Begin typing your search above and press return to search.

ట్రంప్‌కు ఈ' సారీ' 'శాంతి' లేదు.. భారత సంతతి మహిళకు నోబెల్ బహుమతి

ట్రంప్ మావ ఆశలపై నీళ్లు చల్లుతూ.. భారతీయ తమిళ మూలాలున్న దక్షిణాఫ్రికా రజనీకాంత్.. అదేనండి న్యాయకోవిదురాలు నవనీతమ్ ‘నవీ’ పిళ్లై కు నోబెల్ శాంతి బహుమతి దక్కింది.

By:  A.N.Kumar   |   9 Oct 2026 6:17 PM IST
ట్రంప్‌కు ఈ సారీ శాంతి లేదు.. భారత సంతతి మహిళకు నోబెల్ బహుమతి
X

అంతర్జాతీయ వేదికలపై "నా వల్లనే ప్రపంచం ప్రశాంతంగా ఉంది, లేకపోతే ఏనాడో మూడో ప్రపంచ యుద్ధం వచ్చేది" అని డప్పు కొట్టుకోవడంలో మన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రూటే వేరు. చిన్నప్పుడు స్కూల్లో పిల్లలు గోలీల ఆటలో గొడవపడితే సర్దిజెప్పినట్లు.. ఇండియా-పాకిస్తాన్, కంబోడియా-థాయ్ లాండ్, ఉత్తర కొరియా-అమెరికా, రష్యా-ఉక్రెయిన్ ఇలా ఏ పంచాయతీ కనిపించినా "నేనే పోయి తీర్చా" అని చెప్పే ట్రంప్ మావకు నోబెల్ కమిటీ మరోసారి మైండ్ బ్లాకింగ్ షాక్ ఇచ్చింది.

ఎప్పటి నుంచో తన డ్రీమ్ లిస్ట్‌లో అగ్రస్థానంలో ఉన్న 'నోబెల్ శాంతి బహుమతి' ఈసారి కూడా ఆయన చేతికి చిక్కలేదు. "నేను లేకపోతే డజను యుద్ధాలు జరిగేవి.. నా దయాదాక్షిణ్యాల వల్లే ప్రపంచానికి శాంతి లభించింది" అని ఆయన ఎంత మొత్తుకున్నా నోబెల్ కమిటీ మాత్రం రెండు చెవుల్లో సీసం పోసుకుని కూర్చున్నట్లు వ్యవహరించింది పాపం..

భారత సంతతి మహిళకు అత్యున్నత గుర్తింపు

ట్రంప్ మావ ఆశలపై నీళ్లు చల్లుతూ.. భారతీయ తమిళ మూలాలున్న దక్షిణాఫ్రికా రజనీకాంత్.. అదేనండి న్యాయకోవిదురాలు నవనీతమ్ ‘నవీ’ పిళ్లై కు నోబెల్ శాంతి బహుమతి దక్కింది. దశాబ్దాలుగా మానవ హక్కుల పరిరక్షణ కోసం జాతి వివక్షకు వ్యతిరేకంగా అలాగే ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్‌గా సేవలు అందించిన నవీ పిళ్లై లాంటి మహనీయులకు ఈ రకమైన గౌరవం దక్కడం ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. యుద్ధ నేరస్థులను అంతర్జాతీయ బోనులో నిలబెట్టడంలో ఆమె చూపిన ధైర్యం ముందర, "నేను పది నిమిషాల్లో యుద్ధం ఆపేస్తా" అని సోషల్ మీడియాలో స్టేట్‌మెంట్లు ఇచ్చే ట్రంప్ మార్కు శాంతి ప్రయత్నాలు చిన్నబోయాయనడంలో సందేహం లేదు.

వైట్ హౌస్ పరిసరాల్లో వణుకు.. తదుపరి ట్వీట్ల దండయాత్ర ఏంటి?

మన ట్రంప్ మావ టెంపర్ ఎలాంటిదో ప్రపంచానికి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. "నేను ప్రపంచాన్ని కాపాడాను.. అయినా నాకు అవార్డు ఇవ్వరా?" అని గతంలోనే మైకులు పగలగొట్టేలా ఆవేదన వ్యక్తం చేసిన ఆయన ఇప్పుడు ఈ వార్త విని ఎవరిపై ట్వీట్ల దండయాత్ర మొదలుపెడతారోనని వైట్ హౌస్ నాయకులు, డెమోక్రాట్లు భయంతో వణికిపోతున్నారు. నోబెల్ కమిటీ సభ్యులను తన ఆనవాయితీ ప్రకారం వెంటనే 'ఫేక్ న్యూస్' బ్యాచ్‌లో చేరుస్తారా? "అసలు ఆ నోబెల్ అవార్డే ఒక వేస్ట్ నా డీల్ మేకింగ్ స్కిల్స్ ముందు అదెంత?" అని ప్రెస్ మీట్ పెట్టి సెలవిస్తారా? "ఆ నోబెల్ కమిటీ ప్రెసిడెంట్ నా సీక్రెట్ అభిమాని కాకపోతే చైనా ఒత్తిడి వల్లే నాకు ఇవ్వలేకపోయారు" అని సరికొత్త సిద్ధాంతాన్ని తెరపైకి తెస్తారా? అనేది ఇప్పుడు నెటిజన్లకు ఆసక్తికరమైన అంశంగా మారింది.

ఆత్మస్తుతికి కాదయ్య.. సేవా నిరతికే దక్కుతుంది

ఏది ఏమైనా ప్రచార ఆర్భాటాలు, కెమెరాల ముందు డ్రామాలు, ఆత్మస్తుతులతో నోబెల్ వంటి అత్యున్నత పురస్కారాలు రావని.. నిశ్శబ్దంగా, నిబద్ధతతో మానవాళి కోసం, బాధితుల న్యాయం కోసం పనిచేసే నవీ పిళ్లై లాంటి ధీరులకే నిజమైన 'శాంతి' లభిస్తుందని నోబెల్ కమిటీ మరోసారి నొక్కి చెప్పినట్లయింది.

ట్రంప్ గారూ.. మైకులు పట్టుకుని ఆర్డర్లు వేయడం కాకుండా వచ్చేసారైనా ఎవరికైనా ఫ్రెండ్‌షిప్ బ్యాండ్లు కట్టి ప్రసన్నం చేసుకోవడమో లేక కనీసం కమిటీకి కొద్దిగా గిఫ్ట్ ప్యాక్‌లు పంపడమో చేస్తే ఏమైనా వర్కవుట్ అవుతుందేమో ఆలోచించండి సార్..