కాంగ్రెస్ అంటే శశిధరూర్... ఇదే ఎన్డీయే తీరు
కేంద్రంలో మూడో సారి అధికారంలోకి నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం విపక్షాల విషయంలో తనదైన వ్యూహంలో ముందుకు సాగుతోంది.
By: Satya P | 6 Dec 2025 9:14 AM ISTకేంద్రంలో మూడో సారి అధికారంలోకి నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం విపక్షాల విషయంలో తనదైన వ్యూహంలో ముందుకు సాగుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ పట్ల మరింతగా పదునైన చాణక్య రాజకీయాన్ని అమలు చేస్తోంది అని అంటున్నారు. ఇక ఈ ఏణ్ణర్థం కాలంలో మోడీ నాయకత్వంలో బీజేపీ దేశంలో వరసగా అన్ని రాష్ట్రాలని గెలుచుకుని వస్తోంది. దాంతో ధీమా కూడా పెరుగుతోంది. అలాగే కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ నాయకత్వం కూడా జనం మెప్పు పొందలేకపోతోంది అన్న భావనతో కూడా కమలం పార్టీ పెద్దలు ఉన్నట్లు కనిపిస్తోంది. దాంతో రాహుల్ గాంధీ విషయంలో లైట్ తీసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది అని అంటున్నారు.
ప్రోటోకాల్ అంటూ :
ఇక ఒక విదేశీ అధినేత దేశానికి వచ్చినపుడు ఆయనతో ప్రధాని అలాగే ప్రతిపక్ష నేత కూడా సమావేశం కావడం ఒక ఆచారంగా ప్రోటోకాల్ లో భాగంగా వస్తోంది అని అంటున్నారు. అయితే రష్యా అధినేత పుతిన్ భారత్ పర్యటనలో ఎక్కడా లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కానీ రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే కానీ కనిపించక పోవడం విశేషం అంటున్నారు. పూర్తిగా విపక్ష నేతలను పక్కన పెట్టేశారని కాంగ్రెస్ దీని మీద ఆరోపిస్తోంది. రాహుల్ గాంధీ అయితే దీని మీద హాట్ కామెంట్స్ చేశారు. ప్రతిపక్ష నాయకులను ఆహ్వానించే సంప్రదాయాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉల్లంఘించిందని రాహుల్ గాంధీ ఆరోపించారు.
కాంగ్రెస్ ఎంపీకి :
రాహుల్ ఈ విషయం మీద పెద్ద ఎత్తున చర్చకు పెట్టి మరీ మోడీ ప్రభుత్వం మీద విమర్శలు చేసిన నేపధ్యంలో లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఇద్దరినీ ఆహ్వానించలేదని అంటున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నివాసంలో ఏర్పాటు చేసిన విందుకు వారిని ఆహ్వానించలేదని అంటున్నారు. అదే సమయంలో చాలా ఆసక్తికరంగా కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్‌ను ఆహ్వానించినట్లుగా కాంగ్రెస్ పార్టీ వర్గాలు పెర్కొన్నాయి.
అదేమీ లేదంటూనే :
పుతిన్ భారత పర్యటన కాదు కానీ ఈ ప్రోటోకాల్ వివాదం ఒక వైపు కొనసాగింది. అయితే దీని మీద ప్రభుత్వ వర్గాలు కూడా వివరణ ఇచ్చాయి. గతంలో అంటే 2024 జూన్ 9న అప్పటి బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనాతో సహా కనీసం నలుగురు పర్యాటక దేశాధినేతలను రాహుల్ గాంధీ లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడి హోదాలోనే కలిశారని గుర్తు చేశారు. ఇక విదేశీ అధినేతలను ఎవరినైనా కలవాలా వద్దా అని నిర్ణయించేది విదేశాంగ మంత్రిత్వ శాఖ కాదని అలా ఈ దేశాన్ని సందర్శించే విదేశీ ప్రతినిధి బృందం అని కూడా ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. మొత్తం మీద చూస్తే పుతిన్ టూర్ లో రాహుల్ ఎక్కడా కనిపించలేదు, మరి దానికి కారణాలు అయితే తెలియదు, ప్రభుత్వం మాత్రం వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది.
