Begin typing your search above and press return to search.

మోడీ చంద్రబాబు నితీష్...ముగ్గురూ ముగ్గురే

ఈ ముగ్గురు నేతలూ సమకాలీనులు అని చెప్పాల్సి ఉంది. ముగ్గురిదీ డెబ్బై అయిదేళ్ళు నిండిన వయసే.

By:  Satya P   |   16 Oct 2025 9:32 AM IST
మోడీ చంద్రబాబు నితీష్...ముగ్గురూ ముగ్గురే
X

ఈ రోజున కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధానిగా ఉన్నరు అంటే దానికి కారణం చంద్రబాబు తెలుగుదేశం పార్టీ అలాగే నితీష్ కుమార్ జేడీయూ పార్టీ అన్న సంగతి తెలిసిందే. ఈ రెండు పార్టీల నుంచి 28 మంది ఎంపీలు ఉన్నారు. వీరే ఎన్డీయేని మూడవసారి కేంద్రంలో నిలబెట్టారు. ఈ ముగ్గురూ ఇపుడూ కలసి ఎంతో అన్యోన్యంగా ఉంటూ వస్తున్నారు. వీరే ఎన్డీయే అన్న రధానికి చక్రాలుగా చెబుతారు.

సమకాలీనులుగా :

ఈ ముగ్గురు నేతలూ సమకాలీనులు అని చెప్పాల్సి ఉంది. ముగ్గురిదీ డెబ్బై అయిదేళ్ళు నిండిన వయసే. ఇందులో చంద్రబాబు మోడీ కంటే ఆరు నెలలు పెద్దవారు. అలాగే మోడీ నితీష్ కుమార్ కంటే ఆరు నెలలు పెద్ద వారు. అందరూ ఇంచుమించుగా ఒకే ఏజ్ లో ఉన్న నాయకులు. వీరి రాజకీయం గురించి చూస్తే అందరి కంటే సీనియర్ మోస్ట్ గా చంద్రబాబు కనిపిస్తారు. అయితే యువజన రాజకీయ నేతగా నితీష్ కుమార్ ఎమర్జెన్సీ నుంచి ఉన్నా ఆయన చట్ట సభలలో అడుగు పెట్టింది మాత్రం 1985లోనే.ఆ తరువాత కేంద్రంలో మంత్రి పదవులు నిర్వహిస్తూ 2005లో బీహార్ కి సీఎం అయ్యారు. చంద్రబాబు 1978లోనే ఎమ్మెల్యే అయి మంత్రి కూడా ఆ తరువాత అయ్యారు. ఇక 1995లో సీఎం అయిపోయారు. మోడీ అయితే 2001లో ఎమ్మెల్యే మంత్రి కాకుండానే నేరుగా సీఎం అయ్యారు. అలా చూసినా చంద్రబాబు సీఎం గా సీనియర్ అని చెప్పాలి.

దృఢంగానే కొనసాగుతూ :

ఇక ఈ ముగ్గురిలో మరో పోలిక ఉంది. డెబ్బై అయిదేళ్ళు నిండినా కూడా రాజకీయంగా ముగ్గురూ ఈ రోజుకీ కీలకంగా ఉన్నారు. అంతే కాదు ముఖ్యమంత్రులుగా నితీష్ కుమార్ బాబు ఉంటే మోడీ ప్రధానిగా ఉన్నారు. ముగ్గురిదీ ముఖ్యమంత్రులుగా ఘనమైన రికార్డు అని చెప్పాలి. మోడీ పదమూడేళ్ళ పాటు సీఎం గా ఏకధాటిగా చేశారు. నితీష్ కూడా ఏకధాటిగా ఇరవై ఏళ్ళకు పైగా చేస్తూ వస్తున్నారు. బాబు ఈ మధ్యనే పదిహేనేళ్ల సీఎం గా తన రికార్డుని స్థాపించారు.

అన్నింటా సమర్ధులే :

మోడీకి జాతీయ పార్టీ బీజేపీ అండ ఉంది. దాంతో పాటు ఆయన వ్యూహాలు రాజకీయ చతురత కలసి రావడంతో ప్రధానిగా అయిపోయారు. కానీ చంద్రబాబు నితీష్ కుమార్ ఇద్దరూ కూడా ప్రధాని పదవికి అర్హులే అని అంటారు. ఇద్దరికీ ఈ పదవి వచ్చి అలా దోబూచులాడింది. బాబు విషయం తీసుకుంటే 1996లోనే ఆయనకు ప్రధానిగా అయ్యే చాన్స్ వచ్చింది, తిరస్కరించారు. ఇక నితీష్ కుమార్ ఎన్డీయేలో ఉండగానే ప్రధాని అభ్యర్ధిగా రేసులో ఉండేవారు, అయితే మోడీ ఎంట్రీతో ఆయన వెనక్కి తగ్గాల్సి వచ్చింది.

మిత్ర బంధం బలంగా :

ఈ ముగ్గురూ ఈ రోజున జాతీయ రాజకీయాల్లో కీలకంగా ఉన్నారు. ఈ ముగ్గురూ కలిస్తేనే కేంద్రంలో ఎన్డీయే ఉంది. ఇందులో ఏ ఒక్కరు విభేదించినా కూడా రధ చక్రానికి బ్రేకులు పడతాయి. అయితే ఒకరి మీద మరొకరికి గురి ఉంది. రాజకీయంగా విశేష అనుభవం కలిగిన ఈ నేతలు అనీ దాటుకుని వచ్చిన వారు కావడంతో జనతా ప్రయోగంగానో నేషనల్ ఫ్రంట్ యునైటెడ్ ఫ్రంట్ ప్రయోగంగానో కాకుండా ఎన్డీయే సుస్థిరంగా ముందుకు సాగుతోంది అని అంటున్నారు. ఈ ఎన్డీయే త్రయం మీదనే ఇండియా కూటమి గురి ఉంది. మరి ఈ ముగ్గురూ ముగ్గురే కాబట్టి విపక్షాల ఎత్తులు ఎప్పటికపుడు తుత్తునియలు అవుతున్నాయని అంటున్నారు.