Begin typing your search above and press return to search.

భారతదేశపు తొలి మహిళా గూఢచారి.. స్వాతంత్ర్య సమరంలో సాహస గాధ!

నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన 'ఆజాద్ హింద్ ఫౌజ్' లో మొదటి మహిళా గూఢచారిగా పనిచేసిన ధీరవనిత ఆమె.

By:  Madhu Reddy   |   11 Jun 2026 1:27 PM IST
భారతదేశపు తొలి మహిళా గూఢచారి.. స్వాతంత్ర్య సమరంలో సాహస గాధ!
X

భారతదేశ స్వాతంత్ర పోరాటంలో అనేక మంది మహానుభావులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడారు.. కానీ, మన చరిత్ర పుస్తకాలు మరిచిపోయిన ఒక అద్భుతమైన వీరనారి కథే నీరా ఆర్య. నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన 'ఆజాద్ హింద్ ఫౌజ్' లో మొదటి మహిళా గూఢచారిగా పనిచేసిన ధీరవనిత ఆమె. దేశం కోసం ఆమె చేసిన త్యాగాలు, పడిన కష్టాలు వింటే ఎవరికైనా ఒళ్ళు గగుర్పొడుస్తుంది. ఆ వివరాలు చూద్దాం..

దేశం కోసం భర్తనే బలి చేసిన ధీరురాలు:

నీరా ఆర్యకు దేశమే ప్రాణం. ఆమె భర్త శ్రీకాంత్ జయరంజన్ దాస్ బ్రిటిష్ ప్రభుత్వంలో సీఐడీ అధికారిగా పనిచేసేవాడు. ఒకరోజు అతను సుభాష్ చంద్ర బోస్ ను హత్య చేయాలని కుట్ర పన్నాడు. ఈ విషయం తెలిసిన నీరా ఆర్య, దేశ నాయకుడి ప్రాణాలను కాపాడేందుకు తన భర్తనే కనికరం లేకుండా హతమార్చింది. భర్త కంటే దేశమే గొప్పదని ఆమె తన చర్యతో నిరూపించింది.

అండమాన్ జైలులో బ్రిటీషర్ల నరకయాతన:

భర్తను చంపిన నేరానికి బ్రిటిష్ ప్రభుత్వం నీరా ఆర్యకు అండమాన్‌లోని ప్రసిద్ధ సెల్యులార్ జైలులో జీవిత ఖైదు విధించింది. అక్కడ బ్రిటీష్ జైలర్లు ఆమెను దారుణంగా హింసించారు. "నేతాజీ ఎక్కడ ఉన్నాడో చెబితే నిన్ను ఇప్పుడే వదిలేస్తాం" అంటూ ఆశ చూపారు. కానీ, ఆమె శత్రువుల ముందు అస్సలు లొంగలేదు. ఇక నోరు విప్పి ఒక్క రహస్యం కూడా బయటపెట్టలేదు.

గుండెల్ని పిండేసే ఆనాటి భయంకర సంఘటన:

ఆమె నోరు విప్పడం లేదని కోపంతో ఊగిపోయిన ఒక జైలర్, అత్యంత అమానుషంగా ప్రవర్తించాడు. ఒక పదునైన ఇనుప పటకారును తీసుకువచ్చి, ఆమె రొమ్మును దారుణంగా కోసి ముక్కలు చేశాడు. ఇక ఆ సమయంలో నరకప్రాయమైన బాధను అనుభవిస్తూ, రక్తం ఓడుతున్నా కూడా ఆమె గట్టిగా "జై హింద్" అని నినదించిందే తప్ప, నేతాజీ గురించిన సమాచారాన్ని శత్రువులకు చిక్కనివ్వలేదు.

స్వతంత్ర భారతంలో దయనీయ స్థితి:

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నీరా ఆర్య జైలు నుండి విడుదలయ్యారు. కానీ, మన దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన ఈ వీరనారికి స్వతంత్ర భారతంలో దక్కాల్సిన కనీస గౌరవం దక్కలేదు. ఇక ఆమె తన చివరి రోజుల్లో మన హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్రాంతంలో ఒక చిన్న పూరి గుడిసెలో నివసించారు. బ్రతుకుదెరువు కోసం పూలు అమ్ముకుంటూ తీవ్రమైన పేదరికంలో గడిపి, 1998లో కన్నుమూశారు.

చరిత్ర మన ఈ 'ఫస్ట్ లేడీ స్పై'ని గుర్తించడంలో విఫలమై ఉండవచ్చు, కానీ భారతీయులుగా మన గుండెల్లో ఆమె త్యాగం ఎప్పటికీ సజీవంగా ఉంటుంది. ఇక తన వ్యక్తిగత జీవితాన్ని, సుఖాలను వదిలేసి దేశ స్వేచ్ఛ కోసం సర్వస్వాన్ని త్యాగం చేసిన నీరా ఆర్య గారి వీరత్వం నేటి తరానికి ఎంతో ఇన్స్పిరేషనల్. ఆ వీరనారి అమరత్వానికి, దేశభక్తికి మనందరం తలవంచి శతకోటి వందనాలు సమర్పించుకుందాం..