వైసీపీకి చావో రేవో -లైట్ తీసుకుంటే ?
ఏపీలో విపక్షంలో వైసీపీ ఉంది. ఎన్నడూ లేని విధంగా కేవలం 11 సీట్లకే ఆ పార్టీ పరిమితం అయిపోయింది.
By: Satya P | 27 Feb 2026 1:00 PM ISTఏపీలో విపక్షంలో వైసీపీ ఉంది. ఎన్నడూ లేని విధంగా కేవలం 11 సీట్లకే ఆ పార్టీ పరిమితం అయిపోయింది. ఏముందిలే మూడేళ్ళ పాటు కళ్ళు మూసుకుంటే ప్రతిపక్షంలో నుంచి అధికార పక్షం వైపు రావచ్చు అని గత ట్రాక్ రికార్డుని చూసి వైసీపీ పెద్దలు నిబ్బర పడవచ్చు. కానీ పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవని అంటున్నారు. దానికి అనేక ఉదాహరణలు కళ్ళ ముందు ఉన్నాయి అని చెబుతున్నారు. తమిళనాడులో ఒకసారి డీఎంకే గెలిస్తే మరోసారి అన్నా డీఎంకే గెలిచేది. అయితే 2006లో డీఎంకే గెలిచిన తరువాత 2011లో అన్నా డీఎంకే గెలిచింది. ఆ ప్రకారం చూస్తే 2016లో డీఎంకే రావాల్సి ఉంది. కానీ జనాలు మాత్రం మరోసారి జయలలిత నాయకత్వానికే పట్టం కట్టారు. అలా అంతకు ముందున్న ట్రాక్ రికార్డుని బ్రేక్ చేశారు. దాంతో డీఎంకే పదేళ్ళ పాటు అధికారం కోసం వేచి ఉండాల్సి వచ్చింది.
ఎన్డీయే వరస విజయాలు :
ఇక ఒక్కసారి దేశంలో చూసుకుంటే ఎన్డీయే వరస విజయాలు సాధిస్తోంది. బీహార్ లో నితీష్ కుమార్ అలా ఎన్డీయే భాగస్వామిగా వరుసగా రెండోసారి అధికారంలోకి 2025 ఎన్నికల్లో వచ్చారు. హర్యానాలో బీజేపీ 2019లో గెలిచింది. 2024 లో వరసగా రెండోసారి ఆ పార్టీనే జనాలు ఎన్నుకున్నారు. ఇదే సీన్ మహారాష్ట్రలో రిపీట్ అయింది. 2019లో గెలిచిన బీజేపీ మిత్రుల కూటమి 2024లో మళ్ళీ గెలిచి చూపించింది. ఈ ట్రెండ్ అనేక చోట్ల సాగుతోంది. ముఖ్యంగా చూస్తే ఎన్డీయేతో కలిసిన మిత్రులకు విజయాలు వరసగా దక్కుతున్నాయి.
ఏపీలో కూటమి పటిష్టంగా :
ఏపీలో చూస్తే కూటమి పటిష్టంగా ఉంది. టీడీపీ నాలుగున్నర దశాబ్దాలకు పైగా చరిత్ర ఉన్న పార్టీ సంస్థాగతంగా చూస్తే దేశంలో ఏ పార్టీ లేని విధంగా బలంగా ఉంది. చంద్రబాబు రాజకీయ వ్యూహాలు ఆయన చాతుర్యం అందరికీ తెలిసిందే. విపక్షం నుంచి అధికార పక్షం వైపు ఆయన ఎలా దూసుకుని వచ్చారో తెలిసిందే. అధికారంలో ఉన్న బాబు ఇంకా బలవంతుడని అంటారు. ఆయనని ఢీ కొట్టడం అంటే బహు కష్టమన్న భావన ఉంది. ఇక పవన్ కళ్యాణ్ సినీ గ్లామర్ తో పాటు బలమైన సామాజిక వర్గం వెన్ను దన్నుగా ఉంది. అలాగే బీజేపీ వైపు ఉన్న వర్గాలు ఉండనే ఉన్నాయి. మోడీ ఇమేజ్ బాగా వర్కౌట్ అవుతుంది. ఈ నేపథ్యంలో కూటమిని 2029 ఎన్నికల్లో ఢీ కొట్టాలీ అంటే వైసీపీ పూర్తి స్థాయిలో తన బలాలను ప్రదర్శించాల్సి ఉంది అని అంటున్నారు.
