మొత్తానికి నితీష్ ని సీఎం చేసేసారు
మొత్తానికి ఆర్జేడీ పంతమే నెగ్గినట్లు అయింది. బీహార్ ఎన్నికల్లో ఎన్డీఎ తన సీఎం అభ్యర్ధిని ప్రకటించింది. నితీష్ కుమార్ తమ కూటమి అభ్యర్ధిగా బీజేపీ అగ్ర నేత అమిత్ షా ప్రకటించారు.
By: Satya P | 30 Oct 2025 3:00 AM ISTబీహార్ లో రాజకీయం ఎత్తుకు పై ఎత్తుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఎవరికి ఎవరూ తీసిపోకుండా వ్య్హూహాలకు పదును పెడుతున్నారు. తమదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. ఇదిలా ఉంటే బీహార్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి వర్సెస్ మహా ఘట్ బంధన్ పోటా పోటీగా ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. మహా ఘట్ బంధన్ నుంచి తేజస్వీ యాదవ్ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ఉన్నారు. ఎన్డీయే నుంచి ఎవరు అని ఆ రోజు నుంచే గట్టిగా ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఎందుకంటే ప్రత్యర్థిగా ఉన్న బీజేపీని ఈ విషయంలో కార్నర్ చేయడమే మహా ఘట్ బంధన్ ప్రధాన ఉద్దేశ్యంగా ఉంది.
చెబితే తంటా లేకుంటే మంట :
సరిగ్గా ఇదే పాయింట్ దగ్గర కమలం పార్టీ ఆర్జేడీకి దొరికేసింది అని అంటున్నారు. ఈసారి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అన్నది ప్రకటించకుండానే ఎన్నికలకు వెళ్లాలని బీజేపీ పక్కాగా ప్లాన్ చేసింది. ఎందుకంటే నితీష్ కుమార్ ని అభ్యర్ధిగా ప్రకటిస్తే ఆయన పరిపాలన మీద ఉన్న యాంటీ ఇంకెంబెన్సీని కోరి కూటమి మీద వేసుకోవాల్సి ఉంటుంది అదే సమయంలో యువకుడు అయిన తేజస్వి యాదవ్ వర్సెస్ నితీష్ అంటే సహజంగానే మార్పు కోరే వారి మొగ్గు ఆ వైపుగా నూరు శాతం పోతుంది. యువత కూడా పూర్తిగా టర్న్ అవుతుంది. అలాగని కాదు అనుకుంటే జేడీయూ వర్సెస్ బీజేపీల మధ్య చిచ్చు పెట్టడం ద్వారా ఆర్జేడీ పాచిక పారుతుంది. దాంతో గురి చూసి మరీ మీ సీఎం అభ్యర్ధి ఎవరో ప్రకటించాలని డిమాండ్ చేసింది.
ఎట్టకేలకు ఓకే :
మొత్తానికి ఆర్జేడీ పంతమే నెగ్గినట్లు అయింది. బీహార్ ఎన్నికల్లో ఎన్డీఎ తన సీఎం అభ్యర్ధిని ప్రకటించింది. నితీష్ కుమార్ తమ కూటమి అభ్యర్ధిగా బీజేపీ అగ్ర నేత అమిత్ షా ప్రకటించారు. ఆయన సారధ్యంలోనే ఎన్నికలకు వెళ్తున్నామని చెబుతూనే సీఎం గా నితీష్ ఉంటారని ఆయన సీటు ఇప్పట్లో ఖాళీ అయ్యే చాన్స్ లేదని కూడా అన్నారు. బీహార్ లో విపక్షానికి అసలు చాన్స్ లేనే లేదని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అదే సమయంలో ఆర్జేడీని పొరపాటున ఎన్నుకుంటే కనుక రాష్ట్రం మరో ఇరవై ఏళ్ళు వెనక్కు పోతుందని కూడా అమిత్ షా హెచ్చరించడం గమనార్హం. బీహార్ ని అభివృద్ధి పధంలో నడిపే సత్తా ఎన్డీయేకే ఉందని ఆయన చెబుతున్నారు.
పొరపాటు జరుగుతుందా :
అమిత్ షా మాటలే తీసుకుంటే పొరపాటున మహా ఘట్ బంధన్ అధికారంలోకి వస్తే రాష్ట్రం ఇబ్బందులో పడుతుందని అంటున్నారు. నిన్నటిదాకా మేమీ అధికారంలోకి వస్తామని చెప్పిన బీజేపీ పెద్దల నోట ఇపుడు పొరపాటున అయినా మహా ఘట్ బంధన్ ప్రసక్తి అయితే రాకూడదు కదా అని అంటున్నారు. మరి ప్రత్యర్థి కూటమి అధికారంలోకి వస్తే అంటూ ఆయన చెబుతున్న ఈ మాటలు చూస్తే ఎక్కడో ఏమైనా తేడా జరుగుతోందా అన్న చర్చ అయితే సాగుతోంది. మొత్తానికి నితీష్ కుమార్ ని సీఎం అభ్యర్థిగా ప్రకటింప చేయడం ద్వారా ఆర్జేడీ సగం విజయం సాధించింది అని రేపటి ఎన్నికల్లో గెలిచి పూర్తి విజయం సాధిస్తుందని అంటున్నారు. చూడాలి మరి బీహార్ ఎన్నికలు ఏ తీరున సాగుతాయో ఫలితాలు ఏ విధంగా వస్తాయో మరి.
