Begin typing your search above and press return to search.

నీట్ పరీక్ష ముగిసింది...రాజకీయ ప్రకంపనలు సంగతి ?

దేశంలో అనేక పరీక్షలు జరుగుతూ ఉంటాయి. వాటిని రొటీన్ గానే నిర్వహిస్తూంటారు.

By:  Satya P   |   22 Jun 2026 9:51 AM IST
నీట్ పరీక్ష ముగిసింది...రాజకీయ ప్రకంపనలు సంగతి ?
X

దేశంలో అనేక పరీక్షలు జరుగుతూ ఉంటాయి. వాటిని రొటీన్ గానే నిర్వహిస్తూంటారు. అయితే అన్ని పరీక్షలు ఒకేలా ఉండవని నీట్ పరీక్ష చాటి చెప్పింది. నీట్ పరీక్ష అధికారంలో ఉన్న వారికి ఒక అనుభవాన్ని మిగిల్చింది. కేంద్రంలో ముఖ్యంగా విద్యా శాఖ మీద వచ్చిన విమర్శలు అన్నీ ఇన్నీ కావు. విపక్షం మొత్తం ఒక్కటే కేంద్రాన్ని నిలదీసింది. విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేసింది. నీట్ పరీక్షా పత్రం లీక్ పుణ్యమాని కాక్రోచ్ పార్టీ పేరుతో కొత్త పార్టీ పుట్టుకొచ్చింది. యూత్ లో అసహనం ఏంటో బయటపడింది. మొత్తానికి ఇంతలా రాజకీయ అంశంగా మారి కేంద్ర పెద్దలను తెగ టెన్షన్ పెట్టిన నీట్ సజావుగానే ముగిసింది.

కట్టుదిట్టమైన భద్రత :

అండర్ గ్రాడ్యుయేట్ వైద్య కోర్సుల్లో ప్రవేశం కోసం ఉద్దేశించిన నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్ నీట్ -2026 రీ ఎగ్జామినేషన్ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య జరిగింది. దేశవ్యాప్తంగా 5,440 కేంద్రాలు విదేశాలలో 14 కేంద్రాలలో జరిగిన ఈ రీ ఎగ్జామినేషన్ కి ఏకంగా ఇరవై లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. హిందీఆంగ్లంతో సహా మొత్తం 13 ప్రాంతీయ భాషలలో ఈ పరీక్ష నిర్వహించారు. కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, తపాలా శాఖ, భారత వైమానిక దళం హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ వంటి సంస్థల సహకారంతో ఈ పరీక్ష నిర్వహించడం విశేషం.

భారీ ఎత్తున సిబ్బంది :

ఇక నీట్ పరీక్షను నిర్వహించడానికి దేశవ్యాప్తంగా పోలీసులు, పరిశీలకులు పరీక్షా సిబ్బందితో సహా సుమారు ఏడు లక్షల మంది అధికారులను వినియోగించారు అంటే ఒక రికార్డు అన్న మాట. మరో వైపు చూస్తే నీట్ పేపర్ లీక్ అయిన 37 రోజుల్లోనే ఈ ప్రక్రియ పూర్తయిందని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చెప్పుకొచ్చింది. అయితే నీట్ పెట్టిన వ్యధలు, కన్నీటి కధలు చాలానే ఉన్నాయని చెప్పాలి. నీట్ పరీక్ష పేపర్ లీక్ తో చాలా మంది నిరాశ నీడలో పడిపోయారు. దాంతో ఆత్మహత్యల పర్వం కొనసాగింది. పరీక్ష జూన్ 21 న ఉంటే ఆ రోజు దాకా అభ్యర్ధులు ఆత్మ హత్యలు చేసుకుంటూనే ఉన్నారు. ఇది విపక్షాలకు ఆయుధంగా మారగా ప్రభుత్వం మాత్రం డిఫెన్స్ లో పడిపోయే పరిస్థితి ఏర్పడింది.

మోడీనే వేచి ఉండేలా :

ఇవన్నీ ఒక ఎత్తు అయితే నీట్ పరీక్ష ఉందని ట్రాఫిక్ కారణంగా విద్యార్ధులు ఇబ్బంది పడుతారని కోల్ కత్తా నుంచి ఢిల్లీ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీ ఎయిర్ పోర్టులో కొంత సేపు వేచి ఉన్న పరిస్థితి కూడా కనిపించింది. మధ్యాహ్నం 2 గంటలకు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష ప్రారంభం కానుండటంతో తన కాన్వాయ్ కారణంగా రోడ్లపై ట్రాఫిక్ జామ్ అయి విద్యార్థులు ఇబ్బంది పడతారని ప్రధాని భావించారు అంటే నీట్ పట్ల కేంద్రం ఎంత అప్రమత్తంగా ఉందో చెప్పాల్సిందే. అలా నీట్ పరీక్ష ప్రారంభమైన తర్వాత అంటే మధ్యాహ్నం రెండు గంటల తర్వాతే మోడీ తన నివాసానికి బయలుదేరారు.

ఫలితాల మీదనే ఫోకస్ :

నీట్ పరీక్ష ముగిసింది. ఇక ఫలితాల మీదనే అందరి చూపు ఉంది. అయితే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారిక ప్రాథమిక ఆన్సర్ కీని జూన్ 28 నాటికి విడుదల చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. దీనిపై అభ్యంతరాలను స్వీకరించిన తర్వాత తుది కీని ఆ మీదట ఫలితాలను ప్రకటిస్తారు. నీట్ యూజీ 2026 ఫలితాలను జూలై చివరి నాటికి వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే నీట్ పరీక్ష ముగిసింది, రాజకీయ ప్రకంపనలు సంగతి ఏంటి అన్నది అయితే చర్చగా ఉంది. కాక్రోచ్ పార్టీ తరువాత స్టెప్ మీదనే అందరి చూపు ఉంది.