ముందు 'గెస్ పేపర్'.. తర్వాత 'లీక్ పేపర్'.. నీట్ 2026 చుట్టూ ముదురుతున్న వివాదం
నీట్ (యూజీ)2026 పేపర్ లీకేజీపై జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ ఎన్టీఏపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
By: Tupaki Political Desk | 13 May 2026 2:57 PM ISTనీట్ (యూజీ)2026 పేపర్ లీకేజీపై జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ ఎన్టీఏపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని నెవర్ ట్రస్టబుల్ ఏజెన్సీ అంటూ నెటిజన్లు ధ్వజమెత్తుతున్నారు. వరుస వైఫల్యాలతో పరీక్షల విశ్వసనీయతనే ప్రశ్నర్థకం చేస్తున్నారని నీట్ రద్దుపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పరీక్ష ప్రశ్నపత్రం లీక్ కు కారణమైన 15 మందిని సీబీఐ అదుపులోకి తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో కేసు నమోదు చేసిన సీబీఐ వివిధ రాష్ట్రాల్లో ప్రత్యేక దర్యాప్తు బృందాలతో తనిఖీలు నిర్వహిస్తోంది. ఇక లీకేజికి కేంద్ర బిందువుగా భావిస్తున్న రాజస్థాన్ లో కూడా పోలీసులు ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తున్నారు. స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ ఏర్పాటు చేసి పేపర్ ఎలా లీకైందో సోదిస్తున్నారు.
ఎలా లీకైంది?
నీట్ ప్రశ్నపత్రం ఎలా లీకైందన్నదే అంతుచిక్కడం లేదని అంటున్నారు. ప్రశ్నపత్రాలను మహారాష్ట్రలోని నాసిక్ లో ప్రింట్ చేస్తారని, అక్కడి నుంచే లీక్ అయివుంటుందని అనుమానిస్తున్నారు. అయితే ఈ ప్రచారాన్ని ఎన్టీఏ ఖండిస్తోంది. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం నీట్ ప్రశ్నపత్రం ముందుగా నాసిక్ లోనే బయటపడినట్లు చెబుతున్నారు. నాసిక్ నుంచి బయటకొచ్చిన పేపర్ హరియాణాలోని గురుగ్రాంకి చెందిన ఓ డాక్టర్ వద్దకు చేరిందని పోలీసులు గుర్తించారు. ఆ డాక్టర్ రాజస్థాన్ లో ఉన్న జూపూర్ లో ఒకరికి విక్రయించారని, ఆ వ్యక్తం అదే రాస్ట్రంలోని ప్రముఖ కోచింగ్ సెంటర్లకు నెలవైన సికార్ లో ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ ఏజెంటుగా పనిచేస్తున్న రాకేశ్ కుమార్ వద్దకు చేర్చారని చెబుతున్నారు. ఇక్కడి నుంచే గెస్ పేపర్ పేరిట విక్రయాలకు బహిరంగ మార్కెట్లో పెట్టారని అంటున్నారు.
నెల రోజుల నుంచే గెస్ పేపర్
పేపర్ లీకేజీ వ్యవహారానికి ముందు నిందితులు పకడ్బందీ ప్లాన్ తో పావులు కదిపినట్లు కనిపిస్తోందని అంటున్నారు. పరీక్ష జరగడానికి నెల రోజుల ముందే గెస్ పేపర్ అంటూ విద్యార్థులను టచ్ లోకి తీసుకున్నారని, 40 ప్రశ్నలతో ఒక పేపర్ ముందుగా వదిలారని రాజస్థాన్ ఏడీజీపీ విశాల్ బన్సల్ వెల్లడించారు. 410 ప్రశ్నల ఉన్న గెస్ పేపర్లో నీట్ కెమిస్ట్రి పరీక్షకు చెందిన నాలుగు సెట్లలోని 120 ప్రశ్నలు యథాతథంగా ఉన్నట్లు గుర్తించారు. ఈ గెస్ పేపర్ ఎలా బయటపడింది అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే సికార్ లో కౌన్సిలింగ్ ఏజెంట్ రాకేశ్ కమార్ బాగోతం బయటపడింది. అక్కడి నుంచి తీగ లాగితే మొత్తం 15 మంది పేర్లు బయటకు వచ్చాయని, వీరందరినీ అరెస్టుచేసినట్లు పోలీసులు చెబుతున్నారు.
