వ్యవస్థలకు మంత్రులే బాధ్యులనే సంప్రదాయానికి తెరతీసినట్లు అవుతుందని భావిస్తున్నారని అంటున్నారు. ఇది భవిష్యత్తులో ఇతర సీనియర్ మంత్రులపై ఒత్తిడి పెంచడమే కాకుండా, విపక్షాలకు ఒక అస్త్రం అవుతుందనే ఆందోళన కేంద్ర పెద్దల్లో ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. అదే సమయంలో మంత్రి తప్పుకుంటే అది ప్రభుత్వానికి బలహీనతగా మారుతుందని అంటున్నారు. అందుకే మంత్రి రాజీనామా కన్నా వ్యవస్థాగత ప్రక్షాళన ద్వారా పరిస్థితిని చక్కదిద్దాలని అభిప్రాయపడుతున్నారని అంటున్నారు.
మరోవైపు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమర్థత కూడా పార్టీని ప్రభుత్వ పెద్దలను కట్టిపడేస్తుందని అంటున్నారు. ఒడిశాకు చెందిన ధర్మేంద్ర ప్రధాన్ కు ఆర్ఎస్ఎస్ తో విస్తృత అనుబంధం ఉందని చెబుతున్నారు. అంతేకాకుండా ఒడిశాలో దాదాపు రెండున్నర దశాబ్దాల పాటు పాలించిన బిజూ జనతాదళ్ ను ఓడించేలా ధర్మేంద్ర ప్రధాన్ చాలా కృషి చేశారని గుర్తింపు దక్కించుకున్నారు. మొట్టమొదటిసారిగా ఒడిశాలో బీజేపీని అధికారంలోకి తేవడంలో ధర్మేంద్ర ప్రధాన్ వ్యూహాలు అత్యంత కీలకంగా చెబుతున్నారు. దీంతో ఆయనను మంత్రివర్గం నుంచి తప్పిస్తే సమర్థులైన నేతలను రక్షించలేని స్థితిలో ప్రభుత్వం ఉందనే అపవాదును మూటగట్టుకునే ప్రమాదం ఉందని కేంద్రం భయపడుతున్నట్లు చెబుతున్నారు. అదేసమయంలో జాతీయ విద్యావిధానం-2020 ద్వారా వ్యవస్థను పటిష్టం చేసిన మంత్రిని రాజకీయాల కోసం బలిచేయకూడదనే అభిప్రాయం కూడా ఆయనకు శ్రీరామ రక్షగా మారిందని అంటున్నారు.
