Begin typing your search above and press return to search.

సీన్ మారుతోంది...సీరియస్ గా కేంద్రం

పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధం నేపధ్యంలో అంతర్జాతీయంగానే కాకుండా దేశీయంగా ఉన్న పరిస్థితుల మీద ఎన్డీయే సర్కార్ సీరియస్ గానే ఫోకస్ పెట్టింది.

By:  Satya P   |   23 March 2026 9:12 AM IST
సీన్ మారుతోంది...సీరియస్ గా కేంద్రం
X

పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధం నేపధ్యంలో అంతర్జాతీయంగానే కాకుండా దేశీయంగా ఉన్న పరిస్థితుల మీద ఎన్డీయే సర్కార్ సీరియస్ గానే ఫోకస్ పెట్టింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేబినెట్ భద్రతా కమిటీ సమావేశంలో కీలక నిర్ణయాలనే తీసుకున్నారు. ఈ యుద్ధంతో అలాగే ఈ ఉద్రిక్తతల ఏర్పడుతున్న ప్రభావం తీవ్రంగానే ఉందని అంటున్నారు. ఇది ఒక విధంగా చూస్తే నిరంతరం మారుతున్న పరిస్థితిగా కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అదే సమయంలో దీని ప్రభావం యావత్ ప్రపంచంపై ఏదో ఒక రూపంలో పడుతోందని కూడా అంటోంది. ఇటువంటి పరిస్థితులలో దేశంలో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చేపట్టాల్సిన చర్యల మీదనే ఫోకస్ పెట్టారని అంటున్నారు.

కొరత లేకుండా చూడాలి :

దేశవ్యాప్తంగా నిత్యావసరాల కొరత లేకుండా చూడాలని ప్రధాని మంత్రులను ఆదేశించారు. అంతే కాదు అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌లో మారుతున్న పరిస్థితులను నిశితంగా గమనించాలని కోరారు. ఇక దేశ ప్రజలకు కనీస అసౌకర్యం కలిగేలా ప్రభుత్వంలోని అన్ని శాఖలు కలిసి పనిచేయాలని ప్రధానమంత్రి ఆదేశించారు. ముఖ్యమైన వస్తువుల బ్లాక్ మార్కెటింగ్, నిల్వలు జరగకుండా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలతో సరైన సమన్వయం చేసుకోవాలని కూడా ఆయన కోరారు. ప్రభుత్వ సమగ్ర విధానంలో అంకితభావంతో పనిచేసేందుకు మంత్రులు కార్యదర్శులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి ఆదేశించారు. అన్ని రంగాల బృందాలు కూడా సంబంధిత వర్గాలన్నింటితో సంప్రదింపులు జరిపి పనిచేయాలని ఆయన సూచించారు.

వీటి మీద తీవ్ర ప్రభావం :

ఇక వ్యవసాయం, ఎరువులు, ఆహార భద్రత, పెట్రోలియం, విద్యుత్, ఎంఎస్ఎంఈలు, ఎగుమతిదారులు, షిప్పింగ్, వాణిజ్యం, ఫైనాన్స్, సరఫరా గొలుసులు వంటి రంగాలలో పశ్చిమాసియా యుద్ధ ప్రభావం పడుతోందని కేంద్రం భావిస్తోంది. దానిని పరిష్కరించడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఆహారం సహా దేశంలో సామాన్య ప్రజల కీలక అవసరాల లభ్యతపై కూడా ఈ సమావేశం సవివరంగా అంచనా వేసింది. నిత్యావసరాల నిరంతర లభ్యతను నిర్ధారించడానికి స్వల్పకాలిక, మధ్యకాలిక దీర్ఘకాలిక చర్యలపై సమావేశంలో ప్రభుత్వ పెద్దలు చర్చించారు.

బ్లాక్ మార్కెట్ మీద కొరడా :

దేశంలో ఉన్న నిల్వల గురించి పూర్తి సమాచారన్ని దగ్గర పెట్టుకోవడమే కాకుండా ఈ సమయంలో బ్లాక్ మార్కెట్ చేస్తూ నిల్వలను అక్రమంగా దాచే వారి మీద కొరడా ఝలిపించాలని కూడా కేంద్రం గట్టి నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో దేశంలో ఉన్న వనరులను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటూ దేశీయ ఉత్పత్తుల ఎగుమతులకు కొత్త దారులు వెతకాలని కూడా నిర్ణయించింది. అలాగే ఎల్‌పిజి నిల్వల విషయంలో బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టడానికి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో దాడులు కొనసాగించాలని నిర్ణయించింది.