Begin typing your search above and press return to search.

హనీట్రాప్ వలలో చిక్కిన నేవీ సైలర్ ప్రదీప్.. రక్షణ రహస్యాలు లీక్.. అరెస్ట్

దేశ భద్రతకు సంబంధించిన అత్యంత సున్నితమైన, కీలకమైన సమాచారాన్ని విదేశీ గూఢచార సంస్థలకు చేరవేస్తున్నారనే ఆరోపణలపై ఇండియన్ నేవీ చెందిన ఓ సైలర్‌ను ఆంధ్రప్రదేశ్ కౌంటర్ ఇంటెలిజెన్స్ (సిఐ) అధికారులు అరెస్ట్ చేశారు.

By:  A.N.Kumar   |   5 Oct 2026 12:31 AM IST
హనీట్రాప్ వలలో చిక్కిన నేవీ సైలర్ ప్రదీప్.. రక్షణ రహస్యాలు లీక్.. అరెస్ట్
X

దేశ భద్రతకు సంబంధించిన అత్యంత సున్నితమైన, కీలకమైన సమాచారాన్ని విదేశీ గూఢచార సంస్థలకు చేరవేస్తున్నారనే ఆరోపణలపై ఇండియన్ నేవీ చెందిన ఓ సైలర్‌ను ఆంధ్రప్రదేశ్ కౌంటర్ ఇంటెలిజెన్స్ (సిఐ) అధికారులు అరెస్ట్ చేశారు. విశాఖపట్నం కేంద్రంగా పనిచేస్తున్న నేవీ వర్గాల్లో ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.

సమాచారం ప్రకారం.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ప్రదీప్ ముఖర్జీ 2014లో భారత నావికాదళంలో చేరారు. కొంతకాలం క్రితం సోషల్ మీడియా వేదికగా అతడికి ఓ పాకిస్థానీ మహిళ పరిచయమైంది. ఆ పరిచయం కాస్తా సన్నిహిత సంబంధంగా మారడంతో ప్రదీప్ సదరు మహిళ విసిరిన 'హనీట్రాప్' వలలో చిక్కుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే విశాఖపట్నం నేవల్ స్థావరాలు, యుద్ధనౌకల కదలికలు, నౌకాదళ ఆపరేషనల్ బేస్‌లు, ఇతర రక్షణ ఆస్తులకు సంబంధించిన అత్యంత రహస్య వివరాలను సేకరించి పాకిస్థానీ గూఢచార సంస్థ ఆపరేటివ్‌‌కు చేరవేసినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి.

గత కొంతకాలంగా ప్రదీప్ అనుమానాస్పద డిజిటల్ కార్యకలాపాలు, ఆన్‌లైన్ సంచారముపై నిఘా ఉంచిన కౌంటర్ ఇంటెలిజెన్స్ బృందం, నావికాదళ ఉన్నతాధికారుల నుండి ముందస్తు అనుమతి పొందింది. తమిళనాడులోని కోయంబత్తూరులో గల 'ఐఎన్ఎస్ అగ్రణి' శిక్షణ కేంద్రంలో మేనేజ్‌‌మెంట్ కోర్సు కోసమని వెళ్లిన ప్రదీప్‌ను అధికారులు అక్కడ అదుపులోకి తీసుకున్నారు. అనంతరం స్థానిక న్యాయస్థానంలో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్ పొందగా అక్కడి నుంచి విజయవాడకు తరలించారు.

ఈ కుట్ర వెనుక ఉన్న ఆర్థిక లావాదేవీల కోణంలోనూ దర్యాప్తు సంస్థలు లోతుగా పరిశీలిస్తున్నాయి. సమాచార లీకేజీకి ప్రతిఫలంగా అతడికి ఆన్‌లైన్ బ్యాంకింగ్, డిజిటల్ వ్యాలెట్లు లేదా హవాలా మార్గాల ద్వారా ఏమైనా నగదు అందిందా? అనే వివరాలు తెలుసుకునేందుకు బ్యాంక్ ఖాతాలను, క్రెడిట్ కార్డ్ లావాదేవీలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.

సున్నితమైన ప్రాంతాలు, రక్షణ రంగ స్థావరాలలో పనిచేసే సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని విదేశీ గూఢచార సంస్థలు సోషల్ మీడియా వేదికగా విసురుతున్న హనీట్రాప్ నెట్‌వర్క్‌పై అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రదీప్ నుంచి ఎంతటి తీవ్రమైన సమాచారం లీక్ అయింది? ఈ కుట్రలో ఇంకా ఎవరైనా సహకరించారా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. త్వరలోనే పూర్తిస్థాయి ఆధారాలతో కేసుకు సంబంధించిన మరిన్ని నిజాలు వెలుగులోకి రానున్నాయి.