Begin typing your search above and press return to search.

మరణం తర్వాత స్పృహ ఉంటుందనే వాదనలను సైన్స్ కొట్టి పారేయ‌లేదు!

మైకేల్ ఎగ్నోర్ వంటి ప్రముఖ పరిశోధకులు ఈ అంశంపై లోతైన అధ్యయనాలు చేస్తూ.. మరణం తర్వాత స్పృహ ఉంటుందనే వాదనలను సైన్స్ పూర్తిగా తిరస్కరించలేకపోతోందని పేర్కొంటున్నారు

By:  Sivaji Kontham   |   7 May 2026 12:00 AM IST
మరణం తర్వాత స్పృహ ఉంటుందనే వాదనలను సైన్స్ కొట్టి పారేయ‌లేదు!
X

## మరణపు అంచుల దాకా వెళ్లి రావడంపై పరిశోధనలు: సైన్స్ వెల్లడించిన సంచలన నిజాలు!

మరణం అనేది జీవశాస్త్రపరంగా ఒక ముగింపు అని మనం భావిస్తాం.. కానీ మరణపు అంచుల దాకా వెళ్లి తిరిగి వచ్చిన వ్య‌క్తులు (నియ‌ర్ డెథ్ ఎక్స్ పీరియెన్సెస్ - NDEs) షేర్ చేసిన కొన్ని అనుభవాలు ఇప్పుడు ఆధునిక వైద్య శాస్త్రానికే సవాలు విసురుతున్నాయి. గతంలో ఇటువంటి అనుభవాలను కేవలం భ్రమలనో లేక అబద్ధాలనో కొట్టిపారేసిన శాస్త్రవేత్తలు ఇప్పుడు తమ ధోరణిని మార్చుకుంటున్నారు. మైకేల్ ఎగ్నోర్ వంటి ప్రముఖ పరిశోధకులు ఈ అంశంపై లోతైన అధ్యయనాలు చేస్తూ.. మరణం తర్వాత స్పృహ ఉంటుందనే వాదనలను సైన్స్ పూర్తిగా తిరస్కరించలేకపోతోందని పేర్కొంటున్నారు.

ఇటీవల బిబిసి (BBC) సైన్స్ ఫోకస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మనస్తత్వవేత్త క్రిస్ ఫ్రెంచ్ ఒక కొత్త సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారు. దీనిని `డిస్టర్బ్డ్ బాడీలీ మల్టీసెన్సరీ ఇంటిగ్రేషన్` అని పిలుస్తున్నారు. దీని ప్రకారం.. ఒక వ్యక్తి మరణానికి అతి సమీపంలో ఉన్నప్పుడు మెదడులో కలిగే తీవ్రమైన మార్పులు.. మ‌నిషి ఇంద్రియాల నుండి వెలువడే సంకేతాల కలయిక వల్ల వింతైన అనుభూతులు కలుగుతాయి. ఇది ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న ఒక తార్కిక వివరణ మాత్రమే తప్ప.. మరణానంతర రహస్యాలకు పూర్తిస్థాయి సమాధానం మాత్రం కాదని పరిశోధకులు అంగీకరిస్తున్నారు.

NDEs కేవలం మెదడులో జరిగే రసాయనిక చర్యలే అయితే.. ఆ అనుభూతి పొందిన వారి జీవితాల్లో వచ్చే మార్పులు అత్యంత విస్మయానికి గురిచేస్తున్నాయి. మరణం దాకా వెళ్లి ప్రాణాలతో బయటపడిన వారిలో నైతిక విలువలు పెరగడం.. జీవితంపై అమితమైన సంతోషం.. ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపడం వంటి లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అప్పటిదాకా భౌతిక సంపద.. డబ్బు వెనుక పరుగులు తీసిన వారు సైతం ఆ తర్వాత నిస్వార్థంగా పరోపకారం చేయడం విశేషం. కేవలం మెదడులోని సంకేతాల వల్ల ఇంతటి లోతైన మానసిక మార్పు సాధ్యమా అనే ప్రశ్న ఇప్పుడు ఉదయిస్తోంది.

చాలా కాలంగా సైన్స్ మనస్సును మెదడులోని ఒక భాగంగానే చూస్తూ వస్తోంది. అయితే ఎన్‌.డి.ఇ అనుభవాలు పొందిన వారు తమ శరీరం నుండి తాము విడివడి పైన ఎక్కడో ఉండి తమ పరిస్థితిని గమనించామని చెబుతుండటం విశేషం. ఇటువంటి అనుభవాలను నిరూపించడానికి సైన్స్ దగ్గర కచ్చితమైన ఆధారాలు లేవు. అలాగని అవి తప్పు అని చెప్పడానికి తగిన ఆధారాలూ లేవు. ఈ అనిశ్చితి వల్లనే మరణానికి సంబంధించిన అనుభవాలపై ఎలాంటి ముందస్తు పక్షపాతం లేకుండా స్వతంత్రంగా పరిశోధనలు జరగాలని ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు కోరుతున్నారు.

చివరికి మా దగ్గర కచ్ఛితమైన సమాధానం లేదు! అని సైన్స్ రచయితలు బహిరంగంగా అంగీకరించడం ఒక గొప్ప మలుపుగా పరిగణించవచ్చు. మరణం తర్వాత ఏం జరుగుతుంది? స్పృహ అనేది మెదడుతో పాటే అంతమైపోతుందా లేక మరో రూపంలో కొనసాగుతుందా? అనే ప్రశ్నలకు సమాధానం ఇప్పట్లో దొరకకపోవచ్చు. కానీ ఈ రహస్యాలను ఛేదించే క్రమంలో సైన్స్ తన భౌతికవాద సరిహద్దులను దాటి... ఆధ్యాత్మిక - అతీంద్రియ వాస్తవాలను అర్థం చేసుకోవడానికి సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది.