Begin typing your search above and press return to search.

బీహార్ లో ఎన్డీయే సీఎం మారుతున్నారా?.. పోస్ట్ డిలీట్ వెనుక..!

ఎన్నికల ఫలితాలు అద్భుతమైన పాజిటివ్ గా ఉండటంతో జేడీ(యూ) ‘ఎక్స్’ వాల్ పై ఓ పోస్ట్ కనిపించింది. బీహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ ని ప్రకటిస్తూ పోస్ట్ చేసింది.

By:  Raja Ch   |   14 Nov 2025 9:15 PM IST
బీహార్  లో ఎన్డీయే సీఎం మారుతున్నారా?.. పోస్ట్  డిలీట్ వెనుక..!
X

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి సూపర్ విక్టరీ దిశగా కదులుతోంది.. అధికారిక ప్రకటనే తరువాయి! ఈ సమయంలో ప్రధానంగా జేడీ(యూ) కేంద్ర కార్యాలయంలో సంబరాలు అంబరాన్నంటాయి. 10వ సారి రికార్డ్ స్థాయిలో అధికారంలోకి రానున్న ఆనందం ఓ పక్క, ఐదో సారి తమ నాయకుడు నితీశ్ సీఎం అవుతారని మరో పక్క జేడీ(యూ) శ్రేణులు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. ఈ సమయంలో ఓ ఆసక్తికరమైన చర్చ తెరపైకి వచ్చింది. దానికీ ఓ బలమైన కారణం ఉంది.

అవును... బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రికార్ద్ స్థాయి విజయం దిశగా ఎన్డీయే కూటమి ముందుకు వెళ్తోంది. 200 సీట్ల మార్కును దాటడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సమయంలో అన్నీ అనుకూలంగా జరిగితే వీలైనంత తొందర్లోనే నితీశ్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారని అంటున్నారు. ఈ సమయంలో బీజేపీ.. మహారాష్ట్ర తరహా వ్యూహాన్ని అనుసరించే అవకాశాలనూ కొట్టి పారేయలేమనే చర్చ తెరపైకి వచ్చింది. ఇది హాట్ టాపిక్ గా మారింది.

ఈ చర్చకు కారణం ఆ పోస్ట్!:

ఎన్నికల ఫలితాలు అద్భుతమైన పాజిటివ్ గా ఉండటంతో జేడీ(యూ) ‘ఎక్స్’ వాల్ పై ఓ పోస్ట్ కనిపించింది. బీహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ ని ప్రకటిస్తూ పోస్ట్ చేసింది. ఇందులో భాగంగా... అపూర్వమైనది.. సాటిలేనిది.. నితీశ్ కుమార్ బీహార్ సీఎంగా ఉన్నారు.. ఉంటారు.. కొనసాగుతారు అంటూ జేడీ(యూ) శుక్రవారం ట్వీట్ చేసింది. అయితే.. కొన్ని నిమిషాల తర్వాత దాన్ని డిలీట్ చేసింది! ఇప్పుడు ఇదే చర్చనీయాంశంగా మారింది!

తెరపైకి మహారాష్ట్ర అనుభవాలు!:

వాస్తవానికి గత ఏడాది మహారాష్ట్ర ఎన్నికల్లో శివసేనకు చెందిన ఏక్ నాథ్ షిండే ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీజేపీ ఎన్నికలకు వెళ్లింది! అయితే ఆ ఎన్నికల్లో కాషాయ పార్టీ ఆధిపత్యాన్ని ప్రదర్శించిన అనంతరం... బీజేపీ తన నాయకులలో ఒకరిని అధికారంలో కూర్చోబెట్టాలని భావించిన పరిస్థితి! ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ఎన్నికయ్యారు!

ఈ నేపథ్యంలోనే బీహార్ లోనూ బీజేపీ ఈ దిశగా ఆలోచిస్తోందా అనే చర్చ తెరపైకి వచ్చింది. అందుకే జేడీ(యూ) పోస్ట్ డిలీట్ అయ్యి ఉండోచ్చనీ అంటున్నారు! పైగా బీహార్ ఎన్నికల్లోనూ బీజేపీ 92 స్థానాల్లో కూటమిలో ఫస్ట్ ప్లేస్ లో ఉండగా.. 82 స్థానాల్లో ఆధిక్యంతో జేడీ(యూ) తర్వాత స్థానంలో ఉంది! ఈ సమీకరణాలన్నీ మహారాష్ట్ర తరహా బీజేపీ వ్యూహం అనే పుకార్లకు ఆజ్యం పోసింది!

సామ్రాట్ చౌదరి నుంచి బలమైన పోటీ!:

మరోవైపు నితీశ్ కి ప్రత్యామ్నాయంగా బీహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి పేరు తెరపైకి వచ్చిందని అంటున్నారు. ఈయన రాష్ట్రంలోని అత్యున్నత పదవికి బలమైన పోటీదారుగా ఉన్నారనే పుకారులు షికారు చేస్తున్నాయి. ఈయన 2023 మార్చి నుంచి 2024 జూలై వరకూ బీజేపీ బీహార్ రాష్ట్ర విభాగానికి అధ్యక్షుడిగా ఉన్నారు.