Begin typing your search above and press return to search.

ప్రైవేటు తగ్గించింది.. ప్రభుత్వం స్పందించాలి.. మోడీ జీ జర ‘పెట్రో’ మంటలార్పండి..

దేశంలో ఇంధన ధరల సెగ సామాన్యుడిని ఏ స్థాయిలో దహించివేస్తోందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.

By:  A.N.Kumar   |   1 July 2026 10:53 AM IST
ప్రైవేటు తగ్గించింది.. ప్రభుత్వం స్పందించాలి.. మోడీ జీ జర ‘పెట్రో’ మంటలార్పండి..
X

దేశంలో ఇంధన ధరల సెగ సామాన్యుడిని ఏ స్థాయిలో దహించివేస్తోందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. లీటరు పెట్రోల్, డీజిల్ ధర వంద దాటి పరుగులు తీస్తుంటే.. ఆ భారం సరుకుల రవాణాపై పడి కూరగాయల నుంచి నిత్యావసరాల వరకు అన్నింటి ధరలనూ ఆకాశానికి ఎత్తేసింది. ఇలాంటి క్లిష్ట సమయంలో దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ ఇంధన రిటైలర్ 'నయారా ఎనర్జీ' తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా సరికొత్త చర్చకు తెరలేపింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు (క్రూడ్ ఆయిల్) ధరలు తగ్గిన నేపథ్యంలో.. ఆ ప్రయోజనాన్ని నేరుగా వినియోగదారులకు బదిలీ చేస్తూ పెట్రోల్‌పై లీటరుకు రూ.5, డీజిల్‌పై రూ.3 తగ్గిస్తున్నట్లు నయారా ప్రకటించింది. దేశవ్యాప్తంగా 7 వేలకు పైగా బంకులు ఉన్న ఒక ప్రైవేట్ సంస్థ లాభాలను కొంత పక్కనబెట్టి ఈ నిర్ణయం తీసుకోగలిగినప్పుడు.. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాల్సిన ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఎందుకు మౌనం వహిస్తున్నాయనేదే ప్రస్తుత యక్షప్రశ్న.

ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి ప్రభుత్వ రంగ సంస్థలు దేశీయ మార్కెట్‌లో సింహభాగాన్ని నియంత్రిస్తున్నాయి. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినప్పుడు ‘మార్కెట్ డైనమిక్స్’ పేరుతో మరుసటి రోజే ధరలను పెంచే ఈ సంస్థలు, అంతర్జాతీయంగా ధరలు తగ్గినప్పుడు మాత్రం ఆ ప్రయోజనాన్ని సామాన్యుడికి చేర్చడంలో ఎందుకు తాత్సారం చేస్తున్నాయనే విమర్శల్లో నిజం లేకపోలేదు. చమురు సంస్థలు గడించిన భారీ లాభాల వెనుక సామాన్యుడి జేబుకు పడిన చిల్లే ఉందనేది బహిరంగ రహస్యం.

ఇంధన ధరల నియంత్రణ అనేది కేవలం ఒక వాణిజ్య నిర్ణయం కాదు.. అది దేశ ఆర్థిక వ్యవస్థను, కోట్లాది కుటుంబాల బతుకు బండిని శాసించే సామాజిక బాధ్యత. ప్రభుత్వాలు అంతర్జాతీయ మార్కెట్ సాకును చూపడం మానేసి, తమ పన్నుల విధానాన్ని పునఃసమీక్షించాల్సిన సమయం ఆసన్నమైంది. కేంద్ర ప్రభుత్వం విధించే ఎక్సైజ్ సుంకాలు, రాష్ట్రాలు వసూలు చేసే వ్యాట్ ల వల్లే ఇంధన ధరలు సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోతున్నాయి. ఇంధన ధరలు తగ్గితే రవాణా రంగానికి ఊరట లభించడమే కాకుండా ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చి నిత్యావసరాల ధరలు తగ్గుతాయి. ఇది అటు వ్యవసాయానికి, ఇటు పరిశ్రమలకు సరికొత్త ఉత్తేజాన్ని ఇస్తుంది.

ప్రైవేట్ రంగం చొరవ చూపి మార్గాన్ని సుగమం చేసిన వేళ.. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. పన్నుల భారాన్ని తగ్గించి, ప్రభుత్వ రంగ చమురు సంస్థల ద్వారా ధరల తగ్గింపు నిర్ణయాన్ని ప్రకటించడమే ఇందుకు ఏకైక మార్గం. "ప్రైవేటు తగ్గించింది.. ప్రభుత్వమూ స్పందించాలి" అనే ప్రజా ఆకాంక్షను మన్నించి.. దేశవ్యాప్తంగా రగులుతున్న 'పెట్రో' మంటలను చల్లార్చాల్సిన బాధ్యత ముమ్మాటికీ పాలకులదే.