ప్రాంతీయ పార్టీల కథ ముగిసినట్టేనా? 2029 జమిలి కోసం బీజేపీ బిగ్ ప్లాన్!
కేంద్రంలోని అధికార ఎన్డీఏ ప్రభుత్వ వ్యూహాలు ప్రాంతీయ పార్టీలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
By: Tupaki Political Desk | 23 Jun 2026 6:00 PM ISTకేంద్రంలోని అధికార ఎన్డీఏ ప్రభుత్వ వ్యూహాలు ప్రాంతీయ పార్టీలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. 12 ఏళ్లుగా ప్రభుత్వాన్ని నడుపుతున్న బీజేపీ పెద్దలు తమ అధికారం సుస్థిరం చేసుకునే దిశగా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారని అంటున్నారు. వరుసగా మూడు పర్యాయాలు అధికారంలోకి వచ్చిన కేంద్ర పెద్దలు వచ్చే ఎన్నికల్లోనూ సునాయాశంగా గెలిచేందుకు పక్కా ప్రణాళిక రచించారని అంటున్నారు. జమిలి ఎన్నికల నిర్వహణ ద్వారా మరోసారి అధికారంలోకి రావాలని భావిస్తున్న ఎన్డీఏ ప్రభుత్వ పెద్దలు ముందుగా మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పునర్విభజన బిల్లులను ఆమోదించుకోవాలని చూస్తున్నారని చెబుతున్నారు. ఇప్పటికే ఒకసారి ప్రతిపక్షాల తిరస్కరణతో వీగిపోయిన ఈ బిల్లులను మళ్లీ సభలో ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని అంటున్నారు. అయితే గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని 2/3 వంతు మెజార్టీ కోసం ప్రతిపక్షాలపై ఫోకస్ చేస్తున్నారని అంటున్నారు.
మహిళా రిజర్వేషనో, నియోజకవర్గాల పునర్విభజన' (డీలిమిటేషన్) బిల్లులను ఎలాగైనా పార్లమెంటులో ఆమోదించుకోవాలని ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా గట్టి పట్టుదలతో ఉన్నారని చెబుతున్నారు. ఈ రెండు బిల్లులు రాజ్యాంగ సవరణ బిల్లులు ఆమోదం కోసం ఉభయ సభల్లో 2/3 వంతు మెజార్టీని సాధించాల్సివుందని అంటున్నారు. దీంతో బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందని చెబుతున్నారు. ఇందులో భాగంగా విపక్షాలను బలహీనపరిచే లక్ష్యంతో ప్రాంతీయ పార్టీలను లక్ష్యంగా చేసుకున్నారని అంటున్నారు. పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీని చీల్చి, ఆ పార్టీకి చెందిన 20 మంది ఎంపీల మద్దతును ఇప్పటికే కూడగట్టుకోగలిగారు. అదే బాటలో, శివసేన (యూబీటీ) నుంచి ఆరుగురు లోక్‌సభ సభ్యులను ఎన్డీఏ గూటికి చేర్చారు. వీరంతా ఇప్పుడు షిండే శివసేనలో భాగమయ్యారు. ఇలా చిన్న, ప్రాంతీయ పార్టీలను ముక్కలు చేయడం ద్వారా లోక్‌సభలో 2/3 వంతు మెజార్టీకి చేరువవ్వడమే బీజేపీ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోందని విశ్లేషిస్తున్నారు.
ఎన్సీపీపైనా ఫోకస్
ఇప్పటికే రెండు పార్టీలను చీల్చిన బీజేపీ వ్యూహకర్తల కన్ను తాజాగా మహారాష్ట్రకు చెందిన ఎన్సీపీపై పడినట్లు ప్రచారం జరుగుతోంది. మహారాష్ట్ర రాజకీయాల్లో రెండుగా విడిపోయిన ఎన్సీపీ, ఇప్పుడు మరోసారి చీలిక వైపు అడుగులు వేయడం ఆ పార్టీ మనుగడనే ప్రశ్నార్థకం చేస్తోంది. అటు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లో కూడా చిచ్చు పెట్టడంలో బీజేపీ సఫలీకృతమైందని, సమాజ్ వాదీ పార్టీ కూడా ఇదే విధమైన భయంతో అప్రమత్తమైందని విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఈ తరహా రాజకీయ అనిశ్చితిని సృష్టించడం ద్వారా విపక్షాల ఐక్యతను దెబ్బతీయాలని బీజేపీ చేస్తున్న తెరచాటు ప్రయత్నాలు కలకలం రేపుతున్నాయి.
డీఎంకే వ్యూహాత్మక మద్దతు
ఈ రాజకీయ చదరంగంలో డీఎంకే తీసుకున్న నిర్ణయం ఎన్డీఏకు ఊపిరి పోసినట్లయిందని అంటున్నారు. ఇండియా కూటమి నుంచి డీఎంకే బయటకు రావడం బీజేపీకి ఊహించని లాభం చేకూర్చింది. బిల్లుల ఆమోదం సమయంలో డీఎంకే కనీసం 'వాకౌట్' చేయడం ద్వారా తమకు సహకరిస్తుందని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. లోక్‌సభలో పరిస్థితి ఇలా ఉంటే, రాజ్యసభలో కూడా 2/3 వంతు మెజార్టీకి అవసరమైన ఆ ముగ్గురు, నలుగురు సభ్యుల మద్దతు కోసం బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
బీజేపీ ఈ బిల్లుల పట్ల ఎందుకు ఇంతగా పట్టుదలతో ఉందనే ప్రశ్నకు సమాధానం.. 2029 జమిలి ఎన్నికలు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే ప్రధాన అజెండాతో పాటు, రాబోయే దశాబ్ద కాలం పాటు తమ అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలనే దీర్ఘకాలిక వ్యూహంతో బీజేపీ ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్తోందని అంటున్నారు. మహిళా రిజర్వేషన్లు ఓటర్లలో, ముఖ్యంగా మహిళా వర్గాల్లో తమ పట్టును మరింత పెంచుతాయని, డీలిమిటేషన్ ప్రక్రియ కొత్త రాజకీయ సమీకరణాలకు నాంది పలుకుతుందని బీజేపీ అంచనా వేస్తోందని చెబుతున్నారు. ప్రాంతీయ పార్టీలను ముక్కలు చేసి, తమకు కావాల్సిన రాజ్యాంగ సవరణలకు మార్గం సుగమం చేసుకోవడం అనేది బీజేపీ వ్యూహంగా చెబుతున్నారు. అయితే దీనిపై జాతీయస్థాయిలో భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా, బీజేపీ వేస్తున్న అడుగులతో రాబోయే పార్లమెంటు సమావేశాలు దేశ చరిత్రలోనే అత్యంత కీలకమైనవిగా మారనున్నాయని అంటున్నారు.