అతి ధీమాతో అయితే :
ఇక వైసీపీ అధినాయకత్వం 2014, 2019, 2024 ఫలితాలను మాత్రమే చూస్తోంది. కానీ ప్రతీ ఎన్నికకూ ఒక ప్రత్యేకత ఉంటుంది. అంతే కాదు కొత్త ఓటర్లు వస్తారు. రాజకీయ సామాజిక ఆర్థిక పరిస్థితులు మారుతాయి. దాంతో ఏ ఎన్నికకు ఆ ఎన్నిక అన్నట్లుగానే పోరాడాల్సి ఉంటుంది. ఏపీలో చూస్తే టీడీపీ కూటమి వైసీపీ అంటున్న సంక్షేమాన్ని అందిపుచ్చుకుంది. తన బ్రాండ్ అయిన అభివృద్ధిని కూడా తోడుగా చేసుకుంది. అలాగే ప్రతీ అంశం మీద కూటమికి ఒక స్పష్టమైన విజన్ ఉంది. అదే వైసీపీ అయితే ఇప్పటిదాకా నమ్ముకుంటున్నది కూటమి పట్ల వచ్చే వ్యతిరేకతను మాత్రమే అని అంటున్నారు. కచ్చితంగా వచ్చేసారి తమకే జనాలు ఓటు చేస్తారు అని అతి ధీమాతో ఉన్నారని అంటున్నారు.
వాస్తవిక దృక్పథంతో :
ఈసారి ఎన్నికలు వైసీపీకి చావో రేవో అన్నట్లుగానే ఉంటాయి. ఎందుకంటే ఒక ప్రాంతీయ పార్టీగా వైసీపీ ఈసారి ఎన్నికల్లో గెలుపు పిలుపే వినాలి. ఓటమి సంభవిస్తే మాత్రం అది ఆ పార్టీకే అతి పెద్ద ముప్పుగా మారుతుంది. వైసీపీ వరసగా రెండు సార్లు ఓడితే మాత్రం అది పార్టీ ఉనికికే ముప్పుగా మారుతుంది. అందువల్ల వైసీపీకి నో ఆప్షన్. గెలుపు అన్నది ఆ పార్టీ అజెండాగా మారాలి. అది జరగాలి అంటే దేన్ని లైట్ తీసుకోకూడని అంటున్నారు. రాజధాని విషయంలో కాని అభివృద్ధి అజెండా విషయంలో కానీ వైసీపీ తనదైన విజన్ ని విస్పష్టంగా ఆవిష్కరించాలి.
కధ అయితే సాగదు :
కూటమి చేయలేనిది ఏదో తాను చేస్తాను అని జనాలను ఒప్పించాలి మెప్పించాలి. ఏపీ ప్రజలు కచ్చితంగా అభివృద్ధిని కోరుకుంటున్నారు. కేవలం సంక్షేమ పధకాలతోనే కధ అయితే సాగదు అన్నది వైసీపీ గుర్తించి ఏపీ నవ శకం మీద తనదైన బ్లూ ప్రింట్ ని రెడీ చేసుకోవాలి. అవసరమైతే మేధావులతో చర్చించాలి. దానిని జనం ముందు చర్చకు పెట్టాలి. అలాగే దూరమైన వర్గాలను దగ్గరకు చేర్చుకోవడానికి తగిన వ్యూహాలను సిద్ధం చేసుకోవాలని అంటున్నారు. అన్నింటికీ ఒకటే మాత్ర అదే పాదయాత్ర అన్నట్లుగా వైసీపీ ఆలోచిస్తే మాత్రం ఇబ్బంది అవుతుందని అన్న విశ్లేషణలు ఉన్నాయని అంటున్నారు.
