Begin typing your search above and press return to search.

ధర్మేంద్ర ప్రధాన్ మంత్రి పదవి కి ఆక్సిజన్ అక్కడ నుంచే ?

కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సీజేపీ ఆందోళన చేపట్టింది. అది కాస్తా విపక్షాల డిమాండ్ గా మారింది.

By:  Satya P   |   24 July 2026 9:05 AM IST
ధర్మేంద్ర ప్రధాన్ మంత్రి పదవి కి ఆక్సిజన్ అక్కడ నుంచే ?
X

కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సీజేపీ ఆందోళన చేపట్టింది. అది కాస్తా విపక్షాల డిమాండ్ గా మారింది. ఇక రెండు నెలలుగా ఇదే విషయం మీద సీజేపీ వివిధ రకాలైన ఆందోళన చేస్తూంటే ప్రతిపక్షాలు కూడా తోడు అయ్యాయి. దాంతో పార్లమెంట్ వర్షాకాల సమావేశాల వేళ ఢిల్లీలో రాజకీయ మంట రాజుకుంది. పార్లమెంట్ లోపలా బయటా ఇదే ఇష్యూ కీలకంగా మారింది. నీట్ పేపర్ లీక్ మీద చర్చ కాదు ముందు మంత్రిని రాజీనామా చేయించండి అని కాంగ్రెస్ సహా విపక్షాలు డిమాండ్ చేయడం బయట సీజేపీ నడుపుతున్న ఉద్యమం అదే డిమాండుతో ఉండడంతో ఎన్డీయే ప్రభుత్వానికి కూడా పట్టుదలను పెంచుతోంది.

తగ్గకూడదనే :

విషయం కాస్తా రాజకీయంగా గట్టిగా బిగదీసుకుని కూర్చోవడంతో ఎవరికి వారు తగ్గేది లేదు అన్న దృఢ వైఖరిని ప్రదర్శిస్తున్నారు. దాంతో తెగే దాకా లాగే ప్రయత్నమే సాగుతోంది తప్ప పరిష్కారం అయితే కనిపించడం లేదు. ఒకానొక దశలో ప్రభుత్వం మెత్తబడినట్లుగా కనిపించినా విపక్షాల దూకుడుతో రాజకీయంగా పైచేయి సాధించాలన్న వారి వైఖరితో తానూ వెనకబడకూడదు అన్నట్లుగానే గట్టిగా నిలబడుతోంది. మొత్తం మీద చూస్తే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయం చూస్తే విపక్షాల పట్టుదల విద్యార్థుల పేరుతో సీజేపీ చేస్తున్న జంతర్ మంతర్ రగడ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పెద్దల ఆలోచనలను మార్చేశాయని అంటున్నారు.

ఆయన పదవి సేఫ్ :

ఈ పరిస్థితుల్లో తమ మీద పోరాటం పేరుతో సాధించాలని చూస్తే అసలు సహించేది లేదన్నట్లుగా పాలకుల తీరు ఉన్నట్లుగా కనిపిస్తోంది అంటున్నారు. ఈ క్రమంలో ధర్మేంద్ర ప్రధాన్ పదవి మరింతగా సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోతోంది అని అంటున్నారు. మంత్రి వర్గ విస్తరణను పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తరువాత చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది అని ప్రచారం సాగుతోంది. అయితే ఇపుడు చూస్తే కేంద్ర పెద్దలు కూడా తమ ఆలోచనలు మార్చుకుని కఠినంగానే ఉండాలని భావిస్తున్నారా అన్న చర్చ సాగుతోంది. అదే కనుక జరిగితే విద్యా శాఖను మారుస్తారు కానీ ధర్మేంద్ర ప్రధాన్ కి మరో కీలక శాఖ ఇచ్చి మోడీ మంత్రి వర్గంలో కొనసాగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు.

సవాల్ గా మారడంతో :

విపక్షాల డిమాండ్ల వెనక రాజకీయ అజెండాలు ఉన్నాయని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు అని అంటున్నారు. వ్యవస్థలలో ప్రక్షాళన అవసరమా లేక మంత్రుల రాజీనామాలు అవసరమా అన్న ప్రశ్నను కూడా ఆ వైపు నుంచి సంధిస్తున్నారు. ఇంత పెద్ద దేశంలో ఎక్కడో ఒక చోట పొరపాట్లు జరిగితే ప్రతీ దానికీ రాజీనామాలు అంటూ పోతే ఇక ఎక్కడికి అంతం ఉంటుందన్నది కూడా ప్రభుత్వం తరఫున వాదించేవారు చర్చకు పెడుతున్నారు. పైగా మొండిగా ఆందోళనలు నిర్వహించడంతో పాటు డిమాండ్లను ఎప్పటికప్పుడు మార్చుకోవడం తో ఎలాగైనా పార్లమెంట్ ని అడ్డుకోవాలన్న రాజకీయ వ్యూహాలు ఉన్నాయని అంటున్నారు. దాంతో ప్రభుత్వం వైపు నుంచి కూడా బిర్ర బిగుసుకుని కూర్చునే పరిస్థితి వస్తే ఇక డెడ్ లాక్ పడిపోక తప్పదని అంటున్నారు. ఏది ఏమైనా ధర్మేంద్ర ప్రధాన్ పదవికి ఆక్సిజన్ ఎక్కడ నుంచి అంటే విపక్షం నుంచే అని సెటైరికల్ గా జవాబు వస్తోందిట.