Begin typing your search above and press return to search.

ఎన్డీయే కన్వీనర్ గా చక్రం తిప్పనున్న బాబు ?

తెలుగుదేశం అధినేత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అపారమైన రాజకీయ అనుభవం ఉంది.

By:  Satya P   |   24 Aug 2026 9:18 AM IST
ఎన్డీయే కన్వీనర్ గా చక్రం తిప్పనున్న బాబు ?
X

తెలుగుదేశం అధినేత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అపారమైన రాజకీయ అనుభవం ఉంది. దాంతో పాటు జాతీయ స్థాయి రాజకీయాల మీద పూర్తి అవగాహన ఉంది. జాతీయ స్థాయిలో వివిధ పార్టీల అధినేతలతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బాబుకు ఎన్డీయేలో కీలకమైన కన్వీనర్ పోస్టు దక్కే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. నిజానికి చూస్తే ఈ పదవి అయితే ఎన్డీయేలో ఇపుడు లేదు. కానీ దానిని క్రియేట్ చేయాల్సిన అవసరాన్ని ఎన్డీయే పెద్దలు గుర్తించారని అంటున్నారు. ఇక అంతటి కీలకమైన పదవిని చంద్రబాబుకు ఇవ్వాలని ఆలోచిస్తున్నారు అని అంటున్నారు.

బాబు ఎందుకు అంటే :

చంద్రబాబుకే ఎన్డీయే కన్వీనర్ పదవి ఎందుకు అంటే ఆయన గతంలో వాజ్ పేయి హయాంలో ఈ పదవి ఎంతో చాకచక్యంగా నిర్వహించారు. అంతే కాదు జాతీయ స్థాయిలో బీజేపీ పెద్దలకు అందుబాటులో ఉంటూ వాజ్ పేయ్ ప్రభుత్వం అయిదేళ్ళ పాటు ఎలాంటి ఒడిదుడుకులకు ఇబ్బంది పడకుండా చూశారు. దాంతో ఈసారి కూడా బాబుకే ఈ పదవి ఇస్తే 2029 ఎన్నికల్లో మరోసారి అధికారంలోకి ఎన్డీయే రావడానికి ఆస్కారం ఏర్పడుతుందని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు అని అంటున్నారు.

అనివార్యంగా మారింది :

ఇదిలా ఉంటే ఎన్డీయే కూటమి ప్రభుత్వం పరంగా సంఖ్యాబలంగా గట్టిగానే ఉంది. చేతిలో మూడేళ్ళ దాకా అధికారం ఉంది. కానీ జాతీయ స్థాయిలో వేగంగా మారుతున్న పరిణామాలే ఎన్డీయేకు నాయకత్వం వహిస్తున్న బీజేపీ పెద్దలను కలవరపెడుతున్నాయని అంటున్నారు. ఒక వైపు వివిధ వర్గాలలో నెమ్మదిగా బయలుదేరిన అసహనం కాస్తా అసంతృప్తిగా మారితే 2029 ఎన్నికలకు దెబ్బ పడుతుందని బీజేపీ భావిస్తోంది. అలాగే జెన్ జీ తో చిక్కులు వస్తున్నాయి. రేపటి ఎన్నికల్లో యువత పెద్ద ఎత్తున ఓటు బ్యాంక్ గా మారితే వారిని దగ్గరకు తీసుకోకపోతే ముప్పు తప్పదని కూడా ఊహిస్తున్నారు.

ఉత్తరాదిన కోత :

ఇక 2024 ఎన్నికల ఫలితాలు చూస్తే ఉత్తరాదిన బీజేపీకి దెబ్బ పడింది అని అర్ధం అవుతోంది. ఉత్తర ప్రదేశ్ లోనే సగానికి కంటే లోక్ సభ సీట్లు బీజేపీకి తగ్గిపోయాయి. ఇక మరో పెద్ద రాష్ట్రం బీహార్ లో చూస్తే తాజాగా జరిగిన ఒక ఉప ఎన్నికల్లో ప్రశాంత్ కిశోర్ గెలిచారు. బీజేపీ కంచుకోటలో ఓటమి ఎదురైంది. అంతే కాదు జెన్ జీ ఉద్యమ ప్రభావం ఉత్తరాదిన గట్టిగా ఉంది అన్నది కూడా చెబుతున్నారు. దాంతో దక్షిణాదిన బీజేపీ చూపు పడింది అని అంటున్నారు. ఇక్కడ దిగ్గజ నేతగా ఉన్న చంద్రబాబుకు ఎన్డీయే కన్వీనర్ పదవి అప్పగించడం ద్వారా ప్రాంతీయ పార్టీలను మచ్చిక చేసుకోవడంతో మరోసారి అధికారంలోకి రావాలని చూస్తోంది అని అంటున్నారు.

గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లేనా :

ఇక ఇంత కాలం మరో అధికార కేంద్రానికి బీజేపీ పెద్దలు ససేమిరా అంగీకరించే పరిస్థితి కనిపించేది కాదు, కానీ ఇపుడు అంతా మారిపోయింది. దాంతో బీజేపీ అగ్ర నేతలే ఎన్డీయే కన్వీనర్ పదవిని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. అందులో చంద్రబాబు లాంటి రాజకీయ గండర గండడుని ఉంచితే తమకు రానున్న రోజులలో రాజకీయగా రాచబాట అవుతుందని ఊహిస్తున్నారు అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే ఎన్డీయే కన్వీనర్ పదవి తొందరలో బాబుని వరించబోతుంది అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.