విద్యార్థి తండ్రి ఇచ్చిన సమాచారం
నీట్ పేపర్ లీకు ఉదంతం బయటపడటానికి ఓ విద్యార్థి తండ్రి ఇచ్చిన సమాచారమే కీలకంగా మారడం గమనార్హం. కేరళకు చెందిన ఆ విద్యార్థి తండ్రి రాజస్థాన్ లో ఉంటూ సికార్ లో హాస్టల్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సికార్ కు చెందిన ఏజెంట్ రాకేశ్ కుమార్ నుంచి కేరళ విద్యార్థి రూ.30 వేలకు నీట్ ప్రశ్నపత్రం కొనుగోలుచేశాడని, ఈ సమాచారం ఆ విద్యార్థి తన తండ్రికి తెలియచేయగా, ఆయన హాస్టల్ లోని ఉన్న విద్యార్థులకు అందజేశాడు. మే 3న పరీక్ష జరిగిన తర్వాత గెస్ పేపర్ లోని ఎన్ని ప్రశ్నలు వచ్చాయో పరిశీలిస్తే, బయాలజీలోని మొత్తం 90 ప్రశ్నలు, కెమెస్ట్రిలోని 45 ప్రశ్నలు యథాతథంగా ఉన్నట్లు గుర్తించారు. ఇది గెస్ పేపర్ కాదని, పేపర్ లీకుగా భావించి కేరళ విద్యార్థి తండ్రి వెంటనే సికార్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. తొలుత ఆయన ఫిర్యాదును పోలీసులు లైట్ గా తీసుకోగా, ఆయన ఎన్టీఏ దృష్టికి తీసుకువెళ్లినట్లు చెబుతున్నారు. దీంతో ఎన్టీఏ ఇంటెలిజెన్స్ వర్గాలను రంగంలోకి దింపి పేపర్ లీకును నిర్ధారించుకుందని సమాచారం. దీంతో ఏజెంట్ రాకేశ్ కుమార్ తోపాటు నాసిక్ కు చెందిన శుభం ఖైర్నర్ అనే బీఏఎంఎస్ విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. వీరితో సంబంధం ఉన్న మరో 13 మందిని అరెస్టు చేసినట్లు సీబీఐ అధికారులు ప్రకటించారు.
విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన
నీట్ పరీక్ష రద్దు విద్యార్థులను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తోంది. దేశవ్యాప్తంగా సుమారు 22 లక్షల మంది పరీక్ష రాశారు. ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమయంలో పరీక్ష రద్దు చేస్తున్నట్లు ఎన్టీఏ ప్రకటించి షాక్ ఇచ్చింది. ఎన్టీఏ వైఫల్యంతో తమ రెండేళ్ల కష్టం వృథా అయిందంటూ విద్యార్థులు వాపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా వేల మంది విద్యార్థులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది తెలంగాణలో 71 వేలు, ఏపీలో 58 వేల మంది విద్యార్థులు నీట్ పరీక్షకు హాజరయ్యారు. వీరిలో చాలా మంది లక్షల రూపాయలను వెచ్చించి లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్నారు. పరీక్ష బాగా రాశామని, సీటు ఖాయమని సంబరపడుతున్న సమయంలో వారి ఆనందాన్ని ఆవిరి చేస్తూ ఎన్టీఏ ప్రకటన వెలువడింది.
ఎన్టీఏ సామర్థ్యంపై అనుమానాలు
నీట్ పరీక్ష రద్దు నిర్ణయం విద్యార్థులు, వారి తల్లిదండ్రులను తీవ్ర నిరాశకు గురిచేస్తోందని అంటున్నారు. పరీక్ష ప్రమాణాలపై విశ్వాసం పెంచేందుకే రద్దు నిర్ణయం తీసుకున్నామనే ఎన్టీఏ వాదనను విద్యార్థులు తప్పుపడుతున్నారు. ప్రస్తుత పరిణామంతో యావత్ వ్యవస్థ ప్రభావితమవుతోందని ఆవేదన చెందుతున్నారు. అంతేకాకుండా ఎన్టీఏ పరీక్షల నిర్వహణ సామర్థ్యంపైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నీట్ పరీక్షను ఎన్టీఏ బదులుగా ఢిల్లీ ఎయిమ్స్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. 2018లో ఎన్టీఏ ఏర్పాటు చేయగా, ఇప్పటివరకు 18 పరీక్షలను వాయిదా వేసిందని, నీట్ 2024, యూజీసీ 2024, టీచర్ ఎడ్యుకేషన్ రిలేటడ్ ఎన్ సెట్ 2024 పేపర్లు లీక్ అయ్యాయని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. తరచూ ఎన్టీఏ పేపర్లు లీక్ అవుతున్నా, చర్యలు తీసుకోవడంలో విఫలమవుతోందని, దీంతోనే తాజాగా నీట్ 2026 పరీక్ష పేపర్లు లీకయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
