పదవి పోయాక పుట్టిన ప్రేమ.. పీఓకే ప్రధాని కావాలంటున్న నవాజ్ షరీఫ్.. నెటిజన్ల సెటైర్లు
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లో ఎన్నికల వేడి ఇప్పటికే రగులుతుండగా పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలు ఆ మంటలకు మరింత నెయ్యి పోశాయి.
By: A.N.Kumar | 23 July 2026 1:30 PM ISTపాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లో ఎన్నికల వేడి ఇప్పటికే రగులుతుండగా పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలు ఆ మంటలకు మరింత నెయ్యి పోశాయి. ముజఫరాబాద్‌లో జరిగిన ఒక ప్రచార సభలో నవాజ్ షరీఫ్ మాట్లాడుతూ "పీఓకే నాకు రెండో ఇల్లు. మా పూర్వీకుల మూలాలు ఇక్కడే ఉన్నాయి. ఈసారి మా పార్టీ గెలిస్తే నన్ను పీఓకే ప్రధానిగా చేయమని షెహ్‌బాజ్ షరీఫ్‌ను కోరుతాను" అంటూ సెంటిమెంట్ కార్డు ప్లే చేశారు. అక్కడి అభివృద్ధిని తానే స్వయంగా పర్యవేక్షిస్తానని కూడా గొప్పగా ప్రకటించారు.
నవాజ్ నోటి నుంచి ఈ మాటలు రాగానే సోషల్ మీడియాలో నెటిజన్లు, వ్యంగ్యాస్త్రాలతో విరుచుకుపడ్డారు. "అయ్యా షరీఫ్ గారూ! మూడేసి సార్లు పాకిస్థాన్ ప్రధానిగా వెలిగినప్పుడు లేని 'రెండో ఇంటి ప్రేమ' ఇప్పుడే కొత్తగా పుట్టుకొచ్చిందా?" అంటూ మీమ్స్, సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు.
సోషల్ మీడియా సెటైర్ల హోరు
"మూడు సార్లు పీఠంపై కూర్చున్నప్పుడు పీఓకే కష్టాలు కనిపించలేదు కానీ పదవి ఊడాక మాత్రం సడన్‌గా పూర్వీకుల మూలాలు గుర్తొచ్చాయా? సొంత దేశ ఆర్థిక వ్యవస్థనే దారిలో పెట్టలేకపోయారు, ఇక కొత్తగా వచ్చి పీఓకే రూపురేఖలు మార్చేస్తారా?" అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. పాకిస్థాన్ ప్రధాని పీఠం దక్కకపోయేసరికి.. కనీసం పీఓకే ప్రధాని పదవైనా దక్కితే చాలనే రేంజ్‌కు షరీఫ్ దిగజారిపోయాడని అంటున్నారు.
క్షేత్రస్థాయి పరిస్థితి ఏంటి?
ప్రస్తుతం పీఓకే తీవ్రమైన విద్యుత్ కొరత, విపరీతంగా పెరిగిన ధరలు, నిరుద్యోగం, సరైన పరిపాలన లేక అల్లకల్లోలంగా ఉంది. ప్రజలు రోడ్లెక్కి నిరసనలు తెలుపుతున్న తరుణంలో.. నవాజ్ షరీఫ్ ఇచ్చే హామీలను జనాలు అస్సలు నమ్మేలా లేరని విశ్లేషకులు భావిస్తున్నారు. రెండో ఇల్లు అని చెప్పడం చాలా తేలికే బాస్! కానీ ఇన్నేళ్లుగా ఆ ఇంటి కప్పు కారుతుంటే పటించుకోకుండా ఇప్పుడు ఎన్నికలొచ్చేసరికి ఇంటి యజమానినవుతానంటే ఎవరు నమ్ముతారు? అంటూ నిలదీస్తున్నారు.
మొత్తానికి ఎన్నికల వేళ ఓట్ల కోసం వేసిన ఈ 'సెంటిమెంట్ ఎత్తుగడ' నవాజ్ షరీఫ్‌కు అల్టిమేట్ ట్రోల్ మెటీరియల్‌గా మారింది. "పదవి పోయాక పుట్టిన ఈ ప్రేమను చూసి పీఓకే ప్రజలు నవ్వుకోవాలో.. ఏడువాలో అర్థం కావడం లేదబ్బా" అన్నదే ప్రస్తుత హాట్ టాపిక్..
