తేజస్వీ యాదవ్ కు మరోసారి నిరాశ... 'జంగల్ రాజ్'.. ప్లస్సా.. మైనస్సా..?
వాస్తవానికి బీహార్ లో అగ్రవర్ణాల మద్దతు గతంలో కాంగ్రెస్ కు ఉండేది! అయితే ఈ సారి ఆ వర్గాల ఓటర్లు బీజేపీ వైపు మళ్లారని అంటున్నారు.
By: Raja Ch | 14 Nov 2025 4:05 PM ISTబీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి నుంచి సంచలన విజయం నమోదవుతోంది! మార్పు మొదలైంది అంటూ మహాగఠ్ బంధన్ చేసిన ప్రచారం పాచిక పారలేదు! బీహార్ లో "నిమో" కాంబో విజయఢంకా మోగించింది. మరోవైపు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ కు మరోసారి నిరాశ ఎదురైంది. మహాగఠ్ బంధన్ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రచారం జరిగినప్పటికీ తేజస్వీ యాదవ్ ఆర్జేడీ పెర్ఫార్మెన్స్ ఇప్పుడు సంచలనంగా మారింది.
అవును... ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ కు మరోసారి నిరాశ ఎదురైంది. సుమారు దశాబ్ధానికి పైగా శ్రమించినా ఫలితం దక్కడం లేదు. ఈ క్రమంలో తాజా ఎన్నికలో కూటమి ఘోరంగా ఓటమి పాలవ్వడంతో ఆయన రాజకీయ భవిష్యత్తు సందిగ్ధంలో పడిందనే కామెంట్లను సొంతం చేసుకుంటుంది. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నా పెద్దగా లాభించలేని పరిస్థితి. కాగా... 2015లో నీతీశ్ కుమార్ తో కలిసి పోటీచేసిన తేజస్వీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహించారు.
తేజస్వీ యాదవ్ కు 'జంగల్ రాజ్'.. ప్లస్సా.. మైనస్సా..?
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తేజస్వీ యాదవ్ కు మరోసారి నిరాశ ఎదురవ్వడంతో ఓ ఆసక్తికరమైన చర్చ తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... తేజస్వీ యాదవ్ కు జంగల్ రాజ్ ప్లస్సా.. మైనస్సా.. అనే చర్చ ఇప్పుడు బలంగా సాగుతోంది. ఈ క్రమంలో.. తేజస్వీకి జంగల్ రాజ్ మైనస్ అని ఒకరంటే.. ఆయన పేరు వాడుకోకపోవడం కూడా ఓటమికి ఒక కారణం అని మరికొందరు అంటున్నారు. అదేమిటో ఇప్పుడు చూద్దామ్...!
తేజస్వీ యాదవ్ తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ పాలనా కాలాన్ని జంగల్ రాజ్ గా పోలిస్తారు రాజకీయ ప్రత్యర్థులు. ఆయన పాలనా కాలంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని.. అశాంతి, హింస రాజ్యమేలాయని అంటారు. ఈ ఎన్నికల ప్రచారంలో మోడీ, అమిత్ షాలు ఈ విషయాన్ని పదే పదే ప్రస్థావించారు.. అప్పట్లో ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులను, కష్టాలను గుర్తుచేశారు. ఇదే తేజస్వీకి పెద్ద నష్టం కలిగించిందని అంటున్నారు.
మరోవైపు లాలు ప్రసాద్ యాదవ్ పాలన జంగల్ రాజ్ గా పేరు తెచ్చుకున్నప్పటికీ.. అప్పట్లో పేద వర్గాలకు ప్రాధాన్యత లభించిందని.. సామాజిక న్యాయం పేరుతో అనేక కొత్త పథకాలు తీసుకొచ్చారని.. అయితే, తన తండ్రి వారసత్వాన్ని తేజస్వీ పెద్దగా చెప్పుకోలేదని.. ప్రచారంలో ఆయన పేరు పెద్దగా ప్రస్థావించకపోవడంతో అది నష్టాన్ని కలిగించిందని మరో వెర్షన్ వినిపిస్తోంది.
ఎన్డీయేకు బలంగా మారిన మహిళా పథకాలు!:
వీటికి తోడు ఈ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు ముఖ్యమంత్రి మహిళా రోజ్ గార్ పథకం కింద సుమారు 21 లక్షలమంది మహిళలకు వారి ఖాతాల్లో రూ.10వేల చొప్పున జమచేయడం ఎన్డీయే కూటమికి బాగా కలిసొచ్చిందని అంటున్నారు. స్వయంఉపాధి పథకంలో ప్రతిభ ప్రదర్శించిన వారికి రూ.2 లక్షల చొప్పున రుణాలిచ్చే పథకాల ప్రభావంతో మెజార్టీ మహిళా ఓటర్లు ఎన్డీయేకు ఓటు వేశారని అంటున్నారు.
ఎన్డీయేకు దగ్గరైన అగ్రవర్ణాలు.. ఆర్జేడీకి దూరమైన యాదవేతరులు!:
వాస్తవానికి బీహార్ లో అగ్రవర్ణాల మద్దతు గతంలో కాంగ్రెస్ కు ఉండేది! అయితే ఈ సారి ఆ వర్గాల ఓటర్లు బీజేపీ వైపు మళ్లారని అంటున్నారు. దీంతో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నా అది కూడా తేజస్వీని కాపడలేకపోయిందని చెబుతున్నారు. దీనికితోడు.. ఆర్జేడీ 52 సీట్లు యాదవులకే కేటాయించింది. దీంతో.. ఈ విషయం ఇతర వర్గాలను అసంతృప్తికి గురి చేసింది. ఇది యాదవేతరులను ఏకం చేసిందని అంటున్నారు.
ఫ్యామిలీ కంచుకోటలో ఎమ్మెల్యేగా గెలుపు!:
మరోవైపు మహాఘఠ్ బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్.. కుటుంబ కంచు కోట అయిన రఘోపూర్ లో 11,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. రాఘోపూర్ ఆర్జేడీకి బలమైన స్థానం. గతంలో ఇక్కడ నుంచి తేజస్వి యాదవ్ తండ్రి, ఆర్జేడీ వ్యవస్థాపకుడు లాలూ ప్రసాద్ యాదవ్.. అతని తల్లి రబ్రీ దేవి విజయం సాధించారు. తేజస్వి 2015 నుండి ఈ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
