అక్కడ కూటమి క్లీన్ స్వీప్...వైసీపీ ఎక్కడ ?
ఉమ్మడి విశాఖ జిల్లాలో జడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి క్లీన్ స్వీప్ చేసింది. విశాఖ జిల్లాలోని నాలుగు స్థానాల్లో మూడు టీడీపీ, ఒకటి జనసేన గెలుచుకున్నాయి. అనకాపల్లి జిల్లాలో మొత్తం 24 స్థానాలను కూటమి దక్కించుకుంది. ఇందులో టీడీపీ 17, జనసేన 5, బీజేపీ 2 స్థానాల్లో విజయం సాధించాయి. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ వైసీపీ ఒక్క జడ్పీటీసీ స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోవడం ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బగా మారింది.
By: Satya P | 8 Nov 2026 8:35 AM ISTఉమ్మడి విశాఖ జిల్లాలో కూటమి క్లీన్ స్వీప్ చేసి పారేసింది. దాంతో మరోసారి విశాఖ వైసీపీకి తాను దూరం అని చాటి చెప్పినట్లు అయింది. ఇక్కడ వైసీపీకి ఆది నుంచి దెబ్బ తగులుతూనే ఉంది. గతంలో సిటీ వరకు మాత్రమే వైసీపీకి బలం లేదని అనుకున్నారు. కానీ ఇపుడు అనకాపల్లి జిల్లాలో కూడా అదే పరిస్థితి ఉంది అంటే వైసీపీ వీక్ నెస్ గానే అంతా చూస్తున్నారు. ఇది వైసీపీకి ఉన్న నాయకత్వ లోపంగా కూడా విశ్లేషిస్తున్నారు. వైసీపీ నేతలు పేపర్ పులులుగా మీడియా బేబీలుగా మారిపోవడం వల్లనే రిజల్ట్ ఇంత తేడా కొడుతోంది అని అంటున్నారు.
విశాఖ జిల్లా అంతా :
ఇక విశాఖ జిల్లాలో ఉన్న నాలుగు జడ్పీటీసీలు టీడీపీ కూటమి పరం అయ్యాయి. ఇందులో మూడు టీడీపీ గెలుచుకుంటే ఒకటి జనసేనకు దక్కింది. ఇవన్నీ భారీ మెజారిటీలతో గెలుచుకోవడంతో ఏ దశలోనూ వైసీపీ పోటీ పడలేదని తేలిపోయింది. భీమిలీ నియోజకవర్గంలోనే మూడు జెడ్పీటీసీలు ఉన్నాయి. ఇక్కడ వైసీపీకి ఇంఛార్జిగా ఉన్న బొత్స అనూష విజయనగరం జిల్లా బొండపల్లి జెడ్పీటీసీగా పోటీ చేయడంతో ఈ నియోజకవర్గంను గాలికి వదిలేశారు అని అంటున్నారు. దాంతో ఎవరి మటుకు వారు అభ్యర్ధులు శ్రమ పడినా ఫలితం లేకపోయింది అన్నది ఉంది.
అనకాపల్లిలో తుడిచేశారు :
మరో వైపు అనకాపల్లి జిల్లాలో మొత్తం 24 జెడ్పీటీసీలు ఉంటే అన్నింటికీ కూటమి భారీ మెజారిటీలతో గెలుచుకుంది. ఇందులో తెలుగుదేశం పార్టీ 17 స్థానాల్లో, జనసేన పార్టీ 5 స్థానాల్లో, భారతీయ జనతా పార్టీ 2 స్థానాల్లో అత్యధిక ఓట్లు సాధించాయి. అధికారిక ఓట్ల నివేదిక ప్రకారం అనకాపల్లి, అచ్యుతాపురం, చీడికాడ, చోడవరం, దేవరాపల్లి, గొలుగొండ, కె.కోటపాడు, కోటవురట్ల, మాకవరపాలెం, మునగపాక, నక్కపల్లి, నర్సీపట్నం, నాతవరం, రావికమతం, రోలుగుంట, ఎస్.రాయవరం, వి.మాడుగుల జడ్పీటీసీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు అత్యధిక ఓట్లు సాధించారు. అలాగే బుచ్చయ్యపేట, పరవాడ, రాంబిల్లి, సబ్బవరం, యలమంచిలి జడ్పీటీసీ స్థానాల్లో జనసేన పార్టీ అభ్యర్థులు అత్యధిక ఓట్లు సాధించగా, కశింకోట, పాయకరావుపేట జడ్పీటీసీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు అత్యధిక ఓట్లు సాధించారు.
గుడివాడ మాటలేనా :
అనకాపల్లి జిల్లాలో రెండున్నరేళ్ళ క్రితం దాకా మంత్రిగా పనిచేసిన వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ ఎన్నికల ముందు సీఎం రమేష్ తో సవాళ్ళు చేశారు. గట్టిగానే తాము తలపడబోతున్నట్లుగా సంకేతాలు ఇచ్చారు. అయితే ఆయన ప్రభావం అయితే జీవీఎంసీ ఎన్నికల్లోనూ కనిపించలేదు. అనకాపల్లి పరిధిలో ఆరు డివిజన్లు కూటమి గెలుచుకుంది. ఇపుడు చూస్తే పరిషత్ ఎన్నికల్లోనూ అదే సీన్ రిపీట్ అయింది. మొత్తానికి మొత్తం జెడ్పీటీసీలు కూటమి పరం అయ్యాయి. దాంతో గుడివాడ ఇంఛార్జిగా ఉన్న చోడవరం నియోజకవర్గంలో సైతం ఒక్క జెడ్పీటీసీ దక్కలేదని అంటున్నారు.
హేమాహేమీలు ఉన్నారు :
ఇక అనకాపల్లి జిల్లాలో వైసీపీ తరఫున హేమాహేమీలు ఉన్నారు. మాడుగులలో మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు జెడ్పీటీసీ గానే గెలిచి ఆ మీదట ఎమ్మెల్యేగా రెండు సార్లు గెలిచారు. ఆయన కుమార్తె రాజకీయ వారసురాలు 2021లో జెడ్పీటీసీగా తొలిసారి గెలిచారు. ఆమె 2024 లో ఎమ్మెల్యేగా అక్కడ నుంచి పోటీ చేశారు. మరి ఆ పట్టు ఏమైందో తెలియదు అని అంటున్నారు. అలాగే సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కూడా తన సత్తాను ఇంఛార్జిగా ఉన్న ఎలమంచిలిలో చూపించలేకపోయారు అని అంటున్నారు. నర్శీపట్నం లో మునిసిపాలిటీని టోటల్ గా కూటమి స్వీప్ చేసి పారేసింది. ఇపుడు జెడ్పీటీసీలను గెలుచుకుంది. మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత పెట్ల ఉమాశంకర్ గణేష్ కూడా తన ప్రభావం చూపించలేకపోయారు అని అంటున్నారు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న పాయకరావు పేట మాజీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు నియోజకవర్గంలో కూడా జెడ్పీటీసీలు అన్నీ కూటమి గెలుచుకుంది. మొత్తంగా చూస్తే అనకాపల్లి జిల్లాలో పరిషత్తు ఎన్నికల్లో వైసీపీ ఎక్కడా అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.
